తమిళంలో మెర్సల్గా, తెలుగులో అదిరింది పేరిట హీరో విజయ్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అటు తమిళ్లోనే కాదు, తెలుగులోనూ కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన 2 రోజుల వరకు పెద్దగా ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. కానీ అందులో ఉన్న ఓ సీన్ కారణంగా, ప్రస్తుతం ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీంతోనే ఈ సినిమాను ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. మరి.. మెర్సల్ సినిమాలో ఉన్న ఆ సీన్ ఏమిటో తెలుసా..? అదేనండీ… ఈ ఏడాది జూలై 1 నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా జీఎస్టీ బిల్లును అమలులోకి తెచ్చింది కదా. దానిపై సెటైరికల్‌గా హీరో విజయ్ ఈ సినిమాలో ఓ సీన్లో పంచ్ వేశారు. ప్రస్తుతం ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావాలంటే దాన్ని మీరు కింద చూడవచ్చు.
watch video here:
Scene that North Korean President Kim Jong-Un wants to delete from the Movie "Mersal". (2017) pic.twitter.com/suBoE1s0ea
— History of India (@RealHistoryPic) October 21, 2017
చూశారు కదా. విజయ్ ఏమంటున్నారో… మెడిసిన్‌పై 12 శాతం జీఎస్టీ ఉంది కానీ, ఆల్కహాల్‌పై ఎందుకు లేదని అన్నారు. అలాగే సింగపూర్‌లో కేవలం 7 శాతం జీఎస్టీ ఉంటే ఇక్కడ 28 శాతం వరకు జీఎస్టీ వసూలు చేస్తున్నారు, ఎందుకు..? అన్నారు. అంతేకాకుండా దేశంలో ఉచితంగా వైద్య సేవలు ఎందుకు అందించడం లేదు..? అని ప్రశ్నించారు. దీంతోపాటు మొన్నామధ్య ఆక్సిజన్ సిలిండర్లు లేక గోరఖ్‌పూర్ ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయిన చిన్నారుల ఘటనను, ఎలుక కరిచి మరణించిన పసికందు ఘటనను, పేషెంట్లు డయాలిసిస్ చేయించుకుంటున్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు పోయిన ఘటనను కూడా ప్రస్తావించారు. అందుకనే నేటి తరుణంలో చాలా మంది పేదలు, సామాన్యులు ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని, ఆ భయాన్నే ప్రైవేటు హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయని ఆరోపించారు.
మొత్తానికి ఇదీ సీన్.. అయితే ఇది తమ ప్రభుత్వాన్ని కించ పరిచే విధంగా ఉందంటూ పలువురు బీజేపీ నాయకులు ఆరోపించారు. వెంటనే ఆ సీన్‌ను తొలగించాలని అన్నారు. కాగా బీజేపీ వ్యాఖ్యలపై చాలా మంది విరుచుకు పడ్డారు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే తప్పేమిటని అన్నారు. దేశంలో పేదలకు వైద్యం సరిగ్గా అందడం లేదనే విషయాన్ని చాలా క్లారిటీగా విజయ్ ఆ సినిమాలో చెప్పారని, వీలుంటే సదుపాయాలను మెరుగు పరచాలని పలువురు నెటిజన్లు ధ్వజమెత్తారు. ఇక వీరికి కొందరు సెలబ్రిటీలు కూడా మద్దతు పలికారు. తమిళ నటులు కమల హాసన్, శరత్ కుమార్‌లు కూడా ఆ సీన్ పట్ల కామెంట్లు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ అయిందని, ఒక వేళ ఆ సీన్ పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉండి ఉంటే సర్టిఫికెట్ ఇచ్చే సమయంలోనే సెన్సార్ వారు దాన్ని కట్ చేసేవారని, వారికి అభ్యంతరం లేదు కనుకనే ఆ సీన్‌ను తొలగించలేదని, మరలాంటప్పుడు ఆ సీన్‌ను ఎందుకు తీసేయాలని, దాన్ని తీసేయాల్సిన అవసరం లేదని వారన్నారు. ఇక సినిమా ఎడిటర్ రూబెన్ కూడా ట్విట్టర్ ద్వారా తన కామెంట్లను తెలిపాడు. ఆ సినిమాకు తాను ఎడిటర్‌ను అని, అందులోని సీన్లను కత్తిరించాల్సింది తాను కానీ, ప్రభుత్వం కాదని విమర్శించారు. ఈ క్రమంలో ఆ సీన్ ఏమో గానీ ఇప్పుడీ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. దీంతో మరిన్ని కలెక్షన్లు వస్తాయనే విషయం మాత్రం నిజం. ఇక చివరికి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాలి..!