బాల్య వివాహాన్ని కాద‌ని…ఇంట‌ర్ టాప‌ర్లు గా నిలిచారు.!

బాల్య వివాహం… మ‌న దేశంలో ఎప్ప‌టి నుంచో ఉన్న దురాచారం. కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి అనేక మంది బాలిక‌లు ఈ దురాచారం బారిన ప‌డి త‌మ అంద‌మైన నూరేళ్ల జీవితాన్ని కోల్పోయారు. ఓ వైపు అధునాత‌న సాంకేతిక‌త దిశ‌గా ప్ర‌పంచమంతా ప‌రుగులు పెడుతుంటే మ‌రోవైపు మ‌న దేశంలో మాత్రం ఇంకా ఇలాంటి దురాచారాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోనూ ఇలాంటివి రెండు సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అయితే స‌ద‌రు బాలిక‌లు తెలివిగా వ్య‌వ‌హరించ‌డంతో వారు ఓ ఎన్‌జీవో స‌హాయంతో ర‌క్షింప‌బ‌డ్డారు. ఇప్పుడు వారే తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచారు.

వారి పేర్లు కె.సంధ్య‌, వి.సంధ్య‌. కేవ‌లం పేర్లు మాత్ర‌మే ఒక‌టి కాదు, వారిద్దరూ చ‌దువుల్లోనూ ఒకే రకంగా ప్ర‌తిభ చూపేవారు. హైద‌రాబాద్ లోని హ‌య‌త్ న‌గ‌ర్ తుర్క‌యాంజ‌ల్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో వీరిద్ద‌రూ గ‌తేడాది 10వ త‌ర‌గ‌తి చ‌దివారు. అయితే ఫైన‌ల్ ఎగ్జామ్స్ ద‌గ్గ‌ర ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో వి.సంధ్య త‌ల్లిదండ్రులు ఆమెను చివ‌రి ప‌రీక్ష రాయ‌నీయ‌లేదు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో జ‌రిగిన విష‌యాన్ని ఆమె స్నేహితురాలు కె.సంధ్య తెలుసుకుని బాల‌ల హ‌క్కుల సంఘం అనే ఓ ఎన్‌జీవోకు తెలియ‌జేసింది. దీంతో వారు వ‌చ్చి వి.సంధ్య‌ను ర‌క్షించారు. ఆ త‌రువాత మ‌రికొద్ది రోజులకు కె.సంధ్య త‌ల్లిదండ్రులు కూడా ఆమెకు ఎంగేజ్‌మెంట్ చేశారు. దీంతో ఈ విష‌యాన్ని వి.సంధ్య అదే ఎన్‌జీవోకు చెప్పింది. ఈ క్ర‌మంలో కె.సంధ్యకు కూడా పెళ్లి కాకుండా వారు ర‌క్షించారు.

అలా ఇద్ద‌రూ ఆ ఎన్‌జీవో వ‌ల్ల బాల్య వివాహం అనే ఉచ్చులో ప‌డ‌కుండా ర‌క్షింప‌బ‌డ్డారు. ఆ త‌రువాత వారిని అదే ఎన్‌జీవో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో చేర్పించింది. దీంతో ఇప్పుడు వారిద్ద‌రూ తాజాగా జ‌రిగిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో టాపర్లుగా నిలిచారు. 93 శాతం మార్కుల‌తో కె.సంధ్య మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 92 శాతం మార్కుల‌తో వి.సంధ్య రెండో స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడీ విష‌యం నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. ప‌లు జాతీయ మీడియా చానల్స్‌, వార్తా పత్రిక‌లు కూడా ఇదే విష‌యాన్ని త‌మ మాధ్య‌మాల్లో తెలియ‌జేశాయి. అవును మ‌రి, అలా వారు ర‌క్షింప‌బ‌డ్డారు కాబ‌ట్టే, చ‌దువుల్లో ప్ర‌తిభ చూపారు. ఇంకా ఎంద‌రు ఇలాంటి బాలిక‌లు మ‌న దేశంలో ఉన్నారో, వారిని ఎవ‌రు ర‌క్షిస్తారో ఆ దేవుడికే తెలియాలి..!

Comments

comments

Share this post

scroll to top