క‌న్నీళ్లు పెట్టిస్తున్న 8 ఏళ్ళ చిన్నారి రియ‌ల్ స్టోరి!

”నా తండ్రి ఎక్క‌డున్నాడు..? నా త‌ల్లి ఎక్క‌డుంది..? వారిద్ద‌రూ రోజూ నా క‌ల‌లో క‌నిపిస్తారు. తెల్లారేస‌రికి మాయ‌మ‌వుతారు. వారిక నాకు క‌నిపించరా..? నేనెప్పుడు వారిని క‌లుస్తాను..?” ఇది… ఓ 8 ఏళ్ల చిన్నారి ఆవేద‌న‌. ఇది క‌థ ఎంత మాత్రం కాదు. నిజంగా జ‌రిగిన వాస్త‌వ సంఘ‌ట‌న‌. పుట్టిన బిడ్డ‌కు న్యూమోనియా వ్యాధి ఉంద‌ని చెప్పి ఆ చిన్నారిని నెల‌ల ప‌సికందుగా ఉన్న‌ప్పుడే ఆ త‌ల్లి దండ్రులు వేరొక‌రి ఇంటి ఎదుట వ‌ద‌లి వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆ ఇంటి వారు ఎంతో క‌రుణ చూపించి ఆ ప‌సికందును చేర దీసి పెంచారు. ఇప్పుడా చిన్నారికి త‌న త‌ల్లిదండ్రులు చేసిన త‌ప్పు తెలిసింది. అయినప్ప‌టికీ వారి ఆల‌న పాల‌నలో పెరగాల‌ని ఆ బాలిక ఆరాటం..!

ఆ బాలిక పేరు యాంగ్ షియుషియా (Yang Xiuxia). ఉంటోంది చైనాలోని డాంగువ‌న్ సిటీ టాంగ్‌షియా గ్రామంలో. ఒక‌ప్పుడు అదే గ్రామంలో ఆ చిన్నారి నెల‌ల ప‌సికందుగా ఉన్న‌ప్పుడు ఆమెను ఆమె తల్లిదండ్రులు ప‌క్క‌నే ఉన్న మ‌రో ఇంటి ఎదుట ఆరుబయ‌ట అర్థ‌రాత్రి పూట వ‌దిలి వెళ్లారు. దీంతో యాంగ్ అరుపులు విన్న ఆ ఇంటి ఆవిడ హువాంగ్ మెంగ్యి (70) బ‌య‌టికి వ‌చ్చి చూడ‌గా యాంగ్ ప‌సికందుగా క‌నిపించింది. దీంతో ఆమెను హువాంగ్ అక్కున చేర్చుకుంది. సొంత మ‌న‌వ‌రాలిలా పెంచింది. హువాంగ్ రిటైర్డ్ మిల‌ట‌రీ డాక్ట‌ర్‌. గ‌తంలోనూ ఇలాగే త‌ల్లిదండ్రుల చేత వ‌ద‌లి వేయ బ‌డ్డ ఓ బాలున్ని పెంచి 26 ఏళ్ల వ‌ర‌కు పెద్ద చేసి ఓ ఇంటి వాన్ని చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ యాంగ్ దొర‌క‌డంతో ఆమెను కూడా హువాంగ్ అలాగే పెంచుతోంది.

ఈ క్ర‌మంలో యాంగ్‌కు ఇప్పుడు 8 ఏళ్లు వ‌చ్చాయి. ఆమెకు ఉన్న న్యుమోనియా వ్యాధి కూడా పోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉంది. అయితే ఆ చిన్నారికి త‌న త‌ల్లిదండ్రులు త‌న‌ను నిర్దాక్షిణ్యంగా వ‌దిలి వేశార‌ని తెలుసు. అయినా… వారి ఆల‌న పాల‌న కోస‌మే యాంగ్ ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలోనే తాను ఉంటున్న ఇంటి బ‌య‌ట ఓ కూర‌గాయ‌ల షాపు పెట్టుకుని అక్క‌డే వారి కోసం ఎదురు చూస్తోంది. ఆ షాపు ఎదుట ఓ బోర్డు కూడా యాంగ్ ఏర్పాటు చేసింది. అందులో ఏముందంటే… ”అమ్మా, నాన్నా… మీరెక్క‌డున్నారు..? 2008లో మీరు న‌న్ను వ‌దిలి వెళ్లారు. అర్థ‌రాత్రి పూట నిర్దాక్షిణ్యంగా ఓ ఇంటి బ‌య‌ట వ‌దిలి పెట్టి మీరు వెళ్లిపోయారు. అయినా ఒక‌ప్పుడు మీరనుకున్న‌ట్టుగా ఇప్పుడు నేను లేను. చాలా ఆరోగ్యంగా ఉన్నా. మీరెప్పుడు వ‌చ్చి న‌న్ను తీసుకెళ్తారు..? లేదంటే ఈ బామ్మ చ‌నిపోతే అప్పుడు నేను అనాథాశ్ర‌మంలో పెర‌గాలి..!” అంటూ బోర్డు ద్వారా త‌న ఆవేన‌ను తెలియ‌జేస్తోంది యాంగ్‌. ఇప్పుడీ చిన్నారి విష‌యం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిజంగా ఆ త‌ల్లిదండ్రులకు గ‌న‌క మ‌న‌స్స‌నేది ఉంటే ఇప్ప‌టికైనా యాంగ్‌ను చేర‌దీసేందుకు వ‌స్తార‌ని, ఆ చిన్నారి ఆవేద‌న‌ను తీరుస్తార‌ని ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top