ఇండోనేషియాలో విమానం కూలిపోవడానికి గల కారణాలు?

నిన్న ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాదం ప్రస్తుతం ప్రపంచమంత చర్చనీయాంశం అయ్యింది, కారణం ఆ విమానం కొత్తది కావడం.ఇండోనేసియాలో కూలిన బోయింగ్‌-737 మ్యాక్స్‌-8 శ్రేణి విమానం గత ఏడాది నుంచే వినియోగంలోకి వచ్చింది.బోయింగ్‌ చరిత్రలో అత్యధికంగా అమ్ముడవుతున్న విమానాలుగా రికార్డు సృష్టించాయి. 737 మ్యాక్స్‌ శ్రేణి విమానాలు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ సంపాదించాయి, ఏకంగా 4700 విమానాలకు ఆర్డర్లు లభించడం విశేషం. ఇలాంటి విమానానికి ప్రమాదం జరగడం కలకలం సృష్టించింది . ‘737’ను ఆధునికీకరించి మ్యాక్స్‌ శ్రేణిని బోయింగ్‌ సంస్థ రూపొందించింది. ఇందులో మ్యాక్స్‌ 7, 8, 9, 10 అనే నాలుగు మోడళ్లు ఉన్నాయి. సన్నటి బాడీ కలిగిన మ్యాక్స్‌-8 శ్రేణి విమానం స్వల్ప దూరాల్లో ప్రయాణాలకు చాలా అనువైంది. ఇంధన సమర్థత, విశ్వసనీయత, 210 వరకూ సీటింగ్‌ సామర్థ్యం, గణనీయ స్థాయిలో దూరం ప్రయాణించే సత్తా వంటి లక్షణాలు దీనిలోని సానుకూలాంశాలు.

దీని ప్రత్యేకతల దృష్ట్యా ‘నార్వేజియన్‌ ఎయిర్‌’ వంటి కొన్ని విమానయాన సంస్థలు, దూర ప్రయాణాలకూ వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇండోనేసియా విమాన ప్రమాదం నేపథ్యంలో భారత్‌లో ఉన్న బోయింగ్‌-737 మ్యాక్స్‌ శ్రేణి విమానాల భద్రత చర్చనీయాంశమైంది. అయితే మన వద్ద ఉన్న ఆ తరహా విమానాళ్ళలో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది లేదని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) పేర్కొంది. భారత్‌లో జెట్‌ ఎయిర్‌ వేస్‌, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థల వద్ద ఈ శ్రేణికి చెందిన ఆరు విమానాలు ఉన్నాయని తెలిపింది.
సాధారణంగా విమానం పాతబడిపోయాక ప్రమాదాలకు ఆస్కారం పెరుగుతుంది. అయితే వాడుకలోకి వచ్చి మూడు నెలలు కూడా గడవక ముందే, మొత్తం 800 గంటల గగనవిహారానికే ‘లయన్‌ ఎయిర్‌’కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌-8 విమానం కూలిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

నిజానికి ఈ శ్రేణి విమానం భారీ ప్రమాదానికి లోను కావడం ఇదే మొదటిసారి.సాధారణంగా విమాన ప్రమాదాలు మానవ లేదా సాంకేతిక లేదా ఈ రెండు కారణాల వల్ల జరుగుతుంటాయి. కొత్త విమానాల్లో సమస్యలు ఉంటే..కొన్నాళ్లు వినియోగించాకే అవి బయటపడతాయని వైమానిక నిపుణులు చెబుతున్నారు. వాటిని మొదటి మూడు నెలల్లోనే సరిచేస్తారని చెప్పారు. అవి చాలావరకూ బాలారిష్టాలేనని తెలిపారు. విమాన భద్రతను ప్రశ్నార్థకం చేసేలా ఉండవని పేర్కొన్నారు. కొత్త విమానం కావడంతో వాటికి సరైన నిర్వహణ ఉండదని, ఇది కూడా కొంతవరకూ ప్రమాదానికి కారణం కావొచ్చని మరో నిపుణుడు తెలిపారు.

తాజాగా ప్రమాదానికి లోనైన విమానానికి మునుపటి ప్రయాణ సమయంలో ఓ సమస్య తలెత్తిందని, దాన్ని ఆ తర్వాత సరిచేశారని ‘లయన్‌ ఎయిర్‌’ తెలిపింది. ప్రమాదానికి అది ఎంత మేర కారణమై ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మ్యాక్స్‌-8 శ్రేణి విమాన డిజైన్‌లో లోపం వల్ల తాజా ప్రమాదం జరిగిందా అనడానికి ఇప్పటివరకూ గట్టి ఆధారాలేవీ లభించలేదు. అయితే గత ఏడాది మే నెలలో తొలి వాణిజ్య విమానాన్ని విక్రయించడానికి కొద్దిరోజుల ముందు ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా విమానం విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన ‘జనరల్‌ ఎలక్ట్రిక్‌’, ఫ్రాన్స్‌కు చెందిన ‘సాఫ్రాన్‌’ల సంయుక్త భాగస్వామ్య సంస్థ అయిన ‘సీఎఫ్‌ఎం’ ఈ ఇంజిన్లను ఉత్పత్తి చేసింది.

 

ప్రమాదానికి గురైన విమాన బ్లాక్‌బాక్స్‌ను సముద్రం నుంచి సేకరించి, విశ్లేషిస్తేనే సరైన కారణాలు బయటపడతాయని అధికారులు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top