రైలు ఇంజిన్ల‌పై ఉండే WAP 5, WDM 3A వంటి అక్ష‌రాల‌కు అర్థం ఏమిటో తెలుసా..?

మ‌న దేశంలో రైళ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. కొన్ని ప్యాసింజ‌ర్ ట్రెయిన్స్ అయితే కొన్ని ఎక్స్ ప్రెస్ ట్రెయిన్స్‌, మ‌రికొన్ని సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్ ఉంటాయి. ఇవే కాకుండా గూడ్స్ రైళ్లు కూడా ఉంటాయి. అయితే ఏ రైలుకైనా ఇంజిన్ ఉంటుంది క‌దా, దానిపై WAP 5 లేదా, WDM 3A వంటి కొన్ని అక్ష‌రాలు ఉంటాయి, జాగ్ర‌త్తగా గ‌మ‌నించారా..? అవును ఉంటాయి. కానీ మీరు వాటిని ప‌ట్టించుకుని ఉండ‌రు. అయితే జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలే గానీ వాటి వ‌ల్ల మ‌న‌కు కొన్ని విష‌యాలు తెలుస్తాయి. అవేమిటంటే…

రైలు ఇంజిన్‌ల‌పై ఉండే WAP 5 వంటి అక్ష‌రాల‌కు అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన చెప్పిన అక్ష‌రాల్లో మొద‌టి అక్ష‌రం W ఉంటే అది వైడ్ గేజ్ అని అర్థం. అంటే రైలు ప‌ట్టాల నిడివి. సాధార‌ణంగా మ‌నం ప్రయాణించే రైళ్ల ప‌ట్టాల గేజ్ ఇదే. 5 అడుగులు ఉంటుంది. అదే మొద‌టి అక్ష‌రం Y ఉంటే అది మీట‌ర్ గేజ్ అని అర్థం. దీని ప‌ట్టాల నిడివి 3 అడుగులు ఉంటుంది. మొద‌టి అక్ష‌రం Z ఉంటే నారో గేజ్ అని అర్థం. ప‌ట్టాల నిడివి 2 అడుగుల 6 ఇంచులు ఉంటుంది. ఇక మొద‌టి అక్ష‌రం N ఉంటే నారో గేజ్ అనే అర్థం వ‌స్తుంది. కాక‌పోతే ప‌ట్టాల నిడివి 2 అడుగులు మాత్ర‌మే ఉంటుంది.

ఇక పైన చెప్పిన అక్ష‌రాల్లో రెండో అక్ష‌రం A ఉంటే ఎల‌క్ట్రిక‌ల్ ఇంజిన్ అని, D ఉంటే డీజిల్ ఇంజిన్ అని, C ఉంటే డీసీ ఎల‌క్ట్రిక్ ఇంజిన్ అని, CA రెండు ఉంటే డీసీ, ఏసీ క‌రెంట్‌పై న‌డిచే ఇంజిన్ అని, B అని ఉంటే బ్యాట‌రీపై న‌డిచే ఇంజిన్ అని అర్థాలు వ‌స్తాయి.

ఇక మిగిలిన మూడ‌వ అక్ష‌రంలో G అని ఉంటే గూడ్స్ ఇంజిన్ అని, P అని ఉంటే ప్యాసింజ‌ర్స్‌ను తీసుకెళ్లే రైలు ఇంజిన్ అని, M అని ఉంటే ప్యాసింజ‌ర్, గూడ్స్ ఇంజిన్ అని, S ఉంటే ఇంజిన్‌ల‌ను మార్చే ఇంజిన్ అని, U ఉంటే అర్బ‌న్ మెట్రో ఇంజిన్ అని, R ఉంటే రైల్ కార్ అని తెలుసుకోవాలి.

ఇక చివ‌రిగా ఉన్న 5 అంకె లోకోమోటివ్ ఇంజిన్ గ్రేడ్‌, జ‌న‌రేష‌న్‌ను సూచిస్తుంది. 5వ త‌రం ఇంజ‌న్ అన్న‌దాన్ని తెలియ‌జేయ‌డం కోసమే ఆ నంబ‌ర్ వేస్తారు.

అయితే కొన్ని రైలు ఇంజిన్‌ల‌కు WDM 3A అని ఉంటుంది. ఇందులో మొద‌టి మూడు అక్ష‌రాల‌కు మ‌న‌కు అర్థాలు తెలుసు. W అంటే వైడ్‌గేజ్‌, D అంటే డీజిల్ ఇంజిన్‌, M అంటే ప్యాసింజ‌ర్‌, గూడ్స్ ఇంజిన్ అని తెలుస్తుంది. మ‌రి చివ‌రిగా ఉన్న 3A కు అర్థం ఏమిటంటే… ఆ రైలు ఇంజిన్ ప‌వ‌ర్ అన్న‌మాట‌. 3A అంటే 3000 hp అని అర్థం వ‌స్తుంది. అదే 5A ఉంటే 5000 hp అని తెలుసుకోవాలి. కాబ‌ట్టి తెలుసుకున్నారుగా, రైలు ఇంజిన్లపై ఉండే ఆ అక్ష‌రాల‌కు అర్థాలు ఏమిటో…!

Comments

comments

Share this post

scroll to top