వాట్స‌ప్ గోల్డ్ ఎడిష‌న్ అంటూ మెసేజ్ వ‌చ్చిందా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే దాంతో మీ డివైస్‌లోని డేటా అంతా చోరీ అవుతుంది..!

హ్యాకింగ్‌… కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ల‌ను వాడే ప్ర‌తి ఒక్క‌రికి దాదాపుగా తెలిసిన పేరు ఇది. కంప్యూట‌ర్లు, ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చిన తొలి నాళ్ల నుంచి నేటి స్మార్ట్‌ఫోన్ యుగం వ‌ర‌కు హ్యాక‌ర్లు త‌మ పంజా విసురుతూనే ఉన్నారు. టెక్నాల‌జీ ఎంత‌గా డెవ‌ల‌ప్ అయినా, కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు ఎన్ని వ‌చ్చినా వారి బెడ‌ద మాత్రం త‌ప్ప‌డం లేదు. రోజూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక చోట పెద్ద ఎత్తున సైబ‌ర్ దాడులు చేస్తూ హ్యాకింగ్‌కు పాల్ప‌డుతున్నారు. సెక్యూరిటీ ఎంత ప‌టిష్టంగా ఉన్నా హ్యాక‌ర్లు ఏదో ఒక ట్రిక్ స‌హాయంతో వినియోగ‌దారుల డివైస్‌ల‌లోకి చొర‌బ‌డి వారి స‌మాచారాన్ని దొంగిలిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఇన్‌స్టాంట్ మెసెంజ‌ర్ వాట్స‌ప్‌లోనూ ఇప్పుడు హ్యాక‌ర్లు త‌మదైన శైలిలో విజృంభిస్తున్నారు. అందుకోసం వారు ఓ మెసేజ్ ట్రిక్‌ను ఉప‌యోగించుకుంటున్నారు. అదేమిటంటే…

Whatsapp-Gold-Edition

కేవ‌లం సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖ వ్య‌క్తులు వాడే వాట్స‌ప్ గోల్డ్ ఎడిష‌న్ ప్రీమియం యాప్ ఇప్పుడు సాధార‌ణ యూజ‌ర్ల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చింద‌ని, దాన్నిఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చ‌ని యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం వాట్స‌ప్‌లో ఓ మెసేజ్ ఎక్కువగా వ‌స్తోంది. దాంట్లో ఓ వెబ్‌సైట్‌కు చెందిన లింక్ కూడా ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆ లింక్‌ను క్లిక్ చేస్తే పైన చెప్పిన వాట్స‌ప్ గోల్డ్ ఎడిష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని ఆ మెసేజ్‌లో ఉంటుంది. దీంతో ఆ మెసేజ్‌కు స‌హ‌జంగానే ఆక‌ర్షితులైన యూజ‌ర్లు అందులో ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసే క్ర‌మంలో ఆ లింక్ ద్వారా ఓపెన్ అయ్యే సైట్‌లో ఉండే మాల్‌వేర్ యూజ‌ర్ డివైస్‌లోకి చొర‌బ‌డుతుంది. దీంతో ఆ డివైస్‌లోని స‌మాచారాన్నంతా ఆ మాల్‌వేర్ సంబంధిత హ్యాక‌ర్‌కు చేర‌వేస్తుంది. కాగా పేరుకు త‌గిన‌ట్టుగానే ఆ వాట్స‌ప్ గోల్డ్ ఎడిష‌న్ థీమ్‌, ఐకాన్లు గోల్డ్ క‌ల‌ర్‌లో ఉండ‌డం గ‌మనార్హం. దీని వ‌ల్ల మ‌రింత ఎక్కువ మంది యూజ‌ర్లు ఆ మెసేజ్ ప‌ట్ల ఆకర్షితుల‌వుతూ వాట్స‌ప్ గోల్డ్ ఎడిష‌న్ నిజంగానే వ‌చ్చింద‌ని భావించి దాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంతో విలువైన త‌మ స‌మాచారాన్ని హ్యాక‌ర్ల బారిన ప‌డేలా చేసుకుంటున్నారు.
గోల్డ్ ఎడిష‌న్ పేరిట వాట్స‌ప్‌లో అలాంటి యాప్‌ను తాము విడుద‌ల చేయ‌లేద‌ని వాట్స‌ప్ ప్ర‌తినిధులు కూడా చెబుతున్నారు. అయినా ఇది తెలియ‌ని కొంత మంది యూజ‌ర్లు ఆ మెసేజ్‌కు ఆకర్షితులై మాల్‌వేర్‌ల బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి న‌కిలీ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌ద్ద‌ని ప‌లు ఐటీ, సెక్యూరిటీ సంస్థ‌లు కూడా సూచిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్ల‌యితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజ‌ర్ల‌యితే యాపిల్ స్టోర్ నుంచి వాట్స‌ప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని, ఇత‌ర థ‌ర్డ్‌పార్టీ సైట్ల నుంచి ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకూడ‌ద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఒక వేళ పొర‌పాటున ఎవ‌రైనా ఈ వాట్స‌ప్ గోల్డ్ ఎడిష‌న్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే దాన్ని వెంట‌నే తీసేయాల‌ని, అలా తీసేశాక మళ్లీ ఒరిజిన‌ల్ వాట్స‌ప్‌ను వాడాలంటే క‌నీసం ఒక రోజు వ‌ర‌కు ఆగాల‌ని వారు తెలియ‌జేస్తున్నారు. ఏదైనా యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ యాప్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇలాంటి మాల్‌వేర్స్ బాధ తప్పుతుంద‌ని వారు సూచిస్తున్నారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top