“హార్పిక్” యాడ్ కు కౌంటర్ గా “పతంజలి” యాడ్.! చుస్తే నవ్వుకుంటారు..కానీ చివరికి చిక్కుల్లో పతంజలి!

వ్యాపారం అన్నాక ఆయా కంపెనీలు తమ తమ ఉత్పత్తులను అమ్మడం కోసం వాటికి పబ్లిసిటీ చేసుకోవడం సాధారణమైన విషయమే. ఈ క్రమంలోనే ఏ కంపెనీ అయినా తాను అమ్మే ఉత్పత్తులకు గాను యాడ్స్‌ ఇస్తుంటుంది. అవి పేపర్‌లో కావచ్చు, టీవీలో కావచ్చు. యాడ్స్‌ ద్వారా ఆయా ఉత్పత్తులు ప్రజలకు తెలుస్తాయి. దీంతో వారు వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ప్రత్యర్థి కంపెనీలకు చెందిన యాడ్స్‌ను అనుకరిస్తూ వాటికి వ్యతిరేకంగా యాడ్స్‌ తీస్తాయి. ఈ క్రమంలోనే ఆ యాడ్స్‌ వివాదాలకు కారణమవుతుంటాయి. పతంజలి కంపెనీ చేసిన ఓ యాడ్‌ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఆ కంపెనీ ప్రసారం చేస్తున్న ఓ యాడ్‌ వివాదాస్పదమవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

హార్పిక్‌ కంపెనీ తయారు చేసే టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌ గురించి మీకు తెలుసు కదా. టీవీల్లో ఆ యాడ్‌ బాగా ప్రసారమవుతుంది కూడా. మనం సరిగ్గా భోజనం చేసేటప్పుడు టాయిలెట్‌ క్లీనింగ్‌ యాడ్స్‌ వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. సరే ఈ విషయం అటుంచితే.. సదరు హార్పిక్‌ కంపెనీ యాడ్‌ను అనుకరిస్తూ పతంజలి తాను కొత్తగా తయారు చేసిన గ్రీన్‌ ఫ్లష్‌ అనే టాయిలెట్‌ క్లీనర్ యాడ్‌ను ఇప్పుడు టీవీల్లో ప్రసారం చేస్తోంది. ఆ యాడ్‌లో టాయిలెట్‌ క్లీన్‌ చేస్తానంటూ వచ్చిన వ్యక్తిని ఓ మహిళ బయటకు వెళ్లగొడుతుంది. అనంతరం పతంజలి కంపెనీకి చెందిన గ్రీన్‌ ఫ్లష్‌ యాడ్‌ ప్రసారమవుతుంది. దీన్ని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.. అది హార్పిక్‌ కంపెనీకి వ్యతిరేకంగా తీసిన యాడ్‌ అని అందరికీ తెలుస్తుంది. మరి అలా తెలిశాక మనం ఊరుకుంటాం కానీ.. ఆ కంపెనీ ఊరుకుంటుందా.. లేదు కదా.. అందుకే ఇప్పుడు హార్పిక్‌ కంపెనీ సదరు పతంజలి యాడ్‌పై కోర్టుకెక్కింది.


తమ కంపెనీకి చెందిన టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌ను అనుకరించడమే కాక, దానికి వ్యతిరేకంగా తమను కించ పరిచేలా పతంజలి తన గ్రీన్‌ ఫ్లష్‌ టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌ను తీసిందని ఆరోపిస్తూ హార్పిక్‌ కంపెనీ తాజాగా ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు, విచారణ పూర్తయ్యే వరకు సదరు యాడ్‌ను నిషేధించాలని కూడా హార్పిక్‌ కోరింది. అయితే యాడ్‌ను నిషేధించలేమని కోర్టు చెప్పింది. కానీ ఆ యాడ్‌పై పతంజలి కంపెనీని వివరణ కోరింది. మరో 10 రోజుల్లో పతంజలి తాను తీసిన ఆ యాడ్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి పతంజలి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలిక..! అయినా ఇలాంటి వివాదాలు ఆయా కంపెనీలకు మామూలే కదా..!

Comments

comments

Share this post

scroll to top