త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియక పాల కోసం ఆమె శ‌వంపై ప‌డి ఏడ్చిన బాలుడు… కంట తడి పెట్టించే ఘ‌ట‌న ఇది..!

చుట్టూ ర‌క్త‌పు మడుగు… అందులో ప‌డి ఉన్న మ‌హిళ మృత‌దేహం… రైల్వే ట్రాక్ ప‌క్క‌నే ఉన్న ఆ మృత‌దేహానికి ఆనుకుని గుండెల‌విసేలా రోదిస్తున్నాడు ఏడాది బాలుడు… త‌ల్లి చ‌నిపోయింద‌ని అత‌నికి తెలియ‌దు. ఆక‌లైందేమో పాలు తాగుదామని త‌ల్లి కోసం ఏడుస్తున్నాడు అత‌ను. అయినా.. ఎంత‌కీ త‌ల్లి లేవ‌దేం.. పాలివ్వ‌దేం.. అన్న‌ట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆ బాలుడు. ఈ దృశ్యాల‌ను చూసిన వారి హృద‌యాలు క‌లుక్కుమ‌న్నాయి. ప్ర‌తి ఒక్క‌రి గుండెను ఈ సంఘ‌ట‌న పిండేసింది. ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌కు 250 కిలోమీట‌ర్ల దూరంలోని ద‌మోహ్ అనే ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ ప‌క్క‌నే ఈ నెల 24వ తేదీన ఉద‌యం ఓ మ‌హిళ మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ మేర‌కు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని చేరుకుని మ‌హిళ మృత‌దేహాన్ని అక్క‌డి నుంచి తీసేశారు. అయితే అలా తీసే క్ర‌మంలో ఆమె కొడుకైన ఏడాది బాలుడు ఆమె ప‌క్క‌నే గుక్క ప‌ట్టి ఏడ్వ‌డం ప్రారంభించాడు. త‌ల్లి చ‌నిపోయింద‌ని, ఇక తిరిగి రాద‌ని ఆ ప‌సికందుకు తెలియ‌దు. అయినా… ఆక‌ల‌వుతుంద‌ని త‌ల్లి పాలు తాగుదామ‌ని ఆమె ఛాతీపైకి వ‌చ్చి ఆనుకున్నాడు. దీంతో అత‌ని వేద‌న‌ను చూసిన స్థానికులకు హృద‌యం క‌ల‌చి వేసింది.

అయితే ఆ మ‌హిళ రైలు నుంచి త‌ప్పించుకోబోయి అది ఢీకొని మృతి చెందిన‌ట్టు కొంద‌రు స్థానికులు చెబుతున్నారు. అలా రైలు ఢీకొనే క్ర‌మంలో త‌న చిన్నారికి ఏమీ కాకూడ‌ద‌ని ఆ త‌ల్లి తన‌ను బ‌లి తీసుకుంద‌ట‌. ప‌సికందును బ‌య‌ట‌కు విసిరేసి తాను ప్రాణ‌త్యాగం చేసింద‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే చ‌నిపోయిన త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద ఆ బాలుడు అలా ఏడ‌వ‌డం అంద‌రినీ కంట త‌డి పెట్టించింది. అయితే ఆమె వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు. ఆ బాలున్ని అనాథ శ‌ర‌ణాల‌యానికి పంపారు.

Comments

comments

Share this post

scroll to top