ఇంజినీరింగ్ చదివిన యువకుడు చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి మారుమూల గ్రామాలకు సౌర విద్యుత్‌ను అందిస్తున్నాడు..!

తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరిని, మాతృభూమిని మరువ కూడదని పెద్దలు చెబుతారు. అయితే ఈ విషయాన్ని మనలో అధిక శాతం మంది పాటించరు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఆ యువకుడు మాత్రం అలా కాదు. ఇంజినీరింగ్ పట్టభద్రుడై, ఎంతో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్నా తన ఊరి కోసం ఆ ఉద్యోగాన్ని కూడా మానేశాడు. అక్కడి ప్రజల ఇండ్లలో సౌర వెలుగులు నింపుతున్నాడు. అతనే జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పరాస్ లూంబా.

పరాస్ లూంబాది జమ్మూ కాశ్మీర్‌లోని లదాఖ్ ప్రాంతం. అక్కడ ఓ మారుమూల గ్రామంలో పెరిగాడు. అనంతరం నగరానికి మారి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. నైపుణ్యం కలిగిన యువకుడు కావడంతో చిన్నతనంలో ఎంతో పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉద్యోగం లభించింది. కాగా 2012లో అంటార్కిటికాకు విహార యాత్ర నిమిత్తమై అతను వెళ్లాడు. అక్కడే సౌరశక్తి వాడకంపై పలు విషయాలు తెలుసుకున్నాడు. అయితే అలా తెలుసుకోవడమే అతని జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలోనే పరాస్ తన ఊరి వారికి కూడా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు.

ladakh-solar-power

పరాస్ లూంబా అనుకున్నదే తడవుగా తన ఉద్యోగాన్ని మానేశాడు. అనంతరం సొంత ఊరికి వచ్చి అక్కడే స్థిర పడ్డాడు. అక్కడ స్థానికులు విద్యుత్ లేని కారణంగా పడుతున్న ఇబ్బందులను తొలగించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పిడిషన్ (జీహెచ్‌ఈ) పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దాని ద్వారా తన గ్రామంలో ఉన్న వారికి సౌర శక్తి ద్వారా విద్యుత్‌ను అందించడం మొదలు పెట్టాడు. స్వతహాగా ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావడంతో పరాస్ స్వయంగా ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. పలు ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా అక్కడి ప్రజలకు విద్యుత్‌ను అందించేవాడు. అలా అలా అతను ఇప్పుడు ఆ గ్రామంలో దాదాపు అన్ని ఇండ్లకు విద్యుత్‌ను అందించగలుగుతున్నాడు. అక్కడి ప్రజలు టీవీలు కూడా సౌర శక్తి ద్వారా తయారైన విద్యుత్‌తోనే చూస్తారంటే నమ్మశక్యం కావడం లేదు కదూ!

అయితే కేవలం ఆ గ్రామంతోనే పరాస్ ఆగిపోలేదు. అక్కడ ఉన్న దాదాపు 8 గ్రామాల్లోనూ సౌర శక్తి గ్రిడ్‌లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను అందించడం కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. కాగా ఈ సౌర విద్యుత్ కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా! అక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి. అవును, ఆ గ్రామాల్లో ఎక్కువగా కొండలు, గుట్టలు ఉండడంతో పర్యాటకులు అక్కడికి ఎక్కువగా ట్రెక్కింగ్ కోసం వస్తారు. దీంతో వారికి ఆ గ్రామాల్లోని ఇండ్లలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి వారిచ్చే డబ్బులోంచి కొంత ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు.

ladakh-solar-power

తమ తమ గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా తాము వేడుకుంటున్నా ప్రభుత్వాలు తమను కరుణించ లేదని, అయితే పరాస్ లూంబా మాత్రం సౌర విద్యుత్‌తో తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని ఆ గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కరెంట్ సదుపాయాన్ని అందించాలన్న తపనతో పరాస్ లూంబా చేస్తున్న కృషికి అతన్ని మనం నిజంగా అభినందించాల్సిందే. అతనిలా ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే దేశంలో కరెంటు లేని గ్రామాలు అసలు ఉండవేమో!

Comments

comments

Share this post

scroll to top