బిట్ కాయిన్ అంటే ఏమిటో.. దాన్ని ఎవ‌రు త‌యారు చేశారో, ఎలా ప‌నిచేస్తుందో వివ‌రాలు తెలుసా..?

నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా మన‌కు వినిపిస్తున్న ఒకే మాట.. బిట్ కాయిన్‌.. మీడియాలో, వెబ్‌సైట్ల‌లో.. ఎక్క‌డ చూసినా బిట్ కాయిన్ గురించే చ‌ర్చ న‌డుస్తోంది. దాని విలువ బాగా పెరిగింద‌ని మ‌నం రోజూ తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఇంత‌కీ అస‌లు బిట్ కాయిన్ అంటే ఏమిటి..? దాన్ని ఎవ‌రు త‌యారు చేశారు, ఎలా అందుబాటులోకి వ‌చ్చింది, ఎలా న‌డుస్తుంది ? వ‌ంటి వివ‌రాలు మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

 

బిట్ కాయిన్ అనేది వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ. దీన్నే డిజిట‌ల్ క‌రెన్సీ అని కూడా అంటారు. అంటే కేవ‌లం ఇంట‌ర్నెట్‌లోనే మ‌నం వాడుకోగ‌ల‌మ‌న్న‌మాట‌. మ‌నం ఈ క‌రెన్సీని చేతితో ప‌ట్టుకోలేం. కేవ‌లం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే మ‌న‌కు ఇది ప‌నికొస్తుంది. ఇక దీన్ని మొద‌ట‌గా 2008లో స‌తోషి న‌క‌మొటొ అనే వ్య‌క్తి (అస‌లు పేరు ఇది కాదు, వేరే ఉంది, బ‌య‌ట‌కు రాలేదు) త‌యారు చేశాడు. కొద్ది మంది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ల‌తో బిట్ కాయిన్ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. అప్పుడే ఆగ‌స్టు 18, 2008న bitcoin.org వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇక ఈ క‌రెన్సీకి మొద‌ట్లో అస‌లు ఎలాంటి విలువ లేదు. కానీ మార్చి 2010లో క‌రెన్సీ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. దీంతో అప్ప‌ట్లో ఒక బిట్ కాయిన్ విలువ 0.003 అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉండేది. అయితే అన‌తి కాలంలోనే ఇది పెరిగింది. ఎందుకంటే…

బిట్ కాయిన్ అనేది పీర్ టు పీర్ ఎల‌క్ట్రానిక్ క్యాష్ సిస్ట‌మ్‌. అంటే అమ్మ‌కందారుకు, కొనుగోలుదారుకు మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తులు ఎవ‌రూ ఉండ‌రు. వారి మ‌ధ్య ట్రాన్సాక్షన్ (విలువ మార్పిడి) జరుగుతుంది. దీంతో బిట్ కాయిన్ల‌ను చాలా త‌క్కువ ప్రాసెసింగ్ ఫీజుకే పెద్ద మొత్తంలో ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీనికి తోడు బిట్ కాయిన్ల‌ను పంపే వారికి, తీసుకునేవారికి ఒక‌రి వివ‌రాలు మ‌రొక‌రికి తెలియ‌వు. అంతా గోప్యంగా ఉంటాయి. మొత్తం సెక్యూర్డ్ సాఫ్ట్‌వేర్ ద్వారా బిట్‌కాయ‌న్ లావాదేవీలు జ‌రుగుతాయి. క‌నుక‌నే బిట్ కాయిన్‌ను క్రిప్టో క‌రెన్సీ అని కూడా పిలుస్తారు. ఇక బిట్ కాయిన్‌లో ఉన్న మ‌రో సౌల‌భ్యం ఏమిటంటే.. ఇందులో జ‌రిగే లావాదేవీలు మూడో వ్య‌క్తికి తెలియ‌వు. క‌నుక ప్ర‌భుత్వాలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు బిట్ కాయిన్ల‌ను పంపుకునే వారికి ఎలాంటి ట్యాక్సులు విధించ‌లేవు. ఇది చాలా మందికి ప్ల‌స్ పాయింట్ అయింది. దీంతో పెద్ద ఎత్తున డ‌బ్బును బిట్ కాయిన్ల రూపంలో దేశాలు దాటించేస్తున్నారు. ఎలాగూ ఫీజు కూడా చాలా త‌క్కువ ఉంటుంది క‌నుక పెద్ద మొత్తంలో డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే వారికి బిట్ కాయిన్ ఓ వ‌రంలా మారింది.

