మనలో 68% శాతం మంది తాగేది కల్తీ పాలే.! యూరియా,డిటర్జెంట్ ,పెయింట్ల లతో తయారీ.

నిత్యం మీరు పాలు ఎక్కువగా తాగుతున్నారా? లేదా దాని సంబంధ పదార్థాలైన పెరుగు, మజ్జిగ, నెయ్యిలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త ఎందుకంటే మీరు తాగే పాలు కచ్చితంగా కల్తీవే అయి ఉంటాయి. అయితే ఈ మాట చెబుతోంది మేం కాదు. సాక్షాత్తూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్ధనే. ఇటీవల జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఆయన పాల గురించిన కొన్ని కఠోర సత్యాలను సభాముఖంగా వెల్లడించారు.
ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు కృత్రిమంగా తయారు చేసిన పాలను తాగుతున్నారని, ఈ కృత్రిమ పాలను డిటర్జెంట్, యూరియా, పెయింట్ వంటి వాటిని కలిపి తయారు చేస్తున్నారని తెలిపారు. భారత ఆహార నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న పాల పరిమాణంలో 68 శాతానికి పైగా పాలు సరైన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండడం లేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి హర్ష వర్దన్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు నిర్వహించిన ఓ సర్వేను కూడా సభ ముందుంచారు. ఈ సర్వేలో ఏముందంటే పాలను ప్యాకింగ్ చేయడానికి ముందు ప్యాకెట్లను క్లీన్ చేసే సమయంలో వాడే డిటర్జెంట్‌లు పూర్తిగా పోకపోవడం వల్ల ప్యాకింగ్ జరిగిన అనంతరం కూడా ఆ డిటర్జెంట్లు పాలలో అలాగే ఉంటున్నాయట. దీనికి తోడు కొంత మంది డెయిరీ ఫాంల యజమానులు పాలు చిక్కగా ఉండేందుకు, ఎక్కువ కాలం వచ్చేందుకు వాటిలో యూరియా, స్టార్చ్, గ్లూకోజ్ వంటివి కూడా కలుపుతున్నారట.
Milk-Packet-750x500
2011లో దేశంలోని 28 రాష్ర్టాలకు చెందిన పలు ప్రాంతాలతోపాటు 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సరఫరా అయ్యే 1791 పాల శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు సేకరించారు. కాగా ఈ శాంపిల్స్‌లో దాదాపు 70 శాతం శాంపిల్స్ అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిసింది. మళ్లీ వీటిలోనూ 46 శాతం శాంపిల్స్‌లో నీటి శాతం అధికంగా ఉన్నట్టు తెలిసింది. పైన తెలిపిన శాంపిల్స్‌లో 8 శాతం వాటిలో డిటర్జెంట్స్ ఉన్నాయని తెలిసింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలుపుతున్న ప్రకారం డిటర్జెంట్లు కలిసిన పాలు తాగితే అది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. దీంతోపాటు గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సమస్యలు కూడా వస్తాయట. అంతేకాకుండా కొంత మందిలో ఈ పాలు గుండె సంబంధ వ్యాధులను, క్యాన్సర్‌లను, ఒక్కో సారి మరణాన్ని కూడా కలిగిస్తాయట. అయితే ఇలాంటి పాలు వాడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
దేశవ్యాప్తంగా ఏటా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో వారి అవసరాలను తీర్చేందుకు పాలను ఎక్కువగా సరఫరా చేయాల్సి వస్తోందని, ఈ క్రమంలోనే వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా పాలను కృత్రిమంగా తయారు చేసి అమ్ముతున్నారని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. దీన్ని అరికట్టేందుకు ఓ నూతన తరహా స్కానర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని, ఈ పరికరం కేవలం 40 సెకండ్లలోనే పాల నాణ్యతను పసిగట్టి చెప్పేస్తుందని అన్నారు. దీన్ని రాజస్థాన్ పిలానీ టౌన్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో జీపీఎస్ ఆధారంగా పనిచేసే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేనున్నామని, దీని ద్వారా పాలను కృత్రిమంగా తయారుచేస్తున్న ప్రదేశాల గురించి కచ్చితంగా తెలుసుకునే వీలు కలుగుతుందని అన్నారు. అయితే ఈ స్కానర్లు ముందుగా ఎంపీలకు అందుబాటులోకి వస్తాయని, వారు ఈ పరికరాలను తమ ఎంపీ నిధుల ద్వారా కొనుగోలు చేయవచ్చని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా ఈ స్కానర్ల వల్ల ఒకసారి పాల టెస్టింగ్‌కు అయ్యే ఖర్చు కేవలం 10 పైసలు మాత్రమే కావడం గమనార్హం. మరి ప్రజలు కల్తీ పాలను గుర్తించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన అధునాతన పరికరాల మాటేమిటో మంత్రిగారు సెలవివ్వలేదు. అంటే అవి కేవలం వారి ఆరోగ్యం కోసమేనన్నమాట. ప్రజల ఆరోగ్యం గురించి వారికి పట్టింపులేదన్నమాట. అంతేలే! కలికాలం..!

Comments

comments

Share this post

scroll to top