మీగడ కట్టిన గడ్డ పెరుగును చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు చెప్పండి. అయితే కేవలం ఆహారంగానే కాక పెరుగును నిత్యం తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మండే వేసవిలో పెరుగును రోజూ తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల శరీరం నుంచి అధిక ఉష్ణం బయటకు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. కడుపులో మంట తొలగిపోతుంది. శారీరక దృఢత్వం కలుగుతుంది. పెరుగులో పుష్కలంగా లభించే కాల్షియం ఎముకలకు చాలా మంచిది. అయితే పెరుగును రోజులో ఎప్పుడు తీసుకోవాలి? తెలుసుకుందాం రండి.
- పాలలో మీగడ తీయకుండా తయారైన పెరుగును మాత్రమే తినాలట. ఎందుకంటే మీగడ తీసిన పెరుగు ద్వారా ఎలాంటి పోషకాలు మనకు అందవట. అదేవిధంగా పగటి పూట పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుందట. రాత్రి పూట పెరుగును తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుందట. దీని వల్ల జలుబు, అధిక కఫం వంటి సమస్యలు వస్తాయట.
- పెరుగును చిలికి తయారు చేసే చల్ల చల్లని మజ్జిగను తాగితే వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు. దప్పికను అరికట్టే గుణాలు మజ్జిగలో ఉన్నాయి. ఇది మెదడుకు కూడా చలువ చేస్తుంది.
- చర్మ సంరక్షణకు కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి మృదుత్వాన్ని అందించే గుణాలు పెరుగులో ఉన్నాయి. పెరుగు చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. నిత్యం కొంత పెరుగును తీసుకుని చర్మానికి మర్దనా చేస్తే శరీరం కాంతిని సంతరించుకుంటుంది.
- శిరోజాల సంరక్షణకు కూడా పెరుగు బాగానే ఉపయోగపడుతుంది. షాంపూ కన్నా పెరుగు వాడడం ఉత్తమమని ఆయుర్వేదం కూడా చెబుతోంది. స్నానం చేయబోయే ముందు కొద్దిగా పెరుగును తీసుకుని జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేసి, అనంతరం తలస్నానం చేస్తే శిరోజాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. అంతేకాదు వెంట్రుకలకు దృఢత్వం కలుగుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.
- ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నారింజ లేదా నిమ్మరసాన్ని కలిపి, ఆ మిశ్రమాన్ని మెడ వెనుక భాగంలో, ముఖానికి బాగా రాయాలి. 10 నిమిషాల తర్వాత మెత్తని బట్టతో తుడిచి, నీటితో కడగాలి. అనంతరం టవల్‌తో నెమ్మదిగా తుడవాలి. ఇలా చేస్తే ఆయా భాగాల్లోని చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది.
- కొద్దిగా పెరుగును తీసుకుని అందులో శనగపిండిని కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. దీని వల్ల మొటిమలు తగ్గిపోతాయి.
- కొంత పెరుగును తీసుకుని అందులో ముల్లంగి రసాన్ని కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల ముఖానికి కాంతి వస్తుంది.
- నాలుగు చుక్కల బాదం నూనె, పన్నీరు, ఒక టీ స్పూన్ పెరుగులను కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. దీన్ని స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకోవాలి. అనంతరం 30 నిమిషాల పాటు ఆగాలి. తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది.
- ఎండ వల్ల చర్మం కమిలిపోతే 2 టీ స్పూన్ల టమాటా రసంలో 5 టీ స్పూన్ల పెరుగు కలిపి రాసుకుని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. 4 టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా వెనిగర్ కలిపి కాళ్ళకు పట్టించాలి. అనంతరం కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లకు మృదుత్వం వస్తుంది.
- మంచి గడ్డ పెరుగును తీసుకుంటూ ఉంటే విరేచనాలు కూడా ఆగిపోతాయి.