ఆ గ్రామంలో బయటి వారు ఎవరిని తాకరాదు..! ఎందుకో తెలుసా..? ఇల్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో చాలా వింత సంప్రదాయాలు, ఆచారాలను పాటించే గ్రామస్తులు ఉన్నారు. వారి సంస్కృతి, వ్యవహారాలు కూడా నాగరికులకు భిన్నంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే… నాగరిక ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పురాతన ఆచారాలను పాటించే వారున్నారు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఇలాంటి ఓ గ్రామం గురించే. అది ఎక్కడో లేదు. మన దేశంలోనే ఉంది. మన దేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న మలానా అనే ఓ పురాతన గ్రామం గురించే ఇప్పుడు మేం చెబుతున్నాం. ఈ గ్రామానికి చెందిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మలానా గ్రామం మన దేశంలోనే గంజాయికి పేరుగాంచింది. ఇక్కడ స్థానికులు యథేచ్ఛగా గంజాయి పండిస్తారు. అయితే దాన్ని వారు పీల్చుకుని మత్తులో జోగరు. తమకు చెందిన ఓ సంప్రదాయాన్ని పాటించడం కోసం అలా చేస్తారు. ఇక బయటి ఎవరైనా వచ్చి ఈ గంజాయిని, ఇక్కడి వస్తువులను కొనవచ్చు. కాకపోతే బయటి వారు ఈ గ్రామ వాసులను ముట్టుకోవడానికి వీలు లేదు. అది ఈ గ్రామస్తుల ఆచారం. ఈ గ్రామంలో బయటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే డబ్బులు బల్లపై పెడతారు. అనంతరం వస్తువును తీసుకుంటారు. అంతేకానీ షాపుల వారు చేతితో తాకుతూ వస్తువులను ఇవ్వరు, డబ్బులను తీసుకోరు. ఇక బయటి వ్యక్తులు ఈ గ్రామానికి చెందిన ఆడవారిని తాకడం కాదు కదా, చాలా దూరంగా ఉండి మాట్లాడాలి. అలా చేయకపోతే బయటి వారిని కఠినంగా శిక్షిస్తారు. ఇది కూడా వారి ఆచారమే.

మలానా గ్రామంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే పలు ప్రాంతాల్లోని రాళ్లను మాత్రం బయటి వ్యక్తులు తాకరాదు. అలా అని చెప్పి కేవలం రాళ్లు మాత్రమే కాదు, అసలు ఏ వస్తువును కూడా తాకరాదు. అలాంటి నియమం ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో మలానా క్రీమ్‌ అని ఓ స్పెషల్‌ క్రీం తయారు చేస్తారు. అందులో గంజాయి ఉంటుంది. దాని వాసనకు స్థానికులు ఫిదా అవుతారు. ఇక ఈ క్రీం ప్రపంచంలోనే చాలా ఖరీదైంది. ఇక ఈ గ్రామ వాసులు తాము అలెగ్జాండర్‌కు వారసులమని, ఆయన వంశానికి చెందిన వారమని చెబుతారు.

మలానా గ్రామ వాసులు కొలిచే దేవత పేరు జంబ్లు దేవి. ఇక ఈ గ్రామ పెద్దలుగా 11 మంది ఉంటారు. వారు పంచాయతీ పెద్దలుగా తీర్పులు చెబుతారు. న్యాయం చేయమని ఎవరైనా వస్తే రెండు వర్గాలకు చెందిన వారికి చెరో గొర్రెను ఇస్తారు. గొర్రె కాలును చీల్చి విషం పెడతారు. ఒక ఎవరి గొర్రె ముందుగా చనిపోతుందో వారు నేరం చేసినట్టు లెక్క అని నమ్ముతారు. ఇక ఈ గ్రామంలో బయటి వ్యక్తులు ఎవరైనా ఫొటోలు తీయవచ్చు. కానీ వీడియోలు తీయడం నిషేధం. ఈ గ్రామ వాసులు ఒక ప్రత్యేకమైన భాష మాట్లాడుతారు. దాన్ని వారే మాట్లాడాలి. బయటి వారు ఆ భాషను మాట్లాడేందుకు వీలు లేదు.

మలానా గ్రామ వాసుల ఇండ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వీరు మొత్తం 3 అంతస్తుల్లో ఇండ్లను నిర్మించుకుంటారు. కింది ఫ్లోర్ ను ఖుదాంగ్‌ అని పిలుస్తారు. ఇందులో పశువులు, కలప, వాటి మేత ఉంటుంది. ఇక మొదటి ఫ్లోర్‌ను గాయింగ్‌ అని అంటారు. ఇందులో ఉన్ని, వారు తినే ఆహారాలను నిల్వ చేసుకుంటారు. పైన ఉన్న ఫ్లోర్‌లో వారు నివాసం ఉంటారు. దీన్ని పతి అని పిలుస్తారు. ఈ గ్రామంలో ఎవరైనా ఏదైనా నేరంలో ఇరుక్కుంటే గ్రామ పెద్దలే పంచాయతీ పెట్టి తీర్పునిస్తారు. అయితే అలాంటి వారు పోలీసులను సహాయం కోరవచ్చు. కానీ అందుకు గాను వారు రూ.1వేయిని పంచాయతీకి చెల్లించాల్సి ఉంటుంది.

మలానా గ్రామ వాసులు మలానా ఫగ్లి అని ఓ ఫెస్టివల్‌ జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఈ పండుగ జరుగుతుంది. ఇందులో ఆ గ్రామ వాసులందరూ కలిసి పాల్గొంటారు. సంబురాలు చేసుకుంటారు. గంజాయి ఆకులు ధరిస్తారు. నృత్యాలు చేస్తారు. ఆవు పేడను ఇండ్ల వద్ద చల్లుతారు. దీంతో చలి నుంచి రక్షణ లభిస్తుంది. పలు అనారోగ్య సమస్యలు నయం అవుతాయని కూడా నమ్ముతారు. ఒకప్పుడు అక్బర్‌ చక్రవర్తి ఈ గ్రామ దేవత అయిన జంబ్లు దేవిని పూజించాడట. దీంతో ఆయన అనారోగ్యం పోయిందట. ఈ క్రమంలో అక్బర్‌ ఈ గ్రామ వాసుల నుంచి పన్నును వసూలు చేయలేదట. అందుకే దాన్ని పురస్కరించుకుని ఈ గ్రామ వాసులు ఫగ్లి పండుగను జరుపుకుంటారట. ఇవీ.. మలానా గ్రామ విశేషాలు. ఇంకా మనకు తెలియని ఎన్నో విశేషాలను ఈ గ్రామం కలిగి ఉంది. ఏది ఏమైనా ఈ గ్రామ వాసుల ఆచారాలు, పద్ధతులు భలే విచిత్రంగా ఉన్నాయి కదా..!

Comments

comments

Share this post

scroll to top