థియేటర్‌లో ప్రదర్శించే సినిమాలకు ఇంటర్వెల్ బ్రేక్ ఎందుకుంటుందో తెలుసా?

ఇష్టమైన సినిమాను కేబుల్ టీవీ ఛానల్‌లో చూస్తున్నప్పుడు యాడ్స్ రూపంలో బ్రేక్స్ రావడం సహజం. సదరు ఛానల్ వారు తమ ఆదాయం కోసం యాడ్స్‌ను అలా ఆయా సినిమాల మధ్య మధ్యలో ప్రదర్శిస్తారు. సాధారణంగా ఏ ఛానల్ అయినా యాడ్స్‌ను నిర్దిష్ట సమయానికోసారి బ్రేక్స్ రూపంలో ప్రదర్శిస్తాయి. అయితే ఇదంతా కేబుల్ టీవీకే పరిమితం. మరి థియేటర్ మాటేమిటి? థియేటర్‌లో అయితే అలాంటి బ్రేక్స్ ఉండవు. కాకపోతే మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఆ బ్రేక్ అయినా ఎందుకుంటుంది? మీకు తెలుసా? తెలీదా? అయితే థియేటర్స్‌లో ప్రదర్శించే సినిమాలకు ఇంటర్వెల్ బ్రేక్ ఎందుకుంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

మన దేశంలో థియేటర్స్‌లో ప్రదర్శింపబడే ఏ సినిమాకైనా మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది. కానీ హాలీవుడ్‌లో మాత్రం అలా ఉండదట. అక్కడ ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాలను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారట. కానీ మన దగ్గరే సినిమా ఇంటర్వెల్ ఎందుకుంటుందంటే…

ఆంగ్ల భాషా చిత్రాల్లో అధిక శాతం వరకు తక్కువ నిడివి కలిగినవే ఉంటాయి. దీంతో ఆ సినిమాలకు మధ్యలో ఇంటర్వెల్ అవసరం ఉండదు. కానీ మన దగ్గర రిలీజయ్యే అన్ని సినిమాలు ఎక్కువ నిడివి కలిగినవి అయి ఉంటాయి. కాబట్టి వీటికి మధ్యలో కచ్చితంగా బ్రేక్ అవసరమే. లేకపోతే ప్రేక్షకులు విసిగిపోతారట.

cinema-intermission

హాలీవుడ్ చిత్రాలన్నింటినీ దాదాపు ఒకే స్ట్రక్చర్ ఆధారంగా తెరకెక్కిస్తారు. అదేమిటంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని చెప్పి 3 విభాగాలు ఉంటాయి. మొదటి దాంట్లో బిగినింగ్, రెండవ దాంట్లో మిడిల్, మూడవ దాంట్లో ఎండ్ ఇలా మూడంటే మూడు పార్ట్‌లను ఆధారంగా చేసుకుని ఓ సినిమా స్ట్రక్చర్‌ను రూపొందిస్తారు. సినిమాలో ఎక్కడా బ్రేక్ అవసరం లేకుండా వారి చిత్రాలను నిర్మాణాత్మకంగా తెరకెక్కిస్తారు. దీంతో ఆ సినిమాలు మొదటి నుంచి చివరి వరకు అలా సాగిపోతాయి.

అయితే మన భారతీయ సినిమాల్లో మాత్రం అలా కాదు. సాధారణంగా ప్రతి చిత్రాన్ని కూడా ఇంటర్వెల్ పాయింట్‌ను దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తారు. మొదటి భాగంలో పాత్రల పరిచయం, అసలు విషయాన్ని చెప్పాక ఇంటర్వెల్ పాయింట్ వద్ద ఏదో ఒక సస్పెన్స్‌ను పెట్టి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగేలా చేస్తారు. దీంతో 2వ భాగంపై వారిలో మరింత ఉత్సుకత ఏర్పడుతుంది. ఇంటర్వెల్ అనంతరం సినిమా స్టార్ట్ అయినా వెంటనే ఆ సస్పెన్స్‌ను రివీల్ చేయరు. దాన్ని నెమ్మదిగా ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఇదే కారణం వల్ల మన సినిమాల మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్‌ను ఇస్తారు.

ఇప్పుడంటే అంతా డిజిటల్ యుగం నడుస్తుంది కానీ, ఒకప్పుడైతే ఫిలిం రీల్స్‌ను ప్రొజెక్టర్ సహాయంతో తెరపై ప్రదర్శించేవారు. ఈ క్రమంలో ప్రొజెక్టర్‌ను ఆపరేట్ చేసే వ్యక్తికి సినిమా రీళ్లను సిద్ధంగా ఉంచుకునేందుకు కొంత సమయం కావల్సి వచ్చేది. సినిమా మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ ఇస్తే ఆ సమయంలో ఆపరేటర్ రీళ్లను సిద్ధం చేసుకునేవాడు. అలా అలా ఆ ఇంటర్వెల్ బ్రేక్ ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. అంతే తప్ప ప్రేక్షకులు పాప్‌కార్న్ వంటి తినుబండారాలు తినేందుకు మాత్రం ఇంటర్వెల్ బ్రేక్‌ను క్రియేట్ చేయలేదు.

Comments

comments

Share this post

scroll to top