అనుకోకుండా కలిసిన ఓ అమ్మాయి, అబ్బాయి…మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టమే ప్రేమగా మారింది. అయితే ఆ యువకుడిది పేద కుటుంబం. దీంతో సహజంగానే ఆ యువతి తల్లిదండ్రులు అతన్ని అంగీకరించలేకపోయారు.కానీ కొన్ని రోజుల తరువాత ఆ యువకుడి గురించి పూర్తిగా తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు తమ కూతురికి అతనే కరెక్ట్ అని భావించి తమ కూతుర్ని అతనికే ఇచ్చి పెళ్లి చేద్దాంమని ఫిక్స్ అయ్యారు. అంతలోనే ఓ సమస్య వచ్చి పడింది.
ఆ యువకుడు అప్పటికే సైన్యంలో పనిచేస్తుండడంతో ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి ఓ రోజు ఉత్తరం వచ్చింది. యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతోంది, వెంటనే వచ్చి సైన్యంతో కలవమని ఆ ఉత్తరం సారాంశం. దేశభక్తి ఉన్న ఆ యువకుడు తన పెళ్లిని వాయిదా వేయాలని చెప్పి యుద్ధంలో పాల్గొనాలని బయల్దేరాడు. అలా వెళ్లే సమయంలో తన ప్రేయసి అయిన ఆ యువతికి సెండ్ ఆఫ్ ఇస్తూ మోకరిల్లి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. దీనికి ఆ యువతి ఆనంద భాష్పాలు రాల్చి తప్పకుండా చేసుకుంటానని బదులిచ్చింది. అదే ఉత్సాహంతో ఆ యువకుడు యుద్ధం కోసం ముందుకు కదిలాడు. కానీ ఈ సారి విధి మరో పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది.
ఆ యువకుడు వెళ్లిన కొద్ది రోజులకే ఆ యువతి పెద్ద యాక్సిడెంట్‌కు గురైంది. ఆ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. మెదడుకు గట్టిగా దెబ్బ తగలడంతో అందులో కొంత భాగం దెబ్బతింది. దీంతో ఆ భాగానికి అనుసంధానమైన అవయవాల్లో ఒకటైన ముఖం చూసేందుకు వికారంగా తయారైంది. దీనికి తోడు దేహం నిండా గాయాలే. ఎలాగో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన ఆ యువతి తన పట్ల విధి చేసిన మోసానికి తీవ్రంగా నిరాశ చెందింది. తనను ఇక ఆ యువకుడు పెళ్లి చేసుకోడని భావించింది.
అలా ఏడాది గడిచిపోయింది. ఆ సమయంలో ఆ యువకుడు ఆ యువతికి ఎన్నో ఉత్తరాలు రాశాడు. ఎన్నో సార్లు ఫోన్ చేశాడు. కానీ ఎలాంటి స్పందనా లేదు. ఎందుకంటే ఆ యువతి ఒక్కటే ఆలోచించింది. తనలా వికారంగా మారిన యువతిని ఎవరు పెళ్లి చేసుకుంటారనే ఒకే కారణంతో ఆ యువతి తన ప్రేమికుడిని దూరం పెట్టింది.
చివరకు ఓ రోజు ఆ యువకుడు సైన్యం నుంచి రానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ యువకుడు ఆ యువతి ఇంటికే నేరుగా వచ్చాడు. కానీ ఆమె తన ప్రియున్ని చూడడం ఇష్టం లేక వెంటనే వెళ్లిపోమ్మని చెబుతుంది. అయితే ఆ యువకుడు తనకు పెళ్లి జరుగుతుందని చెప్పి ఓ శుభలేఖను ఆ యువతి తల్లికి ఇచ్చి ఆమెకు అందజేయమని చెబుతాడు. తల్లి ఆ శుభలేఖను తీసుకు రాగానే ఆ యువతి దాన్ని చూసి ఎంతో విచారిస్తుంది. అంతా తాను అనుకున్నట్టే జరిగిందని, ఆ యువకుడికి తనంటే ఇష్టం లేదని ఇంకా తీవ్రంగా బాధ పడుతుంది. అయినా తేరుకుని ఎలాగో ఆ శుభలేఖను తెరచి చూస్తుంది. అందులో ఉన్న పేర్లను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.
శుభలేఖలో ఆ యువకుడి పేరు పక్కన పెళ్లి కూతురిగా తన పేరును చూసుకుని ఆమె ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంది. కానీ మనసులో ఏదో చిన్న సందేహం. తనను ఇప్పటి వరకు ఆ యువకుడు చూడలేదు కదా. ఇప్పుడు ఈ రూపాన్ని చూస్తే ఏమనుకుంటాడోనని చిన్న ఆందోళన. ఆ ఆందోళనకు, ఆమె ఆలోచనలకు అడ్డం పడుతూ ఆ యువకుడు ఆమె ఉన్న గదిలోకి అప్పుడే ప్రవేశిస్తాడు. తాను ఒకప్పుడు సైన్యంలోకి వెళ్లే ముందు ఎలా అయితే మోకరిల్లి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఆమెను అడిగాడో అచ్చం అలాగే ఇప్పుడు కూడా ఆమెను అడుగుతాడు. మరింత ