మ‌హారాష్ట్ర‌లో తీవ్ర స్థాయికి చేరిన నీటి స‌మ‌స్య‌… నీటి కోసం వెళ్లి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు బాల‌లు…

నీరు… ఇప్పుడు ఈ పేరు చెబితేనే జ‌నాలు హ‌డ‌లిపోతున్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌తి ఏటా వేస‌విలో ఎదుర్కొంటూ వ‌స్తున్న స‌మ‌స్యే అయినా ఈ సారి మాత్రం నీటి కోసం జ‌నాలు ఎన్న‌డూ లేని విధంగా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తోంది. ప్ర‌భుత్వాలు మారినా, నాయ‌కులు, అధికారులు వ‌చ్చి వెళ్లినా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న నీటి స‌మ‌స్య మాత్రం ఎప్ప‌టికీ తీర‌డం లేదు. అస‌లు నీటికి కొర‌త ఏర్ప‌డ‌డంలో మాన‌వుడు చేసిన, చేస్తున్న త‌ప్పిదాలు ఎన్నో ఉంటున్నా, వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక దిశ‌గా నీటి సంర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. దీని ఫ‌లితంగా ఏటా నీటికి క‌ట‌క‌ట‌గానే ఉంటోంది. కానీ ఈ వేస‌విలో మాత్రం ప్ర‌జ‌లు నీటి కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు.

నీటి కొర‌త‌కు మారుపేరుగా చెప్పుకునే మ‌హారాష్ట్ర కూడా ఈ స‌మ‌స్య‌కు అతీత‌మేమీ కాదు. అక్క‌డ ఉన్న భూగ‌ర్భ జ‌లాల‌తో సహా 11 ప్ర‌ధాన డ్యామ్‌లు ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ అవి అక్క‌డి జ‌నాల‌కు ఏ మాత్రం చాల‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన రెండు సంఘ‌ట‌నలు నీటి సంర‌క్షణ ప‌ట్ల మ‌న బాధ్య‌త‌లను గుర్తు చేస్తున్నాయి.

water-problem

మ‌హారాష్ట్ర‌లో నీటికి తీవ్ర కొర‌త ఉన్న ప్ర‌దేశాల్లో బీడ్ జిల్లా కూడా ఒక‌టి. అక్క‌డ ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు నీరు ఎక్క‌డ దొరికితే అక్క‌డ ఎంత దూర‌మైన ఆలోచించ‌కుండా వెళ్లి మ‌రీ నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఉన్న వీదా అనే గ్రామంలో స‌చిన్ గోపీనాథ్ కేదార్ అనే ఓ 11 ఏళ్ల బాలుడు దాదాపు 60 అడుగుల లోతు ఉన్న ఓ బావి ద‌గ్గ‌రికి వెళ్లి అందులోంచి నీరు తోడుతూ ప్ర‌మాద‌వ‌శాత్తూ ఆ బావిలో ప‌డి మృతి చెందాడు. యోగితా దేశాయ్ అనే మ‌రో 12 ఏళ్ల బాలిక స‌బ‌ల్‌ఖేడ్ అనే గ్రామంలో ఉన్న చేతి పంపు నుంచి నీటిని తోడుతూ డీహైడ్రేష‌న్‌కు గురై ఎండ దెబ్బ బారిన ప‌డింది. అనంత‌రం కొద్ది సేప‌టికే ఆ బాలిక మృతి చెందింది. అప్పుడ‌క్క‌డ ఉష్ణోగ్ర‌త 44 డిగ్రీస్ సెల్సియ‌స్‌గా ఉన్నట్టు తెలిసింది.

నీటి స‌మ‌స్య ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ రెండు సంఘ‌ట‌నలే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లు. ఇక‌నైనా క‌ళ్లు తెరిచి నీటి సంర‌క్ష‌ణ కోసం క‌ఠినమైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే భ‌విష్య‌త్తులో అలాంటి అభం శుభం తెలియ‌ని పిల్ల‌లు మ‌రెంద‌రో అన్యాయంగా మృత్యువాత ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పైన చెప్పిన రెండు సంఘ‌ట‌న‌ల ద్వారానైనా మ‌నం గుణ‌పాఠం తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Comments

comments

Share this post

scroll to top