మీరు వాడని పాత “ఆండ్రాయిడ్ డివైస్” ను ఈ 7 విధాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా..?

నేటి తరుణంలో చాలా మంది కొత్త స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ పీసీలు మార్కెట్‌లోకి వచ్చాయంటే చాలు, వాటిని కొనుగోలు చేయడం, కొద్ది రోజుల పాటు వాడడం, ఆ తరువాత వాటిని సెకండ్ హ్యాండ్ ధరకు అమ్మడం లేదంటే ఇంట్లో ఓ మూలన పడేయడం జరుగుతోంది. అయితే ఫోన్లు ఏమో గానీ, మీరు వాడకుండా ఇంట్లో పడేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు కింద చెప్పిన విధంగా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కార్ నావిగేషన్
మీరు వాడకుండా ఇంట్లో పడేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను కార్ నావిగేషన్ డివైస్‌గా వాడుకోవచ్చు. అందుకు కార్ మౌంట్ కిట్ ఒకటి తెచ్చుకుంటే చాలు, అందులో ట్యాబ్లెట్‌ను ఫిక్స్ చేసి దానికి నెట్ కనెక్షన్ ఇస్తే ఆ ట్యాబ్లెట్‌ను జీపీఎస్ నావిగేటర్‌గా వాడుకోవచ్చు. దీంతో మ్యాప్స్‌లో ఎటు వెళ్లాలో డైరెక్షన్స్ సులభంగా తెలుసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి మ్యాప్‌ను చాలా చక్కగా వీక్షించవచ్చు. దారి వెతకడం సులభతరమవుతుంది.

2. మ్యూజిక్ ప్లేయర్
చాలా వరకు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు ఎంత లేదన్నా కనీసం 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. కనుక ఆ స్టోరేజ్‌లో పాటలు వేసుకుంటే ఎప్పుడైనా బయటకు సరదాగా వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్‌లో ఉన్న పాటలను వినవచ్చు. మ్యూజిక్ ప్లేయర్‌ను అందులో పెట్టుకుని పాటలు వింటూ సరదగా జర్నీ చేయవచ్చు. ఉల్లాసంగా గడపవచ్చు.

3. సెక్యూరిటీ కెమెరా
మీ పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు సెక్యూరిటీ కెమెరాగా కూడా వాడవచ్చు. అందుకు ఏం చేయాలంటే… ఓ వాల్‌మౌంట్ కిట్‌లో ట్యాబ్లెట్ పీసీని ఫిక్స్ చేయాలి. మీరు అనుకున్న ప్రదేశంలో ఆ కిట్‌ను అమర్చాలి. అనంతరం అందులో ఐపీ వెబ్ క్యామ్ అనే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఇంటర్నెట్ డేటా ఆన్ చేసి యాప్ ఓపెన్ చేస్తే ట్యాబ్లెట్‌లో ఉండే కెమెరా ఆన్ అవుతుంది. అది తనకు ఎదురుగా ఉన్న దృశ్యాలను రికార్డు చేస్తూ యాప్‌కు పంపుతుంది. యాప్‌లో మనకు లభించే ఓ ఐపీ అడ్రస్‌ను రాసి పెట్టుకోవాలి. దాన్ని మనం బయట ఎక్కడున్నా ఫోన్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఆ ఐపీ అడ్రస్‌ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంట్లో ఉన్న ట్యాబ్ కెమెరా లైవ్ దృశ్యాలను మనం ఫోన్‌లో బయట ఎక్కడైనా చూడవచ్చు. దీంతో ఆ ట్యాబ్ సీసీటీవీ కెమెరాలా పనిచేస్తుంది.

4.బుక్ రీడర్
మీరు పుస్తకాలను ఎక్కువగా చదివే వారు అయితే మీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను డిజిటల్ బుక్ రీడర్‌గా వాడుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే గూగుల్ బుక్స్, అల్డికో, మూన్ ప్లస్ రీడర్ వంటి అనేక బుక్ రీడింగ్ యాప్స్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకిష్టమైన బుక్స్‌ను ట్యాబ్లెట్‌లో చదువుకోవచ్చు. ఎలాగూ పెద్ద డిస్‌ప్లే ఉంటుంది కాబట్టి బుక్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది.

5. డిజిటల్ ఫొటో ఫ్రేమ్
వాల్ మౌంట్ కిట్‌లో ట్యాబ్లెట్ పీసీని పెట్టి దాన్ని గోడకు అమర్చాక అందులో ఫొటో స్లైడ్ షో యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్స్‌ను ఓపెన్ చేస్తే అవి ట్యాబ్‌లో ఉన్న ఫొటోలను స్లైడ్ షోలా చూపిస్తాయి. దీంతో దూరం నుంచి చూస్తే ఫొటోలన్నీ గోడపై కదులుతున్నట్టు కనిపిస్తూ అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది.

6. పర్సనల్ ప్లానర్
మీరు వాడని పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు పర్సనల్ ప్లానర్‌గా కూడా వాడుకోవచ్చు. అందుకు పలు యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నాయి. సోల్ క్యాలెండర్, క్యాల్, క్యాలెండర్ ప్లస్, గూగుల్ నోట్ వంటి యాప్స్‌ను ట్యాబ్లెట్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక ప్రతి సారీ పెన్ను, పేపర్ పట్టుకుని నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు. ట్యాబ్లెట్‌లోనే ఆ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు వెంటనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు.

7. వైఫై రూటర్
మీరు వాడని పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో 3జీ లేదా 4జీ సిమ్ వేసుకునే సదుపాయం ఉంటే దాన్ని ఎంచక్కా వైఫై రూటర్‌లా వాడుకోవచ్చు. ఏదైనా సిమ్ వేసి అందులో డేటా బ్యాలెన్స్ వేయించుకుని, వైఫై హాట్ స్పాట్ పెట్టుకుంటే దాన్నుంచి ఇతర డివైస్‌లలో ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

Comments

comments

Share this post

scroll to top