సొంత ఇల్లు కట్టుకోవాలని, అందులో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ కల అందరికీ సాకారం కాదు. కానీ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ పుణ్యమా అని ఆ కల నెరవేరే రోజు దగ్గర్లోనే ఉంది. అవును, మీరు వింటున్నది నిజమే. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లు బాగా పెరిగాయి కదా. అవును, అందువల్లే ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మేం చెబుతోంది కాదు, దేశంలోని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న మాట. ఈ క్రమంలో అసలు నోట్ల డిపాజిట్‌కు, సొంతింటి కలకు ఉన్న లింకేమిటో, అది ఎలా జరుగుతుందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నోట్ల రద్దు వల్ల గత కొన్ని రోజులుగా కొన్న లక్షల కోట్ల రూపాయల డబ్బు బ్యాంకుల్లోకి చేరింది. అయితే ఇలా డబ్బు చేరడం వల్ల దాంతో జనాలకు ఏదైనా ఉపయోగం ఉండే పని చేయాలని ఆర్బీఐ భావిస్తోందట. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉన్న గృహ రుణ వడ్డీలను బాగా తగ్గించాలని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రస్తుతం దాదాపుగా అన్ని బ్యాంకులు 9.15 శాతం ఆపైన గృహ రుణ వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే దీన్ని 6 నుంచి 7 శాతానికి అంటే దాదాపుగా 3 నుంచి 4 శాతం వరకు తగ్గించాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. రూ.50 లక్షల వరకు గృహ రుణాలు తీసుకునే వారికి 6-7 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేసేలా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో 6-7 శాతం వడ్డీ అంటే అది కేవలం 50 నుంచి 75 పైసలు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంది.
రానున్న 2017 సంవత్సరంలో మార్చి వరకు అంటే మరో 3, 4 నెలల్లో గృహ రుణాలపై తగ్గింపు రేట్లను ఆర్బీఐ ప్రకటించనున్నట్టు సమాచారం. అదే జరిగితే చాలా మంది హోమ్ లోన్స్ తీసుకునే అవకాశం ఉంది. తక్కువ వడ్డీ పడుతుండడంతో చాలా మంది ఈ లోన్ల వైపు మొగ్గు చూపుతారని, దీంతో అనేక మందికి సొంతింటి కల నెరవేరుతుందని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ఆర్బీఐ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తున్నదేమిటంటే… ప్రస్తుతం ఆర్బీఐ అన్ని బ్యాంక్‌లతో చర్చలు జరుపుతోందని, ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాక, పెద్ద నోట్ల రద్దు సమస్యలు కొంత తీరాక ఆర్బీఐ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. ఒక వేళ ఆ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం ఎంతో మందికి సొంతిల్లు వచ్చేస్తుంది..! ఎంచక్కా వడ్డీ కూడా తక్కువే ఉంటుంది కదా, కనుక చాలా మంది లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది..!