దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. దేశ పౌరులు ఆధార్ కార్డును వాడడం తప్పనిసరి కాదని, తమంతట తాముగా వాడాలనుకుంటే తప్ప ప్రభుత్వం బలవంతంగా ఆధార్‌ను అన్నింటికీ అనుసంధానం చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది. అదే మాటను చెబుతూ వస్తుంది కూడా. అయినప్పటికీ ప్రభుత్వాలు వింటే కదా, ప్రజలను కష్టపెట్టడం అంటే వాటికి సరదా. అందుకనే ఆధార్ పేరిట దిక్కుమాలిన రూల్స్‌ను జనాలపై రుద్దుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోని మొబైల్ యూజర్లందరికీ ఆధార్ వెరిఫై చేసుకోవాలని ప్రకటనలు కూడా ఇస్తోంది. ఇక టెలికాం ఆపరేటర్లు అయితే ఆధార్‌ను మొబైల్ సిమ్‌కు అనుసంధానం చేయమని రోజూ మెసేజ్‌లు, కాల్స్ పేరిట చావగొడుతున్నారు. ముఖ్యమైన పనుల్లో ఉంటే ఈ వెరిఫై మెసేజ్‌ల వల్ల చాలా మందికి ఆటంకం కూడా కలుగుతోంది. 2018 ఫిబ్రవరి వరకు మాత్రమే మొబైల్‌ను ఆధార్‌తో అనుసంధాంచడానికి గడువుందని ఊదరగొడుతున్నారు. అయితే నిజానికి మీకు తెలుసా..? ఆధార్ నంబర్‌ను మొబైల్ సిమ్‌కు అనుసంధానం చేయమని సుప్రీం కోర్టు అస్సలు చెప్పలేదు. అవును, మీరు విన్నది నిజమే.
గతంలో సుప్రీంకోర్టు దేశంలోని మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్ల వెరిఫికేషన్ గురించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సదరు వినియోగదారుల నంబర్లను వెరిఫై చేయాలని ఆదేశించింది. అయితే కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా ఆధార్‌ను తెరపైకి తెచ్చారు. ఆధార్‌తో మొబైల్ సిమ్‌ను అనుసంధానం చేస్తే వెరిఫికేషన్ పూర్తవుతుందని భావించారు. దీంతో ఆ దిశగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)తోపాటు టెలికాం ఆపరేటర్లకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. వెంటనే వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆధార్‌కు లింక్ చేయించాలని చెప్పింది. అయితే దీన్ని టెలికాం ఆపరేటర్లు ఫాలో అవుతున్నారు. దీంతో వారు మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు వెరిఫై చేసుకోమని మెసేజ్‌లు పంపి ఇబ్బంది పెడుతున్నారు. అయితే నిజానికి మొబైల్ నంబర్లను ఆధార్ ద్వారా వెరిఫై చేయమని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదు. కేవలం ఇతర మార్గాల్లో మొబైల్ నంబర్లను వెరిఫై చేయాలని, అది కూడా ప్రీపెయిడ్ కస్టమర్ల నంబర్లనే వెరిఫై చేయాలని సుప్రీం చెప్పింది. పోస్ట్ పెయిడ్ వారి గురించి ఏమీ చెప్పలేదు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు మొబైల్ యూజర్లందరికీ ఆధార్‌ను వెరిఫై చేసుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నారు.
ఇక యూఐడీఏఐ కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కదోవ పట్టించి ఆధార్‌ను మొబైల్‌కు అనుసంధానం చేయాలని ప్రకటనలు ఇస్తోంది. అయితే ఇప్పుడే కాదు, గతంలో చాలా సందర్భాల్లో సుప్రీం కోర్టు ఆధార్ తప్పనిసరి కాదని చెప్పింది. వినియోగదారుడు కోరుకుంటేనే అతని విజ్ఞప్తి మేరకు అతని ఆధార్‌ను అనుసంధానించాలని, పథకాలకు వాడుకోవాలని చెప్పింది. అంతేకానీ ఆధార్ తప్పనిసరి కాదని చెబుతోంది. ఇక ఆధార్ లేదని చెప్పి అది లేని వారికి ప్రభుత్వ పథకాలను ఆపేయడం కూడా సరికాదని సుప్రీం కోర్టు తెలియజేసింది. ఈ క్రమంలోనే మొన్నా మధ్య వ్యక్తిగత ప్రైవసీపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు కూడా ఇచ్చింది. అయినప్పటికీ కేంద్రం, టెలికాం కంపెనీలు మాత్రం ఆధార్ వెరిఫై చేసుకోమంటూ మెసేజ్‌లు , కాల్స్ చేస్తున్నాయి. అయితే రానున్న నవంబర్ నెలలో ఆధార్ చట్టబద్దతపై సుప్రీం కోర్టు కీలక తీర్పునివ్వనుంది. మరి అది వచ్చాక కూడా కేంద్రం, టెలికాం కంపెనీలు ఇలాగే ప్రవర్తిస్తాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.