ఎవరీ సుధీర్? ఆ వీడియోనే హత్యకు దారి తీసిందా..? కూకట్‌పల్లి హత్య వెనుక మిస్టరీ.!

స్నేహితులతో కలిసి ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని నలుగురు దుండగులు అడ్డగించారు.. వేట కొడవళ్లతో దాడి చేయబోయారు.. అప్రమత్తమైన ఆ విద్యార్థి తప్పించుకొని ఓ స్కూల్‌ బస్సును ఎక్కాడు. దుండగులు కూడా బస్సెక్కి అతన్ని కిందకు లాక్కొచ్చారు. నడిరోడ్డుపై జనం చూస్తుండగానే వేట కొడవళ్లతో నరికి చంపేశారు! సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణ హత్య కూకట్‌పల్లిలో కలకలం రేపింది. హత్యకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటలోని జనతానగర్‌లో నివాసముంటూ పాలవ్యాపారం చేసే ఎలగల రాజు, రాణి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నవాడైన సుధీర్‌ (19) ఇంటర్‌ ఫెయిలయ్యాడు.

సోమవారం ఉదయం 8గంటల సమయంలో స్నేహితులు సాయికృష్ణ, మేఘనాథ్‌లతో కలిసి బైకుపై కూకట్‌పల్లిలోని పరీక్షాకేంద్రానికి బయలుదేరాడు. కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌ వద్దకు రాగానే.. మూసాపేట జిల్లెల బస్తీకి చెందిన జిల్లా మహేష్‌ అతని స్నేహితులు బైపేట నవీన్‌, కొర్రె తేజ, ఇ.కృష్ణలు సుధీర్‌ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. సుధీర్‌పై వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. సుధీర్‌ తప్పించుకొని పరుగెత్తుకొంటూ వెళ్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ స్కూల్‌ బస్సు ఎక్కాడు. దుండగులు ఆ బస్సెక్కి సుధీర్‌ను కిందకు లాక్కొచ్చి రోడ్డుపై పడేసి వేటకొడవళ్లతో నరికి చంపేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై అందరూ చూస్తుండగానే హత్య జరగడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యా రు. కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజు, ప్రభాకర్‌, అంజి, మల్లేష్‌లు రికవరీ వాహనంలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.


వారంతా దుండగులను నిలువరించేందుకు వెళ్లారు. అప్పటికే సుధీర్‌ రహదారిపై పడిపోగా.. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. మహేష్‌, కృష్ణ, తేజలు వైజంక్షన్‌ వైపు పారిపోగా.. నవీన్‌ను ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకొన్నారు. ఈ క్రమంలో నవీన్‌ తన చేతిలో ఉన్న వేటకొడవలితో పోలీసులపై దాడి చేయబోయాడు. కానిస్టేబుళ్లు ప్రభాకర్‌, అంజి ప్రాణాలకు తెగించి నవీన్‌ను పట్టుకొన్నారు. బస్తీ గొడవలు హత్యకు దారి తీయడంతో స్థానికంగా ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు నిందితుల కో సం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తన కుమారుడు చావు కు కారణమైన మహేష్‌, బైపేట నవీన్‌, కొర్రె తేజ, కృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ సుధీర్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య వెనక మూసాపేటకు చెందిన వంశీయాదవ్‌ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్తీల్లో 2వర్గాల మధ్య జరిగే గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది.

వీడియోనే ప్రాణం తీసిందా?

సుధీర్‌ తండ్రి రాజు మూసాపేటలో పాల వ్యాపారం చేస్తుంటాడు. తన దుకాణంలో పాలప్యాకెట్లు పోతుండడంతో అనుమానం వచ్చి నిఘా పెట్టాడు. నిందితుల్లో ఒకరైన కృష్ణ పాల ప్యాకెట్లు దొంగిలిస్తుండగా రాజు వీడియో తీశాడు. అది గమనించిన కృష్ణ రాజుతో వాగ్వాదానికి దిగిఅతన్ని బెదిరించాడు. తండ్రిని బెదిరించిన విషయం తెలుసుకున్న సుధీర్‌ కృష్ణ దగ్గరకు వెళ్లి చంపేస్తానని బెదిరించాడు. దీంతో సుధీర్‌పై కక్ష పెంచుకున్న కృష్ణ.. పథకం ప్రకారం అతన్ని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top