ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ ఏసీ ఇది..!

వేసవి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి ఏవి? అవేనండీ దాహం, ఉక్కపోత. నీటిని తాగుతూ దాహాన్ని ఎలాగైనా తీర్చుకోవచ్చు కానీ, ఉక్కపోతను తట్టుకోవడం చాలా కష్టం. ఎంత ఫ్యాన్ తిరిగినా దాని నుంచి వచ్చేది వేడి గాలే. ఇక కూలర్లు, ఏసీలంటే కొంత ఖర్చు పెట్టక తప్పదు. ఇది ఇండ్లలో ఉండే వారి పరిస్థితి. ఇక ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు ఏసీ ఉంటే ఫర్లేదు. లేదంటే రోజు మొత్తం ఉక్కపోత, చెమటతో సహజీవనం చేయాల్సిందే. ఇక బయట తిరిగే వారి సంగతి సరేసరి. చెమట, ఉక్కపోతే కాదు, వేడి, డీహైడ్రేషన్ వంటి ఇతర సమస్యలు కూడా మొదలవుతుంటాయి. ఈ క్రమంలో ఇలాంటి వారి కోసమే వచ్చేసింది పోర్టబుల్ ఎయిర్ కండిషనర్. అవును, నిజంగా ఇది పోర్టబుల్ ఏసీయే.

Evapolar-ac

రష్యాకు చెందిన యువ ఔత్సాహికులు కొందరు ఎవాపొలార్ (Evapolar) పేరిట ఓ నూతన పోర్టబుల్ ఎయిర్ కండిషనర్‌ను తయారు చేశారు. వారు తయారు చేసిన ఈ ఏసీ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఏసీగా రికార్డు సృష్టించింది. సాధారణ ఏసీల్లా కాకుండా ఓ ప్రత్యేకమైన ఫిల్టర్, రీఫిల్లబుల్ కంటెయినర్‌లో ఉండే ద్రవం ద్వారా ఈ ఏసీ గాలిని చల్లబరుస్తుంది. దాదాపు అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ పనిచేసే విధంగా ఈ పోర్టబుల్ ఏసీని వారు తయారు చేశారు. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని విధంగా పూర్తి స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఏసీగా ఇప్పటికే గుర్తింపు పొందింది. అయితే ఇది కేవలం ఒక వ్యక్తికి సరిపోయేంత చల్లదనాన్ని మాత్రమే ఇస్తుంది. అయితేనేం సింగిల్‌గా వాడాలనుకునే వారికి ఇది మహా బాగా పనిచేస్తుందని తయారీదార్లు అంటున్నారు.

ఇంతకీ ఎవాపొలార్ ఏసీ ధర ఎంతనుకుంటున్నారేమిటి? రూ.వేలల్లో ఉంటుందనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే! ఎందుకంటే దీని ధర కేవలం 179 యూఎస్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.11వేలు. అయితే ఇందులోని రీఫిల్లబుల్ కంటెయినర్లలో ఉండే ద్రవాన్ని క్యాట్రిడ్జ్‌ల ద్వారా తిరిగి రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మళ్లీ 20 డాలర్లను (రూ.1300) ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితేనేం దీన్ని ఎక్కడికంటే అక్కడికి ఎంచక్కా తీసుకువెళ్లే వీలుండడంతోపాటు ఒకరికి కావల్సినంత చల్లదనాన్ని ఇస్తుంది. నిజంగా పోర్టబుల్ ఏసీ భలేగా ఉంది కదూ!

Comments

comments

Share this post

scroll to top