బేసిక్ ఫోన్ తోనూ బ్యాంక్ లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు… అదెలాగో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్… కంప్యూట‌ర్‌… వాటిలో ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉంటే చాలు, దాంతో ఎవ‌రైనా నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి లావాదేవీల‌ను ఆన్‌లైన్‌లో సుల‌భంగా నిర్వ‌హించుకోవ‌చ్చు. అయితే ఆయా స‌దుపాయాలు లేని వారు… కేవ‌లం బేసిక్ ఫోన్లు మాత్ర‌మే ఉన్నవారు… ఆన్‌లైన్ ప‌రిజ్ఞానం లేని వారు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ‌లు వినియోగించుకోలేరు. క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. మ‌రి అలాంటి వారు కూడా సుల‌భంగా డిజిట‌ల్ లావాదేవీలు నిర్వ‌హించాలంటే ఎలా…? అందుకు ప‌రిష్కార‌మే ఎన్‌యూయూపీ (నేషనల్ యునిఫైడ్ యూఎస్‌ఎస్‌డీ ప్లాట్‌ఫాం). దీంతో కేవ‌లం బేసిక్ ఫోన్ ఉన్నా చాలు…బ్యాలెన్స్ వివరాలు, మినీ స్టేట్‌మెంట్, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, పిన్ చేంజ్ వంటి బ్యాంక్ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. అందుకు ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదు. కేవ‌లం ఫోన్ వినియోగం తెలిస్తే చాలు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

nuup-system

ఎన్‌యూయూపీ అనేది యూఎస్‌ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) అనే మొబైల్ ప్లాట్‌ఫాం ఆధారంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. కేవలం బేసిక్‌ ఫోన్ ఉన్నా చాలు. దాంట్లో ఫోన్ డయలర్ ప్యాడ్‌లో పలు కోడ్‌లను డయల్ చేయడం ద్వారా ఈ ఎన్‌యూయూపీ సేవను వినియోగించుకోవచ్చు. అయితే ఈ సేవకు డయల్ చేయాల్సిన యూఎస్‌ఎస్‌డీ నంబర్ ఏంటంటే… *99# ఫోన్ వాడకం దారులు తమ ఫోన్ డయల్ ప్యాడ్‌లో ఈ నంబర్‌ను డయల్ చేస్తే వెంటనే వెల్‌కమ్ టు ఎన్‌యూయూపీ పేరిట ఓ మెసేజ్ వస్తుంది. అనంతరం పలు ఆప్షన్లతో కూడిన మెనూ ఫోన్ స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. అయితే *99# అనే కోడ్‌తో వచ్చే ఆప్షన్లన్నీ ఇంగ్లిష్ భాషలోనే ఉంటాయి. ప్రాంతీయ భాషలతో ఈ సేవను వాడుకోవాలంటే అందుకు వేరే నంబర్లను డయల్ చేయాల్సి ఉంటుంది. హిందీకైతే *99*22# తెలుగుకైతే *99*24# కోడ్‌ను డయల్ చేయాలి. అనంతరం వచ్చే ఆప్షన్స్ ఆ భాషల్లోనే కనిపిస్తాయి.

పైన చెప్పిన విధంగా కోడ్‌ను డయల్ చేయగానే వచ్చే మెనూలో యూజర్లు తమ బ్యాంక్‌కు చెందిన షార్ట్ నేమ్‌లోని మొదటి 3 అక్షరాలను లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లోని మొదటి 4 అక్షరాలను లేదా బ్యాంక్ బ్రాంచ్ కోడ్‌లోని మొదటి రెండు అక్షరాలను ఎంటర్ చేసి సెండ్ బటన్ నొక్కాలి. బ్యాంక్ షార్ట్ నేమ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు SBH, ఆంధ్రాబ్యాంక్‌కు ANB, యాక్సిస్ బ్యాంక్‌కు AXB, బ్యాంక్ ఆఫ్ బరోడాకు BOB, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు BOI, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు HDF, ICI, KMB … ఇలా ఆయా బ్యాంక్‌లకు నిర్దిష్టమైన షార్ట్ నేమ్స్ ఉంటాయి. వాటిలో మీ బ్యాంక్ షార్ట్ నేమ్‌ను ఎంటర్ చేయాలి. ఈ షార్ట్‌నేమ్స్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్, బ్రాంచ్ కోడ్‌లు తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌ను కూడా ఒకసారి సందర్శిస్తే సరిపోతుంది. లేదంటే బ్యాంకుకు వెళితే అక్కడి వారైనా చెబుతారు. ఈ క్రమంలో ముందు చెప్పినట్టుగా వివరాలను ఎంటర్ చేశాక మీ అకౌంట్ నంబర్‌లోని చివరి 4 అంకెలను ఎంటర్ చేయమని ఆప్షన్ వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి ముందుకు వెళితే అప్పుడు అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, ఎంఎంఐడీ, చేంజ్ పిన్ వంటి ఆప్షన్స్ దర్శనమిస్తాయి. వాటి ద్వారా యూజర్లు తమ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

nuup-india-1

అయితే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలంటే ఎంఎంఐడీని ఉపయోగించాలి. ఇది ఒక్కో బ్యాంక్ అకౌంట్‌కు ఒక్కో రకంగా ఉంటుంది. అవతలి వ్యక్తులకు చెందిన ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఎంఎంఐడీని తీసుకుంటే దానికి యూజర్లు తమ అకౌంట్‌లో ఉన్న డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కాగా ఈ ఎన్‌యూయూపీ సేవను ఉపయోగించుకోవాలనుకుంటే ఎవరికైనా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ అయి ఉండాలి. అది లేకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా యాక్టివేట్ అయ్యాక ఎన్‌యూయూపీ సేవను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేకున్నా కేవలం ఫీచర్ ఫోన్, అందులో యాక్టివ్ మొబైల్ కనెక్షన్ ఉంటే చాలు. ఎన్‌యూయూపీ సేవను దేశ వ్యాప్తంగా ఎవరైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఆన్‌లైన్ లావాదేవీల పట్ల అంతగా అవగాహన లేని వారికి ప్రత్యామ్నాయంగా ఈ సేవ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎన్‌యూయూపీ సేవకు ఒక లావాదేవీకి ఒకప్పుడు రూ.1.50 ఛార్జి పడేది. కానీ ఇప్పుడు అలా కాదు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఛార్జిని తగ్గించింది. కేవలం 50 పైసలకే ఎన్‌యూయూపీ సేవను వినియోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో గరిష్టంగా రూ.5వేల వరకు ఒకేసారి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంతకు మించితే రెండోసారి ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top