వాన్నా క్రై (Wanna Cry) ర్యాన్స‌మ్ వేర్ వైర‌స్ అంటే ఏమిటో, దాన్నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలుసా..?

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వ‌ల్ల ప్ర‌పంచం ఏవిధంగా ముందుకు దూసుకెళ్తుందో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల అనేక దేశాల్లో ఆయా రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల జీవ‌న విధానం చాలా సుల‌భ‌త‌ర‌మైంది. అయితే ఎంత మంచి జ‌రిగినా దాని వెనుక చెడు పొంచి ఉంటుందన్న చందంగా ఓ వైపు టెక్నాల‌జీ దూసుకెళ్తున్నా దానికి హ్యాక‌ర్లు, వైర‌స్‌ల బెడ‌ద త‌ప్పేలా లేదు. ఈ మ‌ధ్య కాలంలో వీరి ఆగ‌డాలు మ‌రీ ఎక్కువ‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. యూజ‌ర్ల కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్ల‌లోకి చొర‌బ‌డి విలువైన డేటాను త‌స్క‌రించ‌డ‌మే కాదు, బ్యాంకింగ్ వివ‌రాల‌ను చోరీ చేసి కోట్లాది రూపాయ‌ల‌ను కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతోంది.

దాని పేరు వాన్నా క్రై (Wanna Cry). Ransom:Win32.WannaCrypt రూపంలో ఇది ఉంటుంది. ఇది వైర‌స్‌ల‌లో ఓ ర‌కానికి చెందిన‌ది. దీన్నే ర్యాన్‌స‌మ్ వేర్ అంటారు. ర్యాన్‌స‌మ్ వేర్ ఏదైన‌ప్పటికీ అది చేసే ప‌ని ఒక్క‌టే. యూజ‌ర్ల కంప్యూట‌ర్లలోకి చొర‌బ‌డి వాటిని లాక్ చేస్తుంది. ఆ త‌రువాత కొంత డ‌బ్బు చెల్లిస్తే గానీ కంప్యూట‌ర్ అన్‌లాక్ కాదు, అని మెసేజ్ చూపుతుంది. దీంతో ఆ వైర‌స్ బారిన ప‌డ్డవారు చేసేది లేక స‌ద‌రు హ్యాక‌ర్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి కంప్యూట‌ర్‌ను అన్ లాక్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా హ్యాక‌ర్లు ప్ర‌వేశ‌పెట్టిన వాన్నా క్రై ర్యాన్‌స‌మ్ వేర్ కూడా 100కు పైగా దేశాల్లో ఉన్న కొన్ని కోట్ల కంప్యూట‌ర్ల‌లోకి చొర‌బ‌డింది. దీంతో అవ‌న్నీ లాక్ అయ్యాయి. దీని కార‌ణంగా ఇప్పుడు అనేక కంపెనీల‌కు కొన్ని ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింది. బ్రిట‌న్ వంటి దేశాల్లోనైతే కొన్ని హాస్పిట‌ల్స్ కూడా మూత ప‌డ్డాయి. అందుకు కార‌ణం ఈ ర్యాన్స‌మ్ వేరే. ప్ర‌స్తుతం ప‌లు ప్ర‌ముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ‌లు ఆ వైర‌స్ భ‌ర‌తం ప‌ట్టే ప‌నిలో ఉన్నాయి.

భార‌త్‌పైనా కూడా వాన్నా క్రై ప్ర‌భావం ప‌డింది. ఏపీలోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో ఉన్న కంప్యూట‌ర్లు ఈ ర్యాన్స‌మ్ వేర్ బారిన ప‌డ్డాయి. దీంతో ఆ కంప్యూట‌ర్ల‌ను ఐటీ నిపుణులు ప్ర‌స్తుతం ప‌రిశీలిస్తున్నారు. కాగా ఎవ‌రైనా ఈ ర్యాన్స‌మ్ వేర్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే అందుకు ఏం చేయాలో, అస‌లు ఈ వైర‌స్ ఎలా వ్యాపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఈ-మెయిల్స్‌కు వ‌చ్చే లింక్‌ల‌లో ప‌ల అటాచ్‌మెంట్లు ఉంటాయి. అవి జిప్‌, రార్‌, ఎక్సెల్‌, వ‌ర్డ్ ఎక్స్ టెన్ష‌న్ల‌తో ఉంటాయి. వాటిని ఓపెన్ చేస్తే ఈ ర్యాన్స‌మ్ వేర్ పీసీలోకి ప్ర‌వేశిస్తుంది.

2. ఇంట‌ర్నెట్‌లో ఓపెన్ చేసే అశ్లీల వెబ్ సైట్‌ల వ‌ల్ల కూడా ఈ వైర‌స్ సోకుతుంది.

3. ఒరిజిన‌ల్ వెబ్‌సైట్స్ కాకుండా ఇత‌ర వెబ్‌సైట్ల‌లో డౌన్‌లోడ్ చేసుకునే పైరేటెడ్ సాఫ్ట్‌వేర్లు, సినిమాలు, ఫొటోలు, పాట‌లు, వీడియోలు వంటి వాటిలో కూడా ఈ వైర‌స్ ఉంటుంది. వాటిని డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తే చాలు, వెంట‌నే ఈ వైర‌స్ పీసీలోకి ఎక్కేస్తుంది.

4. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను రూటింగ్ చేసి వాడినా అవి ఈ ర్యాన్స‌మ్ వేర్ బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇలా త‌ప్పించుకోవ‌చ్చు..!

1. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పంపే ఈ-మెయిల్స్ అస్స‌లు ఓపెన్ చేయ‌వ‌ద్దు. వాటిలో పైన చెప్పిన‌టువంటి వైర‌స్‌లు ఉండేందుకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక అలాంటి మెయిల్స్ వ‌స్తే వెంట‌నే వాటిని డిలీట్ చేయాలి త‌ప్ప ఓపెన్ చేయ‌కూడ‌దు.

2. అశ్లీల్ వెబ్‌సైట్‌లు, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్లు, సినిమాలు, ఫొటోలు, వీడియోలు, పాట‌ల‌ను పైరేటెడ్‌గా ఉంచే సైట్ల‌ను ఓపెన్ చేయ‌రాదు.

3. మాక్ లేదా విండోస్ ఏ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను వాడినా ఒరిజిన‌ల్‌ను వాడాలి. పైరేటెడ్ వెర్ష‌న్ వాడ‌కూడ‌దు. ఒరిజిన‌ల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వాడే వారు ఆ ఓఎస్‌కు గాను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల‌య్యే సెక్యూరిటీ ప్యాచ్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

4. యూజ‌ర్లు త‌మ‌కు ముఖ్య‌మ‌ని భావించిన స‌మాచారాన్నంతా ఎప్ప‌టిక‌ప్పుడు పీసీ నుంచి బ్యాక‌ప్ తీసుకోవాలి. ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డిస్క్‌, సీడీ, డీవీడీ వంటి వాటిలో డేటాను కాపీ చేసి పెట్టుకుంటే ర్యాన్స‌మ్ వేర్ బారిన ప‌డ్డా ఏమీ కాదు. పీసీని మ‌ళ్లీ ఫార్మాట్ చేసుకునేందుకు వీలుంటుంది. అప్పుడు అలా డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌సరం రాదు.

5. కాస్ప‌ర్ స్కై, ఏవీజీ, అవాస్ట్‌, నార్ట‌న్ వంటి సంస్థ‌లు యాంటీ వైర‌స్‌ల‌ను అందిస్తున్నాయి. వాటిని పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే వైర‌స్‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top