ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం 12 వ రోజు ఎందుకు చేస్తున్నారో తెలుసా..? 9 లేదా 11 రోజులకు చేయాలి కదా?

వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు.వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.సాధారణంగా ఐదవరోజు లేదంటే తొమ్మిది,పదకొండవ రోజుల్లో ఈ నిమజ్జన కార్యక్రమం చేస్తారు.కానీ ఈ సారి ఖైరతాబాద్ వినాయకున్ని పన్నెండో రోజున అంటే సెప్టెంబర్ 5వ తేదిన నిమజ్జనం చేస్తున్నారు.

వినాయకచవితి బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది.ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 వ రోజున) ముగుస్తుంది.ప్రతి ఏడాది అనంత చతుర్దశి ఏరోజు వస్తే అప్పుడు ఖైరతాబాద్ వినాయకున్ని నిమజ్జనం చేసేవారు.ఈ సారి పన్నెండు రోజులకు వస్తుంది.కాబట్టి ఎన్ని రోజులు అనేది పరిగణనలోకి తీసుకోకుండా అనంత చతుర్దశి నాడే నిమజ్జనం చేయాలని గణేశ్ ఉత్సవకమిటీ నిర్ణయించింది.

వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా  పూజిస్తారు. మరియు అన్ని విజ్ణాలకు వినాయకున్నే అధిదేవునిగా చూస్తారు.ఏ పని ప్రారంభిచాలన్నాప్రయాణానికి ముందు వినాయకున్ని పూజించడం సర్వ సాధారణం.అలాంటి దేవుడి నిమజ్జనానికే విఝ్నాలు వెతకడం ఎందుకు..ఏ రోజు వస్తే ఆ రోజు చేసేయడమే..మరి పన్నెండో రోజున ఖైరతాబాద్ గణేశ్ తో పాటు ఎన్ని వినాయకులు నిమజ్జనం అవుతాయో చూడాలి..

అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు??

వినాయక చవితి సంప్రదాయం యావత్తూ, ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది. నదులలోను, వాగులలోను దొరికే ఒండ్రుమట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. ఏకవింశతి పత్రపూజ పేరుతో 21 రకాల ఆకులతో ఆయనను కొలుస్తాము. ఇలా కొలుచుకున్న స్వామిని, ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము. సృష్టి, స్థితి, లయలనే మూడు దశలూ ఈ పూజలో కనిపిస్తాయి. ఈ మూడింటికీ విరుద్ధంగా పూజ సాగిందంటే… అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందనే అర్థం.వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికీ ఈ విగ్రహాన్నీ, పత్రాలనూ తాకడం వల్లా… వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల… చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరతాయి.ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత…. దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలోకానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషమూ మిగలదు. అంతేకాదు! వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులూ, నదులూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి.అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమి రహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో! నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్షరుతువులోనే వస్తాయి.

ఇదండీ నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అయితే ప్రకృతి పరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజికాంశాలూ లేకపోలేదు. వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత, ఇరుగూపొరుగూ కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడమూ చూడవచ్చు. మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలని పెంచుకోవడమూ జరుగుతుంది.అయితే ఆ వేడుకలోని హోరు శృతి మించడం, ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం… నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి. ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికీ, ఆడంబరానికీ పెద్ద పీట వేస్తున్నాయి.

 

Comments

comments

Share this post

scroll to top