కేర‌ళ‌లోని ఆ టాయిలెట్ ద్వారా కరెంటును ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ట‌… ఎరువు కూడా త‌యారవుతుంద‌ట‌…

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల క‌న్నా మ‌న దేశంలోనే బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేసే వారు ఎక్కువ‌ట‌. అంతే కాదు మ‌రుగుదొడ్ల సౌక‌ర్యం స‌రిగ్గా లేని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు కూడా మ‌న ద‌గ్గ‌రే అధికంగా ఉన్నాయ‌ట‌. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే విద్యార్థినులు త‌మ రుతు స‌మ‌యంలో నెల‌కు 5 రోజుల పాటు పాఠ‌శాల‌ల‌కు రావ‌డం లేద‌ట‌. ఈ వివ‌రాల‌న్నీ ఓ సంస్థ చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డ‌య్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పాలంటే సంపూర్ణ ప‌రిశుభ్ర‌త ఉన్న దేశంగా మ‌న దేశం ఎప్పుడు మారుతుందో అనిపిస్తుంది. అయితే ఆ రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కేర‌ళ రాష్ట్రంలో తాజాగా ఏర్పాటు చేసిన ఇ-టాయిలెట్లే భార‌త్‌ను ప‌రిశుభ్ర‌మైన దేశంగా మార్చేందుకు కార‌ణ‌భూతాలు కానున్నాయి.
ఎరామ్ సైంటిఫిక్ సొల్యూష‌న్స్ అనే సంస్థ కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం జిల్లాలో ఉన్న పుల్లువిల అనే గ్రామంలో ప్ర‌పంచంలోనే మొద‌టి ఇ-టాయిలెట్‌ను ఏర్పాటు చేసింది. ఇ-లైట్ 14గా పిల‌వ‌బ‌డుతున్న ఈ టాయిలెట్ నిర్వ‌హ‌ణ చాలా సుల‌భ‌మ‌ట‌. ఇవి పూర్తిగా సౌర విద్యుత్‌ను ఉప‌యోగించుకుంటూ ప‌నిచేస్తాయి. 3 నిమిషాల పాటు ఈ టాయిలెట్‌ను వాడితే అది సుమారు 1.5 లీట‌ర్ల నీటితో వ్య‌ర్థాల‌ను ఫ్ల‌ష్ చేస్తుంద‌ట‌. అదే విధంగా ఇంకా ఎక్కువ నిమిషాల పాటు ఈ టాయిలెట్‌ను వాడితే సుమారు 4.50 లీట‌ర్ల నీటితో వ్య‌ర్థాల‌ను ఆటోమేటిక్‌గా బ‌య‌టికి పంపిస్తుంద‌ట‌. అయితే టాయిలెట్‌ను వినియోగించుకోవాలంటే అందులో రూ.1 కాయిన్ వేయాల్సి ఉంటుంది. దీంతో డోర్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. టాయిలెట్ ఉప‌యోగం అయిపోగానే వ్య‌క్తి బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు డోర్ మ‌ళ్లీ దానంత‌ట అదే మూత ప‌డిపోతుంది. కాగా ఈ టాయిలెట్‌లో ఉన్న మ‌రో ప్రత్యేక‌త ఏమిటంటే వాటిలోని వ్య‌ర్థాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయ‌వ‌చ్చ‌ట‌. అంతేకాదు ఎరువుల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చ‌ట‌.
e-toilet
ఇ-టాయిలెట్‌కు సంబంధించిన ఓ యాప్‌ను కూడా స‌ద‌రు సంస్థ విడుద‌ల చేసింది. దాని ద్వారా న‌గ‌రంలో ఎక్క‌డెక్క‌డ ఇ-టాయిలెట్లు ఉన్నాయో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అంతేకాదు వినియోగ‌దారులు త‌మ‌కు కావ‌ల్సిన చోట ఇ-టాయిలెట్ పెట్టాల‌ని యాప్ ద్వారా కోర‌వ‌చ్చ‌ట‌. ఈ క్ర‌మంలో కేర‌ళ‌లోని ప‌లు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ ఆ సంస్థ బాలురు, బాలిక‌ల కోసం ప్ర‌త్యేకంగా ఇ-టాయిలెట్ల‌ను ఏర్పాటు చేసింది. బాలిక‌ల‌కైతే రుతు స‌మ‌యంలో ఉప‌యోగించుకునేందుకు శానిట‌రీ నాప్‌కిన్స్‌ను కూడా ఆ టాయిలెట్ల‌లో అందుబాటులో ఉంచార‌ట‌.
ప్ర‌స్తుతం ఇ-టాయిలెట్ల‌ను త‌యారు చేస్తున్న ఎరామ్ సంస్థ త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల్లోనూ వీటిని ప్ర‌వేశ‌పెట్ట‌నుంద‌ని తెలిసింది. ఇది అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే మ‌న దేశం కూడా ప‌రిశుభ్రత ఉన్న దేశంగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప‌ర్యావ‌ర‌ణానికి ఏ మాత్రం హాని క‌లిగించ‌ని రీతిలో ఇలాంటి ఉప‌యోగ‌క‌ర‌మైన టాయిలెట్ల‌ను త‌యారు చేసిన ఎరామ్ సంస్థ‌ను మ‌నం అభినందించాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top