మీ జీవిత భాగ‌స్వామికి ఈ విష‌యాల‌ను మాత్రం క‌చ్చితంగా చెప్పాల్సిందే. అవేమిటో తెలుసా..?

మన దేశంలో సాధార‌ణంగా ఎక్కువ‌గా ఉద్యోగం చేసే పురుషులంద‌రూ కుటుంబ వ్య‌వ‌హారాల‌ను చూస్తూ కుటుంబాల‌కు పెద్ద‌గా, య‌జ‌మానిగా ఉంటారు. స్త్రీలు కూడా ఉద్యోగం చేసే వారు ఉంటారు. అయితే ఎవ‌రు ఉద్యోగం చేసినా, లేదంటే వ్యాపారం చేసినా కుటుంబ య‌జ‌మానిగా ఉంటే మాత్రం ఇప్పుడు మేం చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే అక‌స్మాత్తుగా కుటుంబ యజ‌మాని మ‌ర‌ణిస్తే అత‌ను లేదా ఆమెపై ఆధార ప‌డ్డ కుటుంబ స‌భ్యుల‌కు ఇబ్బందులు ఎదురు కాకూడ‌దు. డ‌బ్బు విషయంలో ఆ ఇబ్బందులు ఉంటాయి. అంతే కాదు, బ్యాంకు అకౌంట్లు, బీమా పాల‌సీలు, నామినీలు, ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీల లాగిన్ వివ‌రాలు, పిన్ నంబ‌ర్లు, ముఖ్య‌మైన ఈ-మెయిల్స్‌, సైట్ల లాగిన్ వివ‌రాలు, నెల నెలా ఉండే ఈఎంఐలు, అప్పుల వివ‌రాలు… ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంత లిస్ట్ అవుతుంది. అయితే ఇలాంటి వివ‌రాల‌న్నింటినీ కుటుంబ య‌జ‌మాని త‌న భాగ‌స్వామికి క‌చ్చితంగా చెప్పాలి. ఎవ‌రికి చెప్పినా, చెప్ప‌క‌పోయినా ముఖ్యంగా లైఫ్ పార్ట్‌న‌ర్‌కు మాత్రం వీటిని గురించి తెలియ‌జేయాలి. లేదంటే కుటుంబ య‌జమాని అక‌స్మాత్తుగా చ‌నిపోతే అప్పుడు కుటుంబ స‌భ్యుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

1. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ల వివ‌రాలు…
ఈ-మెయిల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్లు, క్రెడిట్‌, డెబిట్ కార్డులు పిన్ నంబ‌ర్లు, వాటి తాలూకు ఆన్‌లైన్ లాగిన్ వివ‌రాలు, యూజ‌ర్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌లు, ముఖ్య‌మైన సైట్ల యూజ‌ర్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్ లు వంటి వాటిని ఒక ఎక్సెల్ షీట్‌లో ఎంట‌ర్ చేయాలి. దానికి పాస్‌వ‌ర్డ్ పెట్టాలి. ఆ ఫైల్‌ను ఒకే చోట కాక ఒక కాపీని పెన్ డ్రైవ్‌లోకి, మ‌రో కాపీని మెయిల్‌లో పెట్టి, ఆ వివ‌రాల‌ను లైఫ్ పార్ట్‌న‌ర్‌కు చెప్పాలి. ఒక వేళ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను మారిస్తే ఆ వివ‌రాల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు లైఫ్ పార్ట్‌న‌ర్‌కు చెప్పాలి. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వివ‌రాలను కూడా ఎక్సెల్ షీటులో భద్రపరిచి పార్ట్‌న‌ర్‌కు చెప్పాలి. డ‌బ్బు సంపాదించే వారు అక‌స్మాత్తుగా చ‌నిపోతే అప్పుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు డ‌బ్బు అవ‌స‌రం ఉంటుంది. క‌నుక దాన్ని వారు సులువుగా తీసుకునేందుకు ఈ ప‌ని చేయాలి. ఇక బ్యాంక్ అకౌంట్లు, ఈ-మెయిల్‌, క్రెడిట్‌, డెబిట్ కార్డులు, ఇత‌ర అకౌంట్ల‌కు అనుసంధాన‌మైన మొబైల్ నంబ‌ర్‌ ఏదో చెప్పాలి. అది పోస్ట్ పెయిడా, ప్రీపెయిడా వంటి వివ‌రాల‌ను కూడా ఎక్సెల్ షీట్‌లో పెట్టాలి. దీంతో ఇతరులు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వ‌హించిన‌ప్పుడు ఓటీపీ నంబ‌ర్లకు, పిన్ నంబ‌ర్ల‌ను మార్చేందుకు ఇబ్బందులు ఎదురు కావు.