అయితే నిజానికి బిట్ కాయిన్ ను కొంద‌రు ప్రైవేటు వ్య‌క్తులు త‌యారు చేసినందున ఇది ఏ దేశ క‌రెన్సీ కూడా కాదు. క‌నుక ఏ దేశ ప్ర‌భుత్వం కూడా బిట్ కాయిన్‌కు పూచీ ఇవ్వ‌డం లేదు. సాధార‌ణంగా ఆయా దేశాలు త‌యారు చేసే క‌రెన్సీకి అక్క‌డి ప్ర‌భుత్వాలు, బ్యాంకులు పూచీగా, హామీగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్‌కు ఏ దేశ ప్ర‌భుత్వం, బ్యాంకు పూచీ ఇవ్వ‌డం లేదు. ఇది బిట్ కాయిన్‌కు ఉన్న మైన‌స్ పాయింట్‌. దీనికి తోడు బిట్ కాయిన్ లావాదేవీలు మొత్తం కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్ ద్వారానే న‌డుస్తాయి క‌నుక ఎప్పుడైనా సాఫ్ట్‌వేర్ స‌మ‌స్య వ‌చ్చినా, లేదంటే హ్యాకింగ్‌కు గురైనా, స‌ర్వ‌ర్లు స‌మ‌స్య‌గా మారినా బిట్ కాయిన్ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంది. క‌నుక ఈ ప‌రిణామాల‌ను కూడా బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేసే వారు గుర్తుంచుకోవాలి.

ఇక బిట్ కాయిన్ల‌ను ఒక‌రికొక‌రు ఎలా పంపుకుంటారంటే.. బిట్ కాయిన్ల‌ను మ‌న ద‌గ్గ‌ర ఉండే వాస్త‌వ క‌రెన్సీతో ముందుగా కొనుగోలు చేయాలి. అందుకు బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు ప‌నిచేస్తాయి. ఇక మ‌న ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను అవ‌తలి వారికి పంపాల‌న్నా, లేదంటే వారి ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను మ‌నం తీసుకోవాలన్నా అందుకు బిట్ కాయిన్ ప‌బ్లిక్ కీ ఉప‌యోగ‌ప‌డుతుంది. సాధార‌ణంగా కొత్త‌గా బిట్ కాయిన్ల‌ను కొన్న‌వారికి బిట్ కాయిన్ వాలెట్ ఇస్తారు. దానికి యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఉంటాయి. ఈ రెండింటినీ క‌లిపి ప్రైవేట్ కీ అంటారు. ఈ క్ర‌మంలో ప్రైవేట్‌ కీ ఉన్న ఇద్ద‌రు యూజ‌ర్లు త‌మ ప‌బ్లిక్ కీ ల ద్వారా బిట్ కాయిన్ల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీంతో ఒక‌రి వివ‌రాలు మ‌రొక‌రికి తెలియవు. పూర్తిగా గోప్యంగా ఉంటాయి. ఇక ఈ ప‌బ్లిక్ కీ మొత్తం క‌నిష్టంగా 30కి పైన‌, గ‌రిష్టంగా 130కి లోపు క్యారెక్ట‌ర్లను క‌లిగి ఉంటుంది. ఇది సాధార‌ణంగా 1, 5 లేదా 9 నంబ‌ర్‌తో ప్రారంభ‌మ‌వుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కీలో కూడా దాదాపుగా ఇంతే క్యారెక్ట‌ర్ లిమిట్ ఉంటుంది. కాగా ఇవి మొత్తం వివిధ అక్ష‌రాలు, లెట‌ర్లు, సింబ‌ల్స్ కాంబినేష‌న్‌లో ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప‌బ్లిక్ కీల‌ను ఉపయోగించి బిట్ కాయిన్ల‌ను పంపుకుంటారు. అందువ‌ల్ల అవ‌తలి వారి వివ‌రాలు ఇవ‌త‌లి యూజ‌ర్‌కు తెలియ‌వు.

