హెల్మెట్ లేకుండా వెళ్తున్న యువకులను పట్టుకోబోయి రోడ్డుపై బోల్తా పడ్డ మహిళా పోలీస్ ఆఫీసర్…

బైక్‌పై వెళ్తున్నప్పుడు సడెన్‌గా పోలీసులు ఆపితే ఎవరైనా ఏం చేస్తారు? పత్రాలన్నీ సరిగ్గా ఉంటే ఎవరూ భయపడరు. వాటిని చూపించి దర్జాగా వెళ్లిపోతారు. మరి అవి లేని వారి సంగతేమిటి? వీరే కాదు, ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోయినా పోలీసులకు చిక్కితే వాహనం ఆపాల్సిందే. చలానా, ఫైన్ కట్టాల్సిందే. కానీ కొందరు మాత్రం అలా చేయరు. అల్లంత దూరంలో పోలీసులు చెకింగ్ చేస్తున్నారనగానే ముందు నుంచే వేరే దారిలో ఉడాయిస్తారు. ఇంకొందరు అనుకోకుండా దొరికిపోతారు. మరికొందరు పోలీసులు ఆపుతున్నా పట్టించుకోకుండా వారిని తప్పించుకుని పారిపోతారు. అలా పారిపోయే క్రమం సరిగా ఉంటే ఓకే. లేదంటే పోలీసులకో, సదరు వాహనదారులకో ప్రమాదం జరగక తప్పదు. దెబ్బలు తాకక మానవు. గతంలో ఇలాంటి సంఘటనలు మనం చూశాం. అయితే అవన్నీ పోలీసులు వెంబడించి మరీ వాహనదారులను ఆపినవి. అలాంటి ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. కానీ రాంచీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.

woman-police

జార్ఖండ్ రాష్ట్ర రాజధాని నగరం రాంచీలో వీవీఐపీ రోడ్‌లో ఇటీవల ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆ రహదారిపై విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారిణి ఓ రోజు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని చూసింది. దీంతో వెంటనే వారిని ఆపమని సైగ చేసింది. అయినా వారు వినకుండా అలాగే ముందుకు దూసుకెళ్లారు. దీంతో వారిని ఆపేందుకు ఆ మహిళా పోలీసు సదరు స్కూటీ వెనుక ఉన్న హ్యాండిల్‌ను పట్టుకుని వారిని ఆపాలని ప్రయత్నించింది. అప్పటికీ ఆ యువకులు దాన్ని పట్టించుకోకుండా అలాగే మరికొంత దూరం ముందుకు వెళ్లారు. దీంతో పట్టు తప్పిన ఆ పోలీసు అధికారిణి రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి.

woman-police

ఏ వాహనం నడుపుతున్నప్పుడైనా, ఎవరైనా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాల్సిందే. సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాల్సిందే. లేదంటే వాహనం నడప కూడదు. ఒక వేళ పైన చెప్పిన లాంటి పరిస్థితి ఎదురైతే మొండిగా ముందుకు వెళ్లకుండా వాహనం ఆపాలి. లేదంటే అది అటు పోలీసు అధికారులకే కాదు, వాహనం నడుపుతున్న వారికి కూడా ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. పై సంఘటనను చూసైనా వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top