ప‌ప్పు ధాన్యాలు ఎలా వాడుక‌లోకి వ‌చ్చాయో, ఎప్ప‌టి నుంచి వాటిని వాడుతున్నారో తెలుసా..?

Azhar

కందిపప్పు, పెస‌ర ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు… ఇలా చెప్పుకుంటూ పోతే ప‌ప్పుల్లో చాలా ర‌కాలే ఉన్నాయి. అయితే ప‌ప్పు ఏదైన‌ప్ప‌టికీ దాన్ని అనేక మంది చాలా విధాలుగా వండుతారు. ఉత్త‌ర భార‌త‌దేశంలో ప‌ప్పును ఓ ర‌కంగా వండుకు తింటే ద‌క్షిణ భార‌తంలో దాన్ని మ‌రోలా వండుతారు. ప‌ప్పును కూర‌గా చేస్తారు, మాంసంతో వండుతారు, అన్నంలో వేసి వండుతారు.. ఎలా వండినా దాని టేస్టే వేరు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఈ ప‌ప్పు జాతులు ఎలా వాడుక‌లోకి వ‌చ్చాయో..? ఏ కాలం నుంచి వీటిని జ‌నాలు వాడుతున్నారో..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

సింధు నాగ‌రిక‌త ఉన్న‌ప్ప‌టి నుంచి ఈ ప‌ప్పులు వాడుక‌లో ఉన్నట్టు పురావ‌స్తు ప‌రిశోధ‌కులు గుర్తించారు. హ‌ర్యానాలోని గ‌గ్గార్ వ్యాలీలో ఒక‌ప్ప‌టి హ‌ర‌ప్పా, మొహంజోదారో నాగ‌రిక‌త ఉన్న‌ప్పుడు వాడిన ప‌లు ప‌ప్పు ధాన్యాల‌ను కొన్ని సీసాల్లో గుర్తించారు. అంటే ఆ కాలం నుంచి ప‌ప్పుల‌ను ప్ర‌జ‌లు వాడిన‌ట్టు తెలుస్తుంది. ఇక పప్పుల వాడ‌కంపై చ‌రిత్ర‌లో కొన్ని పుస్త‌కాలు ఏం చెబుతున్నాయంటే… క్రీస్తు పూర్వం 303వ సంవ‌త్స‌రంలో చంద్ర గుప్త మౌర్యుని కాలంలోనూ ప‌ప్పును వాడిన‌ట్టు ఆధారాలు ఉన్నాయట‌. ముఖ్యంగా శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే ఘుగ్ని అనే ఓ వంట‌ను వారు ఎక్కువ‌గా తినేవార‌ట‌. అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి రాక‌తో ఇదే వంట‌కాన్ని వీధుల్లో చిరుతిండిగా అమ్మ‌డం మొద‌లు పెట్టారు. త‌రువాత కాలంలో ఇదే పానీ పూరీ చాట్ అయింది.

కొంత మంది రాజులు అయితే శ‌న‌గ పప్పుతో చేసే వంట‌ల‌ను ఎక్కువ‌గా తినేవార‌ట‌. అలాగే పెస‌ర‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, కంది ప‌ప్పు, మైసూర్ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పుల‌ను క‌లిపి పాంచ్‌మెల్ దాల్ అని ఒక పప్పు వంట‌కాన్ని అప్ప‌ట్లో రాజులు చేసుకుని తినేవార‌ట‌. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి అక్బ‌ర్ త‌న భార్య జోధాతో ప్ర‌త్యేకంగా ప‌ప్పు వంట‌కాల‌ను చేయించుకునే తినే వార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఇక ముందు చెప్పిన పాంచ్‌మెల్ దాల్‌ను మ‌హాభార‌త కాలంలో భీముడు వ‌ల‌లుడిగా విరాట రాజు కొలువులో ఉన్న‌ప్పుడు కూడా వండాడ‌ట‌. అలాగే షాజ‌హాన్ చ‌క్ర‌వ‌ర్తి పెస‌ర‌ప‌ప్పుతో మొర‌దాబాదీ దాల్ అనే ప‌ప్పు వంట‌కాన్ని చేయించేవాడ‌ట‌. ఇక కుంద‌న్ లాల్ గుజ్రాల్ అనే వ్య‌క్తి దాల్ మ‌ఖ్ఖ‌ని అనే వంట‌కాన్ని అప్ప‌ట్లో త‌యారు చేశాడు. దీంతో అది కాస్తా పాపుల‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే ప‌ప్పును విభిన్న ర‌కాలుగా వండ‌డం కూడా చాలా కాలం కింద‌టే మొద‌లు పెట్టారు. ఇవీ.. ప‌ప్పులు వాడకంలోకి ఎలా వ‌చ్చాయో, ఎప్ప‌టి నుంచి జ‌నాలు వాటిని వాడుతున్నారో తెలియ‌జేసే అంశాలు. ఏది ఏమైనా నిజంగా ప‌ప్పు వంట‌కాల టేస్టే టేస్ట్ క‌దా..!

Comments

comments