2. నామినీ త‌ప్ప‌నిస‌రి…
చాలా మంది వివాహం అయ్యే ముందు వ‌ర‌కు నామినీలుగా ఇంట్లో త‌ల్లిదండ్రుల పేర్ల‌ను ఇస్తారు. అయితే కొంద‌రు పెళ్లి అయినా కూడా పార్ట్‌న‌ర్ వివ‌రాల‌ను నామినీలుగా ఇవ్వ‌రు. కానీ వారు త‌ప్ప‌నిస‌రిగా పార్ట్‌న‌ర్ పిల్ల‌ల పేర్ల‌ను నామినీలుగా చేర్చాలి. ఒక‌రి క‌న్నా ఎక్కువ మందిని నామినీలుగా చేర్చే అవ‌కాశం కూడా ఇప్పుడు క‌ల్పిస్తున్నారు. క‌నుక నామినీ పేర్ల‌ను అప్‌డేట్ చేయించ‌డం విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు. లేదంటే త‌రువాత ఇబ్బందుల‌ను తెచ్చి పెడుతుంది. ఇక ఒక‌రికి మించి నామినీ పేర్ల‌ను ఇస్తుంటే ఎవ‌రెవ‌రికి ఏ ప్ర‌యోజ‌నాలు అందాలో స్ప‌ష్టంగా తెలియ‌జేయ‌వ‌చ్చు కూడా. బ్యాంకు ఖాతాలు, వేతన ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ఫిక్స్ డ్ డిపాజిట్, లాకర్ వీటికి సంబంధించిన పేర్లను ఓ జాబితాగా రాయాలి. అలాగే వీటికి గాను పాస్ వర్డ్ లను కూడా పేర్కొనాలి. ఒక్కొక్కరి పేరిట ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. ఇలా అన్ని ఖాతాల నంబర్లు, ఆ ఖాతాల సమస్త సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో తెలుసుకునే ఏర్పాటు చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ నిధులను నామినీకే చెల్లిస్తారు. క‌నుక‌ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాకు నామినీ పేరును సరిగ్గా ఇవ్వడం ఎంతో అవసరం. ఆ పేరులో తప్పులు లేకుండా చూసుకోవాలి. జీవిత బీమా అన్నది పన్ను ఆదా కోసం చేసే పథకం కాదు. తాను లేని పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు. అందుకే అన్ని బీమా పాలసీలకు నామినీ వివరాలను సరిగా ఇవ్వడమే కాకుండా ఆ వివరాలను కుటుంబ సభ్యులు తెలుసుకునే విధంగా అందుబాటులో ఉంచాలి. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు.

3. పెట్టుబడుల వివ‌రాలు…
మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు, ఇతర సాధనాల్లో కొంద‌రు పెట్టుబడులు పెడ‌తారు. అన్నింటికీ ఒకే అకౌంట్ నుంచి లావాదేవీలు నిర్వ‌హించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అందుకే పెట్టుబ‌డుల కోసం వేర్వేరు అకౌంట్ల‌ను వాడుతారు. కాబ‌ట్టి ఈ వివ‌రాల‌ను ఒకే చోట రాసి వాటిని పార్ట్‌న‌ర్‌కు చెప్పాలి. ఇక వీటికి నామినీల‌ను కూడా క‌చ్చితంగా ఇవ్వాలి. ఈ వివ‌రాల‌ను ఎక్సెల్ షీట్‌లో పొందుప‌ర‌చాలి. షేర్లలో పెట్టుబడులు ఉంటే ఏ కంపెనీలో ఎన్ని, అవి ఉన్న డీమ్యాట్ ఖాతా నంబర్, పాస్ వర్డ్, నామినీ పేరు ఇలా కీలకమైన సమాచారాన్ని పాస్ వర్డ్ తో కూడిన ఎక్సెల్ షీటులో ఉంచాలి. మ్యూచువల్ పండ్స్ అయితే, ఫోలియో నంబర్లు, పెట్టుబడి పెట్టినదెంత, ఎందుకోసం ఈ పెట్టుబడులను వినియోగించాలన్న సమాచారాన్ని కూడా పేర్కొనాలి. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ లు ఉంటే ఆ సమాచారం, గోల్డ్ బాండ్లు, డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో ఎక్కడైనా బంగారాన్ని కొని ఉంటే ఆయా ఖాతాల సమాచారాన్ని కూడా జాగ్రత్త పరచాలి. వెండిని కొన్నా సరే ఆ వివరాలను కూడా పొందుపరచాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా విలువతో కూడుకుని ఉంటాయి. వీటికి సంబంధించి స్థలం లేదా ఇల్లు ఎక్కడ ఉన్నది, డాక్యుమెంట్లు, అద్దె ఆదాయం వస్తుంటే ఆ సమాచారాన్ని పార్ట్‌న‌ర్‌కు తెలిసేలా ఉంచ‌డం మంచిది. దీంతో య‌జ‌మాని మ‌ర‌ణం అనంత‌రం లైఫ్ పార్ట్‌న‌ర్‌కు ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా ఉంటాయి. వారు ఆ స‌మాచారంతో వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు.

