దొంగ ఓట్ల‌ను అరిక‌ట్టాలంటే…ఇలా చేయండి.!

ఆధార్.. ఇప్పుడ‌ది అంద‌రికీ ఆధార‌మే. ఒక‌ప్పుడంటే ఏమో గానీ ఇప్పుడు ఆధార్ లేకుండా ఏ ప‌నీ జ‌ర‌గ‌డం లేదు. విద్య‌, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం… ఇలా చెప్పుకుంటూ పోతే ఆధార్ అంత‌టా త‌ప్ప‌నిస‌రి అయింది. కాదు, అలా కేంద్ర ప్ర‌భుత్వ‌మే చేస్తోంది. పాన్ కార్డుకు ఆధార్ లింక్‌, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌, ఎల్‌పీజీ క‌నెక్ష‌న్‌కు ఆధార్‌, సిమ్ కార్డుల‌కు ఆధార్‌, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్య మాన‌వుడు ఎన్నో వాటికి ఆధార్‌ను లింక్ చేయాల్సి వ‌స్తోంది. అయితే ఓకే. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌నాల‌కు లాభం ఉంటుంద‌ని భావిస్తే ఫ‌ర్లేదు. కానీ న‌ష్టం మాత్రం ఉండ‌కూడ‌దు. అయితే మరి మ‌నం ఒక్క విష‌యం మ‌ర‌చిపోయామే..! అదేనండీ.. ఓట‌ర్ ఐడీకి ఆధార్ కార్డును అనుసంధానించ‌డం. అవును, అదే. దానికి ఎందుకు మిన‌హాయింపు ఉంది..?

ఎల‌క్ష‌న్లు వ‌స్తున్నాయంటే చాలు చోటా మోటా నాయ‌కులు వ‌చ్చి జ‌నాల కాళ్లు ప‌ట్ట‌డం, పిల్ల‌ల ముడ్లు క‌డ‌గ‌డం వంటి ప‌నులు చేయ‌డానికైనా వెనుకాడ‌రు. ఆ త‌రువాత ఎన్నిక‌ల్లో గెలిచినా, ఓడినా మ‌ళ్లీ జ‌నాల‌కు క‌నిపించ‌రు. ఇది స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా పార్టీల‌కు చెందిన నాయ‌కులు రిగ్గింగ్ కూడా చేస్తారు. ఉన్న‌వి, లేనివి, వేసిన వారివి, వేయ‌ని వారివి అన్నీ ఓట్లు తామే వేసుకుంటారు. దీనికి తోడు ఒక్కొక్క‌రికి రెండు, మూడు చోట్ల ఓట‌ర్ ఐడీ కార్డులు ఉంటాయి క‌దా. అలాంటి వారు ఒక ప్ర‌దేశంలో ఓటు వేసి తిరిగి రెండో ప్ర‌దేశంలోనూ ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు. ఇవ‌న్నీ బోగ‌స్ ఓట్ల జాబితా కింద‌కు వ‌స్తాయి. మ‌రి రిగ్గింగ్‌ను, ఈ బోగ‌స్ ఓట్ల‌ను తొల‌గించేందుకు మార్గం లేదా..? అంటే.. ఉంది. అదేనండీ ఆధార్‌..! అవును, అదే.

ఆధార్ ను ఓట‌ర్ ఐడీకి లింక్ చేస్తే చాలు క‌దా. దెబ్బ‌కు బోగ‌స్ ఓట్లు పోతాయి. ఒక వ్య‌క్తికి ఒకే చోట ఓటు ఉంటుంది. దీంతో నాయ‌కులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉండ‌దు. న‌కిలీ ఓట్లు అస‌లే ఉండ‌వు. అవును, చాలా బాగుంది క‌దా. మిగ‌తా సేవ‌ల క‌న్నా అస‌లు ఆధార్‌ను ముందుగా ఓట‌ర్ ఐడీకే లింక్ చేయాలి. కానీ అలా చేయ‌డం లేదు. అంటే.. కేంద్రం గ‌తంలో ఆధార్‌, ఓట‌ర్ ఐడీ లింక్ చేయాల‌ని చెప్పింది. కానీ మిగ‌తా వాటికి పెట్టిన‌ట్టుగా త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న పెట్ట‌లేదు. దీంతో కొంద‌రు మాత్ర‌మే స్వ‌చ్ఛందంగా త‌మ త‌మ ఆధార్ కార్డుల‌ను ఓట‌ర్ ఐడీల‌కు లింక్ చేసుకున్నారు. దీనిపై నాయ‌కులు మాత్రం స్పందించ‌డం లేదు. మిగితా సేవ‌ల‌కు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసి, కేవ‌లం ఓట‌ర్ ఐడీ విషయంలో మాత్రం ఆధార్‌ను ఎందుకు త‌ప్ప‌నిస‌రి చేయ‌డం లేదో వారికే తెలియాలి. అవును, చేయ‌రు. ఎందుకంటే రిగ్గింగ్‌కు చాన్స్ ఉండ‌దు క‌దా. న‌కిలీ ఓట్లు వేయించేందుకు అవ‌కాశం అస‌లే ఉండ‌దు. అలా ఉండ‌క‌పోతే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేరు. అందుకే ఓట‌ర్ ఐడీ, ఆధార్ లింక్ విష‌యంలో ఏ నాయ‌కుడూ స్పందించ‌డం లేదు. ఇక ముందు కూడా స్పందిస్తార‌ని ఆశిస్తే అది మ‌న పొర‌పాటే అవుతుంది..!

Comments

comments

Share this post

scroll to top