రక రకాల రంగుల్లో ఉండే నెయిల్ పాలిష్‌లను చాలా మంది మహిళలు వేసుకుంటారు. దీంతో చేతులు, కాలి గోర్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే ఇంత వరకు ఓకే. కానీ మీకు తెలుసా..? నిజానికి నెయిల్ పాలిష్‌లు అస్సలు మంచివి కావట. అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయట. వాటిని గోర్లకు వేసుకున్నప్పుడు వాటిల్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు చర్మం ద్వారా లోపలికి వెళ్లి రక్తంలో కలుస్తాయట. దీంతో అవి చాలా సేపటి వరకు రక్తంలో అలాగే ఉండిపోతాయి. వాటిని శరీరం కూడా బయటకు పంపలేదట. దీంతో అవి అనారోగ్యాలను కలగజేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు నెయిల్ పాలిష్లలో ఏయే కెమికల్స్ ఉంటాయో, వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయిల్ పాలిష్లలో ట్రైఫినైల్ఫాస్ఫేట్ అనే ఓ కెమికల్ ఉంటుంది. ఇది శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. తద్వారా జీవక్రియలకు ఆటంకం కలుగుతుంది. శరీరం తన పనులు సక్రమంగా నిర్వర్తించలేదు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ కెమికల్ శరీరంలో చేరితే పలు న్యూరో టాక్సిన్లను విడుదల చేస్తుంది. వాటి వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. చర్మ సమస్యలు వస్తాయి. ఇదే కాకుండా నెయిల్ పాలిష్లలో టోలిన్ అనబడే మరో కెమికల్ కూడా ఉంటుంది. ఇది చర్మంపై దురదలను కలగజేస్తుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది.
ఫార్మాల్డిహైడ్ అనబడే మరో కెమికల్ కూడా నెయిల్ పాలిష్లలో ఉంటుంది. ఇందులో కార్సినోజెన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. క్యాన్సర్ వ్యాధిని తెచ్చి పెడతాయి. అది ఏ రకమైన క్యాన్సర్ అయినా కావచ్చు. ఒకసారి వచ్చిందంటే ఇక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి నెయిల్ పాలిష్ లేకపోతే ఎలా..? అని అనుకునే వారు ఆర్గానిక్, నాచురల్ వాటర్ కలర్స్‌తో తయారు చేసిన నెయిల్ పాలిష్ లను వాడవచ్చు. వీటి వల్ల ఎలాంటి కెమికల్స్ శరీరంలో చేరవు. దీంతో అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది..!