4. ఈఎంఐలు, అప్పులు…
గృహ రుణాలు, బైక్ లేదా కార్ రుణాలను చాలా మంది ఈఎంఐల రూపంలో చెల్లిస్తారు. ఇక వాటికి తోడు నెల నెలా చెల్లించే ఇంట‌ర్నెట్‌, టెలిఫోన్ బిల్లులు, ఇత‌ర బిల్ల‌లు, ఇంటి ప‌న్నులు, లైఫ్ ఇన్సూరెన్స్‌, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ఉంటాయి. క‌నుక వీటి వివ‌రాల‌ను కూడా జీవిత భాగ‌స్వామికి తెలిసేలా ఉంచాలి. ఒక అప్పు ఎవ‌రి ద‌గ్గ‌ర తీసుకున్నా లేదంటే ఎవ‌రికైనా ఇచ్చినా ఆ వివ‌రాల‌ను, వాటికి సంబంధించిన సాక్ష్యాల‌ను (ప్రామిస‌రీ నోట్లు, ఖాళీ చెక్కులు, డాక్యుమెంట్లు వంటివి) కూడా పార్ట్‌న‌ర్‌కు అందేలా చూడాలి. దీంతో అప్పు తీసుకున్న వారు ఎగ్గొట్టేందుకు వీలుండ‌దు. ఇక పిల్ల‌లకు స్కూల్ ఫీజులు క‌ట్టే వారు అయితే ఎంత క‌ట్టారు, ఎంత క‌ట్టాల్సి ఉంది, వాటికి రుజువులు జాగ్ర‌త్త చేయాలి. దీంతో స్కూల్ వారి నుంచి పిల్ల‌ల ఫీజుల ప‌ట్ల ఇబ్బందులు ఎదురు కావు.

5. క్లెయిమ్ ల గురించి…
య‌జ‌మాని మ‌ర‌ణిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల‌ను ఎలా క‌ల‌వాలి. క్లెయిమ్‌ల‌ను ఎలా చేసుకోవాలి. ఎంత వ‌ర‌కు బీమా ప‌రిహారం పొంద‌వ‌చ్చు. వంటి వివ‌రాల‌ను జీవిత భాగ‌స్వామికి త‌ప్ప‌నిస‌రిగా తెలియ‌జేయాలి. దీంతో య‌జ‌మాని మ‌ర‌ణించిన‌ప్ప‌టికీ బీమా ప‌రిహారం పొంద‌డం సుల‌భత‌ర‌మ‌వుతుంది. ఇలాంటి స‌మాచారం తెలియ‌క చాలా మంది న‌ష్ట‌పోతున్నారు కూడా.

6. అత్య‌వ‌స‌ర నిధి…
కుటుంబ య‌జ‌మాని మ‌ర‌ణించ‌క‌పోయినా తీవ్ర అనారోగ్యం కార‌ణంగా హాస్పిట‌ల్‌లో చేరితే కుటుంబానికి ఏ ఇబ్బంది క‌ల‌గ‌కుంగా ఉండేందుకు అత్య‌వ‌సర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో ఏ ప‌నుల‌కూ ఆటంకం క‌ల‌గ‌దు. అలాగే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ క‌లిగి ఉంటే చాలా వ‌ర‌కు ఖ‌ర్చుల‌ను త‌ప్పించుకోవ‌చ్చు.

7. వీలునామా…
ఎవ‌రికైనా ఎంత ఆస్తి ఉన్న‌ప్ప‌టికీ వీలునామా ముఖ్యం. త‌న త‌రువాత త‌న ఆస్తులు ఎవ‌రికి ద‌క్కాల‌నే అంశాల‌ను స్ప‌ష్టంగా వీలునామాలో పేర్కొనాలి. దీని వల్ల న్యాయపరమైన చిక్కులు తగ్గుతాయి. ఆస్తుల బదలాయింపు కూడా సులభతరం అవుతుంది. పిల్లల సంక్షేమాన్ని ఎవరు చూడాలి. కుటుంబ అవసరాలను ఎవరు పట్టించుకోవాలి, అప్పులు ఉంటే వాటిని ఎలా తీర్చాలి? తదితర సమాచారాన్ని వీలునామాలో రాయవచ్చు. ఆస్తులు ఎక్కువ ఉంటే వాటి నిర్వహణకు ఒకరిని మించి సూచించవచ్చు. ఈ విల్లుపై ఇద్దరు సాక్షి సంతకాలు చేయించాలి. నోటరీ చేయిస్తే మంచిది. ఇక కంప్యూట‌ర్‌లో సేవ్ చేసే స‌మాచారం కాకుండా డాక్యుమెంట్లు, ముఖ్య‌మైన ప‌త్రాలు, పేప‌ర్లు ఉంటే వాటిని పార్ట్‌న‌ర్‌కు అందేలా చూడాలి. లేదంటే కుటుంబ స‌భ్యుల‌కు అయినా అందుబాటులో ఉండేలా చూడాలి. దీంతో య‌జ‌మాని చ‌నిపోయినా వారికి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top