నిజ‌మైన ప్రేమ ఇంటే ఇదే..! చ‌దివితే ఆ బాధేంటో తెలుస్తుంది..!

అది 2006వ సంవ‌త్స‌రం. అప్పుడు నాకు 25 ఏళ్లు. ముంబైకి షిఫ్ట్ అయ్యాను. అక్క‌డే ఓ ఎంఎన్‌సీలో జాబ్ వ‌చ్చింది. విచిత్ర‌మో ఏమో గానీ ఓ వ్య‌క్తిని అప్పుడే చూశాను. ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా అత‌ను నాకు ప‌రిచ‌యం అయ్యాడు. అత‌నితో ల‌వ్‌లో ప‌డ‌తాన‌ని నేను అస‌లు అనుకోలేదు. కార‌ణం ఏంటో తెలీదు. అత‌ను నాకు న‌చ్చాడు. అది ప్రేమే. ఎందుకంటే అత‌నితో మాట్లాడాల‌ని, అత‌ని సాన్నిహిత్యంలో ఉండాల‌ని నాక‌నిపించింది. అయితే నేను ఎప్పుడూ బ‌య‌ట ప‌డ‌లేదు. అత‌న్ని ప్రేమిస్తూ ముందుకు సాగాను.

నిజానికి అత‌నో డెంటిస్ట్‌. వేరే రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరిగింది. ఆ ప‌రిచ‌యంలోనే అత‌ని ఇష్టాలు, అభిరుచులు తెలిశాయి. ఆశ్చ‌ర్యంగా అత‌ని ఇష్టాలు ఏవీ నా అభిరుచుల‌కు మ్యాచ్ కాలేదు. అయినా ఎందుకో అత‌నంటే ఇష్టం ఏర్ప‌డింది. అవును, ప్రేమంటే అంతే. అందుకు ఇష్టాలు క‌ల‌వాల్సిన ప‌నిలేదు. కేవ‌లం మ‌న‌స్సులు క‌లిస్తే చాలు. అలా అత‌నితో నా స్నేహ ప్ర‌యాణం 3 ఏళ్లు సాగింది. అత‌ను న‌న్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలియ‌దు. కానీ అత‌ను న‌న్ను ప్రేమిస్తున్నాడ‌నే భావ‌న‌లోనే ఉన్నాను. ఇక ఎలాగైనా అత‌నికి నా మ‌న‌స్సులోని మాట‌లు చెప్పాల‌ని అనుకున్నా. ఆ రోజు రానే వ‌చ్చింది.

అది 2009వ సంవ‌త్స‌రం మార్చి నెల‌. హోలీ పండుగ జ‌రుగుతోంది. ఆ రోజు సాయంత్రం ఎలాగైనా అత‌నికి నా ప్రేమ‌ను చెప్పాల‌నుకున్నా. కానీ అంత‌లోనే ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. అది నాకు ప‌రిచ‌యం లేని ఫోన్ నంబ‌ర్‌. ఎవ‌రు కాల్ చేశార‌బ్బా అనుకుంటూనే లిఫ్ట్ చేశా. అవ‌త‌లి వ్య‌క్తి మాట్లాడుతున్నాడు. నేను వింటూ ఉన్నా. నా ఫోన్‌కు వ‌చ్చిన లాస్ట్‌ కాల్ చేసిన వ్య‌క్తికి యాక్సిడెంట్ అయింద‌ట‌. ఎవ‌రో వాహ‌నంతో ఢీకొట్టి పారిపోయార‌ట‌. అందుకే అత‌ని ఫోన్‌లో ఉన్న డ‌య‌ల్డ్ నంబ‌ర్స్ లిస్ట్‌లో చివ‌రిగా కాల్ చేసిన నంబ‌ర్‌ను ఆ వ్య‌క్తి తీసుకుని నాకు ఫోన్ చేశాడు. ఒక్క‌సారిగా నాకు మాట‌లు రాలేదు. గుండె ఆగినంత ప‌నైంది. నాకు వ‌చ్చిన లాస్ట్ కాల్ ఎవ‌రిదో కాదు. నేను నా ప్రేమ‌ను ఎవ‌రికైనా తెల‌పాల‌నుకుని ఆరాట ప‌డ్డానో ఆ వ్య‌క్తిదే. అంటే… నేను 3 ఏళ్లుగా ప్రేమిస్తున్న అత‌ను… అవును, అత‌నే. అత‌నికి యాక్సిడెంట్ అయింది. ఒక్క‌సారిగా మాట‌లు రాలేదు. ఏం చేయాలో తెలీలేదు. వెంట‌నే హాస్పిట‌ల్ వివ‌రాల‌ను అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్లా.

