పాకిస్తాన్ లో ఎన్‌సీఏ అంటే ఏంటీ… అసలు యుద్ధానికి ఎన్‌సీఏకి సంబంధం ఏంటి?

పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడి జరగడంతో దానికి ప్రతీకారంగా భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలో మెరుపు దాడులు చేసాయి. జైషే మహ్మద్ కు చెందిన మూడు తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేసాయి. అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
భారత్ దాడులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. నేతలతో ప్రధాని సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్స్ లు జరుగుతూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం భారత వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌ లోపల జైషే మహమ్మద్ శిబిరాలను ధ్వంసం చేసిందని చెబుతుంటే, అటు పాకిస్తాన్ మాత్రం తమ వైమానిక దళం భారత యుద్ధ విమానాలను తిప్పికొట్టిందని చెబుతోంది.


భారత్ వైమానిక దాడుల వార్తల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో భద్రతా సలహా మండలి సమావేశం జరిగింది. ఆ వెంటనే ఆ దేశ మంత్రి భారత్ ఒప్పందాలని ఉల్లంఘించిందని వెల్లడించారు. భారత్ తమ దేశంపై చేసిన దాడులకు తిరిగి సరైన సమయంలో సమాధానం చెప్తామని ఆ దేశ రైల్వే మంత్రి తెలిపారు.
దీంతో అప్పటి నుంచి భారత్, పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అందరూ దీనిపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందా అంటూ ఎదురు చూసారు. ఈ నేపధ్యంలో బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.
ఎన్‌సీఏ అంటే పాకిస్తాన్ లోని అత్యున్నత సైనిక వేదిక. ఇక్కడ దేశ భద్రతకు సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. పాకిస్తాన్ అణ్వాయుధాలపై కీలక నిర్ణయాలు ఈ కమిటీ తీసుకుంటుంది. యుద్ధవ్యూహాల విషయంలో కీలకమైన అణు, క్షిపణి సంబంధిత అన్ని పాలసీలపై నిర్ణయం తీసుకునే హయ్యస్ట్ అథారిటీ ఎన్‌సీఏ. దీనితోపాటు అణు, క్షిపణి కార్యక్రమాన్ని అది పర్యవేక్షిస్తుంది.
యుద్ధం జరిగేటప్పుడు, ఉద్రిక్త పరిస్థితుల్లో ఆర్మీని ఎలా మొహరించాలనేదానిపై ఎన్‌సీఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో రాజకీయ, సైనిక నేతృత్వం రెండూ భాగంగా ఉంటాయి. పాక్ ప్రధాన మంత్రి దీనికి అధ్యక్షుడుగా ఉంటారు. త్రివిధ దళాల చీఫ్, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని భారత్ పాక్ పై చేసిన దాడిపై ఏ విధంగా స్పందించాలి, మనం ఏ విధంగా భారత్ పై దాడి చెయ్యాలి అని భద్రతాదళాధికారులతో చర్చించారు. సాధారణంగా ఎన్‌సీఏ సమావేశం చాలా అరుదుగా జరుగుతుంది. దేశంలో భద్రత సంబంధిత విషయాలు తలెత్తినపుడు, సరిహద్దు దాటి చొరబాట్లు జరిగినపుడు ఈ సమావేశానికి పిలుపునిస్తారు. ఇది చాలా తీవ్రమైన, అత్యున్నత స్థాయి వేదిక.

Comments

comments

Share this post

scroll to top