రోడ్డుపై వాహనాలను నడిపే వాహనదారులే కాదు, నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. ట్రాఫిక్ గుర్తులపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా విధిగా చూసుకుని మరీ వెళ్లాలి. దీంతోనే అధిక శాతం వరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. అయితే కేవలం ట్రాఫిక్ గుర్తులు, సిగ్నల్సే కాదు, రహదారులపై తెలుపు, పసుపు రంగుల్లో వేసే కొన్ని రకాల గీతలను కూడా అందరూ చూసుకుని వెళ్లాలి. అసలు ఆ గీతలను ఎందుకు వేస్తారు? వాటితో ఉపయోగమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దృఢమైన తెలుపు రంగు గీత ఒక్కటే ఉంటే…
రహదారిపై తెలుపు రంగు గీత దృఢంగా, నిటారుగా ఒక్కటే ఉంటే వాహనదారులు తమకు కేటాయించిన లేన్‌లోనే వెళ్లాలని అర్థం. ఇతర లేన్‌లోకి ప్రవేశించకూడదు.
అక్కడక్కడా బ్రేక్‌లతో తెలుపు రంగు గీత ఉంటే…
రహదారిపై ఉండే తెలుపు రంగు గీతలో అక్కడక్కడా బ్రేక్స్ ఉంటే వాహనదారులు లేన్స్ ఛేంజ్ కావచ్చని అర్థం. అయితా అలా లేన్ ఛేంజ్ అయ్యే సమయంలో జాగ్రత్తగా అన్ని దిక్కులూ చూసుకుని మరీ లేన్ ఛేంజ్ అవ్వాల్సి ఉంటుంది.
దృఢమైన పసుపు రంగు గీత ఉంటే…
పైన చెప్పినట్టుగా తెలుపు రంగు గీతకు బదులుగా రహదారి మధ్యలో దృఢమైన, నిటారైన పసుపు రంగు గీత ఉంటే వాహనాలను ఓవర్ టేకింగ్ చేయవచ్చని అర్థం. అయితే పసుపు రంగు గీత మాత్రం దాటకూడదు. కానీ ఈ గీత అర్థం అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదు. ఉదాహరణకు తెలంగాణలో అయితే ఇలాంటి పసుపు గీత రహదారిపై ఉంటే ఓవర్ టేకింగ్ చేయకూడదని అర్థం వస్తుంది.
దృఢమైన పసుపు రంగు గీతలు రెండు ఉంటే…
రహదారిపై దృఢమైన పసుపు రంగు గీతలు రెండు ఉంటే ఓవర్ టేకింగ్ చేయడం నిషేధించబడిందని అర్థం.
పసుపు గీతలు మధ్యలో బ్రేక్స్ కలిగి ఉంటే…
రహదారిపై ఉండే పసుపు రంగు గీతలు మధ్య మధ్యలో బ్రేక్స్ కలిగి ఉంటే ఓవర్ టేకింగ్ చేయవచ్చు, కానీ జాగ్రత్తగా చూసుకుని చేయాలని తెలుసుకోవాలి.
దృఢమైన పసుపు గీత, బ్రేక్స్ వచ్చిన గీత కలిసి ఉంటే…
రహదారిపై దృఢమైన పసుపు రంగు గీత, బ్రేక్స్ వచ్చిన గీత రెండూ కలిసి ఉంటే దృఢమైన గీత వైపు ఓవర్ టేకింగ్ చేయకూడదని, బ్రేక్స్ వచ్చిన వైపు ఓవర్ టేకింగ్ చేయవచ్చని అర్థం చేసుకోవాలి.