బ్లడ్ గ్రూప్‌లలో A, B, AB, O అనే గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాల్లో చాలా మందికి ఈ నాలుగు గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపు రక్తం ఉంటుంది. కాకపోతే మళ్లీ వీటిల్లో పాజిటివ్, నెగెటివ్ అని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటి ప్రకారమే వైద్యులు టెస్ట్ చేసి రక్తం గ్రూపును బట్టి రక్తాన్ని తీసుకోవడమో, ఇవ్వడమో చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఇవే కాదు, ఇంకో గ్రూప్ రక్తం కూడా ఉంది. అదే బాంబే బ్లడ్ గ్రూప్. హీరో గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు అనే సినిమాలోనూ ఈ బ్లడ్ గ్రూప్ గురించి ప్రధానంగా వివరించారు. అది వేరే విషయం. అయితే ఇంతకీ బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం.
బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం గురించి మనకు తెలియాలంటే ముందుగా మనకు పైన చెప్పిన A, B, AB, O అనే గ్రూప్ ల రక్తం ఏవిధంగా ఉంటుందో తెలియాలి. సాధారణంగా మన రక్తంలో 50 శాతం వరకు రక్తాన్ని ఎర్ర రక్త కణాలు తయారు చేస్తాయి. మిగిలిన 1 శాతం తెల్ల రక్త కణాలు ఉంటాయి. 49 శాతం వరకు ప్లాస్మా ఉంటుంది. అయితే రక్తం గ్రూప్ అనేది ఎర్ర రక్త కణాలు, ప్లాస్మాలపై ఉన్న యాంటీ జెన్, యాంటీ బాడీలపై ఆధార పడి ఉంటుంది. యాంటీ జెన్లలో, యాంటీ బాడీలలో A, B అని రెండు రకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఎర్ర రక్త కణాలపై A యాంటీ జెన్లు, ప్లాస్మాపై B యాంటీ బాడీలు ఉంటే అది A గ్రూప్ రక్తం అవుతుంది. ఇక ఎర్ర రక్త కణాలపై B యాంటీ జెన్లు, ప్లాస్మాపై A యాంటీ బాడీలు ఉంటే అది B గ్రూపు రక్తం అవుతుంది. ఇక ఎర్ర రక్త కణాలపై A, B యాంటీ జెన్లు మాత్రమే ఉండి, ప్లాస్మాపై ఎలాంటి యాంటీ బాడీలు లేకపోతే అది AB గ్రూపు రక్తం అవుతుంది.
అదేవిధంగా ఎర్ర రక్త కణాలపై యాంటీ జెన్లు ఏమీ లేకుండా ప్లాస్మాపై A, B యాంటీ బాడీలు రెండూ ఉంటే అది O గ్రూప్ రక్తం అవుతుంది. ఈ క్రమంలో ఆయా కణాలపై ఉండే RhD యాంటీజెన్లు రక్తం పాజిటివా, నెగెటివా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది బాంబే బ్లడ్ గ్రూప్ గురించి కాబట్టి, అక్కడికే వద్దాం. O గ్రూపులో ఉన్నట్టుగానే బాంబే బ్లడ్ గ్రూప్‌లో ఎర్ర రక్త కణాలపై యాంటీ జెన్లు ఉండవు. ప్లాస్మాపై A, B యాంటీ బాడీలు రెండూ ఉంటాయి. దీంతో O గ్రూప్ రక్తాన్నే బాంబే బ్లడ్ గ్రూప్ అని అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది తెలియకపోవడంతో నిజంగా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని O గ్రూప్ అని భావించి వారికి అదే రక్తాన్ని ఎక్కిస్తున్నారు. దీంతో ఆ రక్తం పడక బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చనిపోతున్నారు.
మరి బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కనిపెట్టలేమా..? అంటే చేయవచ్చు. అందుకు H యాంటీ జెన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాంటీ జెన్ రక్తంలో ఉంటే అది బాంబే బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఇందులోనూ పాజిటివ్, నెగెటివ్ అని మళ్లీ రెండు రకాలు ఉంటాయి. పాజిటివ్ చాలా అరుదు అనుకుంటే నెగెటివ్ ఇంకా అరుదుగా ఉంటుంది. కొన్ని కోట్ల మందిలో బాంబే బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్న వారు ఒక్కరు ఉంటారు. ఇక ఇదే బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్న వారు 10వేల మందిలో ఒక్కరుంటారు. అయితే మరి ఈ బ్లడ్ గ్రూప్‌కు బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరెందుకు వచ్చిందో తెలుసా..?
1952వ సంవత్సరంలో ముంబైలో ఓ రైల్వే ఉద్యోగికి, ఓ కత్తిపోటు బాధితుడికి తీవ్ర రక్త స్రావం అవడంతో వారికి రక్తం అవసరం అయింది. దీంతో వారి బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేశారు. అయితే డాక్టర్లు ఎంత టెస్ట్ చేసినా వారి బ్లడ్ గ్రూప్ ఏమిటో కనిపెట్టలేకపోయారు. దీంతో వారి ఎర్ర రక్త కణాల్లో ఉన్న H యాంటీ జెన్లను బట్టి అదో కొత్త రకమైన బ్లడ్ గ్రూప్ అని నిర్దారించారు. బాంబే (ఇప్పుడు ముంబై)లో ఈ బ్లడ్ గ్రూప్‌ను కనుగొన్నారు కనుక దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చింది. అయితే అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు విచిత్రంగా ముంబైలోనే ఎక్కువ ఉన్నారట. అవును, మీరు విన్నది నిజమే. మరి దేశంలో ఎవరికైనా ఈ గ్రూపు రక్తం అవసరం అయితే..? అంటే.. అందుకు కృషి చేస్తోంది సంకల్ప్ ఇండియా ఫౌండేషన్. http://www.sankalpindia.net/ వెబ్‌సైట్‌ను సందర్శించి బాంబే బ్లడ్ గ్రూప్ అవసరం ఉన్నవారు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ సంస్థే చార్జీలు భరించి రక్తాన్ని ఉచితంగా సరఫరా చేస్తుంది.