మ‌రి ఈ మ‌ధ్య కాలంలోనే బిట్ కాయిన్ విలువ అంత‌లా ఎందుకు పెరిగిందంటే… కొన్ని దేశాల ప్ర‌భుత్వాలు బిట్ కాయిన్‌ను వాస్త‌వ క‌రెన్సీగా గుర్తించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయట‌. అందుక‌నే బిట్ కాయిన్ విలువ అంత‌లా పెరిగింది. ఒక‌ప్పుడు.. అంటే.. మార్చి 2010లో 0.003 అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉన్న ఒక బిట్ కాయిన్ విలువ ఇప్పుడు ఏకంగా 18వేల అమెరిక‌న్ డాల‌ర్ల‌కు పైనే ప‌లుకుతోంది అంటేనే బిట్ కాయిన్‌కు ఎంత‌టి డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. త్వ‌ర‌లో బిట్ కాయిన్‌ను భౌతిక రూపంలో కూడా విడుద‌ల చేస్తార‌ట‌. వాటిల్లో ప‌బ్లిక్‌, ప్రైవేట్ కీలు అమ‌ర్చ‌బ‌డి ఉంటాయ‌ట‌. వాటితో ఇంట‌ర్నెట్‌లో వ‌ర్చువ‌ల్ బిట్ కాయిన్ల‌ను సొమ్ము చేసుకోవ‌చ్చు. అయితే కాసేసియస్ బిట్ కాయిన్ లు అని పిల‌వ‌బ‌డే బిట్ కాయిన్ల‌ను భౌతిక రూపంలో ఇప్ప‌టికే విక్ర‌యిస్తున్నారు. వీటిని నిజ‌మైన భౌతిక బిట్‌కాయిన్‌లుగా చెలామ‌ణీ చేస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్‌, బ్రాస్ కోటింగ్ లు ఉన్న‌వి ల‌భిస్తున్నాయి. ఆయా కోటింగ్ ల‌ను బ‌ట్టి ఈ కాయిన్ల విలువ‌లు ఉంటాయి. ఇదీ.. క్లుప్తంగా చెప్పాలంటే.. బిట్ కాయిన్ కు సంబంధించిన క‌హానీ..! ఇదంతా స‌రే.. అస‌లు బిట్ కాయిన్ల‌తో వేటిని కొనుగోలు చేస్తారు..? అనే క‌దా మీ డౌట్‌.. ఏమీ లేదండీ.. ఈ మ‌ధ్య కాలంలో చాలా వ‌ర‌కు ఐటీ కంపెనీలు తమ బిల్స్‌ను బిట్ కాయిన్ల రూపంలో చెల్లిస్తున్నాయి. దీనికి తోడు ఆన్‌లైన్‌లో ప‌లు గేమింగ్‌, షాపింగ్ సైట్ల‌లోనూ బిట్ కాయిన్ల‌ను విరివిగా వాడుతున్నారు..! అయితే.. ఏది ఏమైనప్ప‌టికీ.. ఒక్క విష‌యం మాత్రం క‌చ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. అదేమిటంటే… బిట్ కాయిన్ అనేది వాస్త‌వ క‌రెన్సీ కాదు, వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ..! దీన్ని దృష్టిలో పెట్టుకుని బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే పెద్ద ఎత్తున డ‌బ్బు ఇన్వెస్ట్ చేశాక‌, అది కుప్ప‌కూలితే అప్పుడు చాలా న‌ష్టం వ‌స్తుంది. క‌నుక జాగ్ర‌త్త‌..!

 

Comments

comments

Share this post

scroll to top