ఇన్ని రోజులు నేను ప్రేమ‌గా ఆరాధించిన వ్య‌క్తి హాస్పిట‌ల్ బెడ్‌పై అలా అచేత‌నంగా పడి ఉండడం చూసి నోట మాట రాలేదు. యాక్సిడెంట్ బాగా అయిందేమో ఓ వైపు అంతా దాదాపుగా నుజ్జు నుజ్జు అయింది. అయినా అత‌ను ప్రాణంతోనే ఉన్నాడు. అప్ప‌టికే అత‌ని త‌ల్లిదండ్రులు వ‌చ్చారు. త‌ప్పంతా నాదే అన్న‌ట్టు నన్ను నిందించారు. అంటే… నా విషయం అత‌ను ఇంట్లో చెప్పాడా..? చెప్పే ఉంటాడు. అందుకే అత‌ని తల్లిదండ్రులు న‌న్ను నిందిస్తున్నారు. అంటే… అత‌ను కూడా న‌న్ను..? అవును, ప్రేమించాడు. కానీ నాలాగే చెప్ప‌లేదు.

అలా కొద్ది గంట‌లు గ‌డిచింది. అత‌ను కోమాలోకి వెళ్లిపోయాడు. మ‌రుస‌టి రోజు కాన‌రాని లోకాల‌కు త‌ర‌లి వెళ్లాడు. గుండె పొర‌ల్లోంచి దుఃఖం హోరున పొంగుకు వ‌చ్చింది. నిజ‌మైన ప్రేమ ఏంటో అప్పుడు తెలిసింది. అత‌ను లేని లోటును భ‌ర్తీ చేయ‌డం ఎలా..? అత‌ను లేని జీవితాన్ని ఊహించుకోగ‌ల‌నా..? నాకే ఎందుకు ఇలా జ‌రిగింది..? దేవుడు ఎందుకు ఇలా చేశాడు..?

అత‌ను చ‌నిపోయి ఇప్ప‌టికి 8 ఏళ్లు అయింది. అయినా ఇంకా ఎందుకు అత‌నే గుర్తుకు వ‌స్తున్నాడు..? నేనెందుకు అత‌న్ని ఇంకా మ‌రిచిపోలేక‌పోతున్నాను..? ఇంకా ఎంత కాలం ఈ వేద‌న‌..? అవును, అంత‌గా ప్రేమించా క‌నుక‌నే ఈ ఆవేద‌న‌. అత‌నూ న‌న్ను ప్రేమించాడు క‌నుక‌నే ఈ బాధ‌. అత‌ని ప్రేమ నాకు తెలిసింది, నా ప్రేమ అత‌నికి తెలియ‌లేదు. నేనెంత దుర‌దృష్ట‌వంతురాలినో క‌దా..! అయినా నేను అత‌న్ని ప్రేమిస్తూనే ఉంటా… జీవితాంతం..!

— యాక్సిడెంట్‌లో త‌న ప్రేమికున్ని కోల్పోయిన ఓ యువ‌తి రియ‌ల్ స్టోరీ ఇది..!

Comments

comments

Share this post

scroll to top