ఆ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీకి 2 ల‌క్ష‌ల సార్లు చార్జింగ్ పెట్టి వాడుకోవ‌చ్చ‌ట‌..!

సాధార‌ణంగా మీరు ఒక స్మార్ట్‌ఫోన్‌ను ఎన్ని రోజులు వాడ‌తారు? కొత్త కొత్త ఫీచ‌ర్లతో నూత‌న స్మార్ట్‌ఫోన్లు వ‌స్తున్న నేప‌థ్యంలో అధిక శాతం మంది కొత్త మొబైల్‌ను కొన్న కొద్ది రోజుల‌కో, నెల‌ల‌కో మ‌రో నూత‌న మొబైల్‌ను కొంటున్నారు. అది బాగాలేక‌పోతే, న‌చ్చ‌క‌పోతే మ‌రొక‌టి. ఇలా వినియోగ‌దారులు స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నా దాంట్లో ప్ర‌ధానంగా ఓ ఫీచ‌ర్ మాత్రం క‌చ్చితంగా ఉండాల్సిందే. అదే బ్యాట‌రీ బ్యాక‌ప్‌.

అవును, బ్యాట‌రీ ప‌వ‌ర్ ఎంత ఎక్కువ‌గా ఉంటే స్మార్ట‌ఫోన్ చార్జింగ్ అంత ఎక్కువ‌గా వ‌స్తుంది. ఈ విష‌యం అందరికీ తెలిసిందే. కాకపోతే ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాట‌రీకి చార్జింగ్ పెడితేనే డివైస్‌ను వాడుకోగ‌లం. ఈ క్ర‌మంలో చార్జింగ్ పెట్టీ పెట్టీ ఒకానొక సంద‌ర్భంలో ఆ బ్యాట‌రీ కాస్తా ప‌నిచేయ‌దు. దీంతో డివైస్ రీస్టార్ట్ అవుతుండ‌డం, చార్జింగ్ వెంట వెంట‌నే దిగిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో కొత్త బ్యాట‌రీ కొనుగోలు చేయాల్సి వ‌స్తుంది. అయితే కొంత మంది మాత్రం ఆ సంద‌ర్భంలో మ‌రో కొత్త డివైస్‌ను కొనుగోలు చేస్తారు, అది వేరే విష‌యం. కాక‌పోతే కొత్త బ్యాటరీని కొనుగోలు చేసే వారు మాత్రం అలా ఎప్పటికీ బ్యాట‌రీల‌ను మార్చుకోవాల్సిందే. ఎందుకంటే డివైస్‌తో వ‌చ్చిన బ్యాట‌రీ ప‌నిచేసినంత‌గా త‌రువాత కొనుగోలు చేసిన బ్యాట‌రీ ప‌నిచేయ‌దు. అయితే ఇలాంటి వినియోగ‌దారుల బాధ‌లు ఇక‌పై తీర‌నున్నాయి. ఎందుకంటే త్వ‌ర‌లో మార్కెట్‌లోకి కొత్త త‌ర‌హా బ్యాట‌రీలు రానున్నాయి. వీటిని జీవిత కాలం చార్జింగ్ పెడుతూ వాడినా అవి ఎప్ప‌టికీ అలాగే ఉంటాయ‌ట‌. అస‌లవి ఇక డ్యామేజ్ అవ‌వ‌ట‌. దీంతో కొత్త ఆయా డివైస్‌ల‌కు బ్యాట‌రీల‌ను మార్చాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ!

nanowire-batteries

యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్‌కు చెందిన ప‌రిశోధ‌క బృందం గోల్డ్‌, కొన్ని ప్ర‌త్యేక ప‌దార్థాల‌తో ‘నానో వైర్ బ్యాట‌రీల‌’ను త‌యారుచేసింది. వాటిని 3 నెల‌ల్లో దాదాపు 2 ల‌క్ష‌ల సార్లు చార్జింగ్ పెట్టార‌ట‌. అయినా అవి మొద‌ట ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయ‌ట‌. వాటి ప‌వ‌ర్‌లో ఏ మాత్రం తేడా రాలేద‌ట‌. ఇప్పుడున్న సాధార‌ణ బ్యాట‌రీలకు 5 నుంచి 7వేల సార్ల వ‌ర‌కు చార్జింగ్ పెడితే వాటి ప‌వ‌ర్ త‌గ్గుతుంద‌ట‌. కానీ వారు త‌యారు చేసిన బ్యాట‌రీ మాత్రం అలా కాద‌ట‌. ఎన్ని ల‌క్ష‌ల సార్లు చార్జింగ్ పెట్టినా అవి చక్క‌గానే ప‌నిచేస్తాయ‌ట‌.

నిజంగా ఈ బ్యాట‌రీలు అందుబాటులోకి వ‌స్తే చాలా బాగుంటుంది క‌దూ! అప్పుడు కొత్త బ్యాట‌రీల‌ను కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే ఈ నానోవైర్ బ్యాట‌రీలు ఇప్పుడు ప్ర‌యోగాత్మ‌క ద‌శ‌లో ఉన్నాయి. అతి త్వ‌ర‌లో ఇవి వాణిజ్య ప‌రంగా అందుబాటులోకి రానున్నాయి.

Comments

comments

Share this post

scroll to top