2పిల్ల‌లు పుట్టాక భ‌ర్త వ‌దిలేశాడు,పిల్లల్ని బ‌తికించుకోవ‌డం కోసం కాలేజీ ప్యూన్‌గా ప‌నిచేసింది, క‌ట్ చేస్తే ఇదిగో ఇలా.!!

క‌ష్ట‌ప‌డే త‌త్వం, స‌మాజానికి సేవ చేయాల‌నే ఆలోచ‌న ఉంటే చాలు, అవే ఎవ‌ర్న‌యినా నాయకులుగా మారుస్తాయి. అధికారాన్ని, ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తాయి. స‌రిగ్గా ఇలాగే ఓ మ‌హిళ‌కు కూడా జ‌రిగింది. ఆమె ఒక‌ప్పుడు పేద కుటుంబంలో జ‌న్మించింది. పెద్ద‌గా చ‌దువుకోలేదు. పెళ్ల‌య్యాక భ‌ర్త విడిచి పెట్టాడు. అయినా జీవ‌న పోరాటంలో ముందుకే సాగింది. త‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు త‌న వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల బాగోగుల‌ను గురించి ఆలోచించింది. ఈ క్ర‌మంలోనే ఓ వైపు బతుకుదెరువు కోసం ప్యూన్ ప‌నిచేస్తూ మ‌రో వైపు కార్పొరేట‌ర్ గా పోటీ చేసి గెలిచింది. ఆమే.. మ‌హారాష్ట్ర‌కు చెందిన రాజ‌శ్రీ‌.

రాజ‌శ్రీ మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్‌లో యంగ‌ర్‌వాడి అనే ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో జ‌న్మించింది. అక్క‌డే 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుంది. అయితే ప‌రిస్థితులు అనుకూలించ‌క ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టు ముట్ట‌డంతో ఆమె చ‌దువు ఆపేసింది. దీంతో ఆమెకు 15వ ఏటే పెళ్లి చేశారు. ఆ త‌రువాత ఆమె 2004లో పూనె వ‌చ్చింది. అప్ప‌టి నుంచి రాజ‌శ్రీ‌కి క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇద్ద‌రు కూతుళ్లు పుట్టాక భ‌ర్త ఆమెను వ‌దిలేశాడు. అయినా ఆమె భ‌య‌ప‌డ‌లేదు, బాధ ప‌డ‌లేదు. జీవిత పోరాటంలో ముందుకే సాగింది. కాలేజీలో ప్యూన్ ప‌ని చేసేది.

అయితే రాజ‌శ్రీ‌ది ఫేస్ ప‌ర్ధి అనే ఓ తెగ‌. వారిని 1871లో అప్ప‌టి బ్రిటిష్ ప్ర‌భుత్వం క్రిమిన‌ల్ ట్రైబ్స్‌గా ముద్ర వేసింది. కానీ 1952లో భార‌త ప్ర‌భుత్వం వీరిని సంచార తెగ‌లుగా గుర్తించి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. అయిన‌ప్పటికీ ఈ తెగకు చెందిన ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రాలేదు. ఆ దిశ‌గా రాజ‌శ్రీ ప‌నిచేసేది. మ‌హిళా స్వ‌యం సహాయ‌క సంఘాల‌తో క‌లిసి త‌మ వ‌ర్గ ప్ర‌జ‌ల బాగు కోసం ప‌నిచేసేది. ఈ క్రమంలోనే 6 నెల‌ల కింద‌ట జ‌రిగిన పూనె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన రాజ‌శ్రీ కార్పొరేట‌ర్‌గా గెలిచింది. దీంతో తాను అనుకున్న ఆశ‌యాలను సాధించేందుకు మంచి అవ‌కాశం ఆమెకు ల‌భించింది. ఇప్ప‌టికైనా మించిపోయింది లేద‌ని భావిస్తూ ఆమె త‌న వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తోంది. ఆమె ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top