ఆక‌లిగొన్న పేద‌ల క‌డుపు నింపుతున్న రోటీ బ్యాంక్ అది..!

మ‌న దేశంలో ఎంతో మంది పేద ప్ర‌జ‌లు క‌నీసం ఒక్క పూట తిండికి కూడా నోచుకోవడం లేద‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో కొంద‌రు బిచ్చ‌గాళ్లుగా మారుతున్నారు. ఇంకొంద‌రు బ‌తుకు దుర్భ‌ర‌మై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అలాంటి పేద ప్ర‌జ‌ల ఆక‌లిని తీర్చేందుకు న‌డుం బిగించింది బుందేలీ స‌మాజ్‌. బుందేల్‌ఖండ్‌కు చెందిన ఈ స్వ‌చ్ఛంద సంస్థ అక్క‌డి మ‌హోబా అనే జిల్లాలో ఉన్న పేద ప్ర‌జ‌ల ఆక‌లిని తీరుస్తోంది. రోటీ బ్యాంక్ పేరిట ఆ సంస్థ ఏర్పాటు చేసిన బ్యాంక్ ఇప్పుడు రోజూ 400 మందికి పైగా పేద‌ల ఆక‌లిని తీరుస్తోంది.

roti-bank

బుందేల్‌ఖండ్‌లో ఉన్న మ‌హోబా జిల్లాలో పూట‌కు తిండికి నోచుకోని అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. అయితే వారి ఆక‌లి తీర్చ‌డం కోసం తారా ప‌ట్క‌ర్ అనే వ్య‌క్తి ఓ గొప్ప ప్ర‌య‌త్నం చేశాడు. బుందేలీ స‌మాజ్ అనే స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారంతో అత‌ను రోటీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాడు. అందులో ప‌ట్క‌ర్‌కు మ‌ద్ద‌తుగా కొంద‌రు వాలంటీర్లు కూడా స్వ‌చ్ఛందంగా చేరారు. వారు మ‌హోబా జిల్లాను 8 సెక్టార్లుగా విభజించారు. అందులో ఒక్కో సెక్టార్‌లో రోజూ కొంద‌రు వాలంటీర్లు ఇల్లిల్లూ తిరుగుతూ ఆ ఇండ్లలో మిగిలిపోయిన రొట్టెల‌ను సేక‌రించ‌డం మొద‌లు పెట్టారు. అలా అంద‌రూ సేక‌రించిన రొట్టెల‌ను ఒక్కో సెక్టార్‌లో ఏర్పాటు చేసిన కామ‌న్ పాయింట్‌లో ఉంచి ఎవ‌రైనా ఒక వాలంటీర్‌కు వాటిని ఇచ్చేవారు. దీంతో ఆ వాలంటీర్ ఆ సెక్టార్‌లో తిరుగుతూ అక్క‌డ రోడ్డు ప‌క్క‌న‌, గుడిసెల్లో, హాస్పిట‌ళ్లు, మురికి వాడ‌ల వ‌ద్ద నివాసం ఉండే పేద‌ల‌కు రోజూ రొట్టెల‌ను ఇస్తాడు. అలా రోటీ బ్యాంక్ ప్రారంభ‌మైంది.

మొద‌ట రోటీ బ్యాంక్‌లో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే వాలంటీర్లు ఉండేవారు. అయితే అందులో ప‌నిచేసేందుకు చాలా మంది ముందుకు వ‌స్తుండండంతో ఇప్పుడు అందులో మొత్తం 45 మంది ప‌నిచేస్తున్నారు. వారిలో 40 మంది యువ‌తీ యువ‌కులు కాగా కేవ‌లం 5 మంది మాత్ర‌మే పెద్ద‌వారు ఉన్నారు. అయితేనేం… రోటీ బ్యాంక్ ద్వారా వారు చేస్తున్న సేవ అనిర్వ‌చ‌నీయం. ఈ క్ర‌మంలో వారు ఏమంటున్నారంటే త్వ‌ర‌లో త‌మ అనుకూల‌త‌ను బ‌ట్టి వాలంటీర్లు ముందుకు వ‌స్తే ఇత‌ర ప్రాంతాల్లోనూ రోటీ బ్యాంక్‌ల‌ను విస్త‌రిస్తామని చెబుతున్నారు. నిజంగా అలాంటి రోటీ బ్యాంక్‌ల‌ను అన్ని చోట్లా ఏర్పాటు చేయాల్సిందే క‌దా. అలా చేయ‌డం వ‌ల్ల ఆక‌లిగొన్న ఎంతో మంది పేద‌ల‌కు భోజ‌నం ల‌భిస్తుంది. అంత‌కు మించిన దానం ఇంకోటీ ఉండ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top