ఆధార్.. ఆది నుంచి దీనిపై వివాదాలే నెలకొంటూ ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం ఆధార్‌ను ప్రవేశపెట్టగా అప్పట్లో దీన్ని బీజేపీ నాయకులు విమర్శించారు. అప్పట్లో వంట గ్యాస్ సబ్సిడీ అక్రమ మార్గం వైపు మళ్లకుండా ఉండేందుకు గాను ఆధార్ ఉపయోగపడుతుందని యూపీఏ ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో ప్రజలందరూ ఆధార్ కార్డును విధిగా తీసుకోవాలని, దాన్ని బ్యాంక్ అకౌంట్‌కు, గ్యాస్ కు లింక్ చేస్తే వారికి నెల నెలా సబ్సిడీ మొత్తం బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా జమ అవుతుందంటూ ఓ పథకాన్ని తీసుకొచ్చారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కట్ చేస్తే.. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధార్‌ను అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకే కాక, పలు ఇతర సేవలకు కూడా తప్పనిసరి చేసింది. దీంతో వివాదాలు మళ్లీ మొదలయ్యాయి.
బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు, పాన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని, లేదంటే ఆ సేవలను వాడుకోలేరని కేంద్రం ఎప్పటి నుంచో డెడ్ లైన్లు విధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో వీటన్నింటికీ ఈ నెల 31వ తేదీని ఆఖరి డెడ్‌లైన్‌గా ప్రకటించగా ప్రజలందరిలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పలువురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిల్ వేయగా కోర్టు దాన్ని విచారిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా తీర్పు కూడా చెప్పింది. కేవలం ప్రభుత్వ పథకాలకు తప్ప ఇతర సేవలకు వేటికీ ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన పనిలేదని, ప్రజలు తమకు ఇష్టం వచ్చినప్పుడు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చని, అందుకు డెడ్లైన్లు విధిస్తూ వారిని భయపెట్టరాదని, అలాగే ఆధార్ అనుసంధానానికి ఎలాంటి గడువూ లేదని నిరవధిక గడువును విధించామని సుప్రీం తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు జనాలందరూ ఊరట చెందుతున్నారు.
ఆధార్ గురించి ఆసక్తికర విషయాలు:
#1. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలనుకుంటే మాత్రం ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందే.
#2. ఇక ఆధార్ కార్డు విషయంలో చాలా మంది దాన్ని అడ్రస్ ప్రూఫ్ కింద వాడుతున్నారు కానీ.. నిజానికి అది అడ్రస్ ప్రూఫ్ కింద పనిచేయదట. అవును, మీరు విన్నది నిజమే. ఆధార్ కార్డు కోసం అప్లై చేసేటప్పుడు అడ్రస్ ఇదీ అని చెప్పి ఎవరైనా తమ చిరునామా తెలుపుతారు, కానీ అందుకు తగిన పత్రాలను చూపరు కదా. అందుకని ఆధార్‌లో ఇచ్చే అడ్రస్ .. అడ్రస్ ప్రూఫ్ కింద పనికిరాదట.
#3. ఆధార్‌ను నిజానికి ఐడీ కార్డుగానూ వాడరాదట. ఎందుకంటే అది కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రూఫ్ గా మాత్రమే వాడాలి. కానీ దీన్ని నేడు ఐడీ ప్రూఫ్‌గా కూడా వాడుతున్నారు. నిజానికి ఆధార్‌ను ఈ ఉద్దేశం కోసం ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వ పథకాలు అక్రమ మార్గాల వైపు మళ్లకుండా నేరుగా ప్రజలకు చేరేందుకు, అక్రమాలను నిరోధించేందుకు ఈ కార్డును ప్రవేశపెట్టారు. కానీ దీన్ని నేడు ఐడీ ప్రూఫ్ గా కూడా విరివిగా వాడుతున్నారు.
#4. ఆధార్ కార్డుల సమాచారంపై కూడా నేడు ప్రజల్లో ఆందోళన నెలకొంది. వాటి భద్రతపై ప్రజల్లో సందేహాలు వస్తున్నాయి. ఇది వరకు చాలా సార్లు ఆధార్ డేటాబేస్‌లో ఉన్న సమాచారం, ప్రజలకు చెందిన ఆధార్ నంబర్లు, వారి వివరాలు లీకయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఖండించింది. ప్రజల ఆధార్ సమాచారం సేఫ్‌గా ఉందని చెప్పింది. నిజానికి ప్రజల ఆధార్ నంబర్లు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తప్ప ఇతర వాటికి వాడరాదట. గతంలో ఆధార్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని ప్రైవేటు సేవల కోసం కూడా వాడుతున్నారు.
#6. చాలా మంది పాస్‌పోర్టు, ఆధార్ ఒక్కటే అనే భ్రమలో కూడా ఉన్నారు. నిజానికి ఇవి రెండు వేర్వేరు. పాస్‌పోర్టు తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఆధార్ ఇవ్వాలి. కానీ ఆధార్ పాస్‌పోర్టులా పనిచేయదు. ఇక ఆధార్ సమాచారాన్ని వారి వారి ఆథెంటికేషన్ (వేలిముద్ర, ఫోన్ ఓటీపీ) లేకుండా తీసుకోరాదనే రూల్ కూడా ఉంది. కానీ ఇటీవలి కాలంలో దీనిపై కూడా సందేహాలు వస్తున్నాయి. ప్రజల వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం, కొన్ని సార్లు ఓటీపీ నంబర్లు రాకపోవడం వంటి కారణాల వల్ల వారు ఆధార్ సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు.
#7. ప్రపంచంలో ఏ దేశంలోనే లేని అతి పెద్ద సమాచార డేటాబేస్ మన ఆధార్ డేటాబేస్ అని పలువరు సామాజిక వేత్తలు అభిప్రాయ పడుతున్నదృష్ట్యా ప్రభుత్వం ఆధార్ కు మరింత సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆధార్ సమాచారం దుండగుల చేతుల్లో పడకుండా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు సులభంగా ఆధార్‌ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆధార్ వాడకం సులభతరమవుతుంది. అప్పుడు ఏ సేవనైనా ఆధార్‌కు లింక్ చేసుకునేందుకు ప్రజలే సుముఖత వ్యక్తం చేస్తారు. అది చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఆధార్‌ను అన్నింటికీ లంకె చేయమనడం సబబు కాదు. దాన్ని ప్రజలే కాదు, కోర్టులు కూడా ఇలాగే వ్యతిరేకిస్తాయి. ఏది ఏమైనా ఆధార్ లింక్ విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం జనాలందరికీ ఊరటనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.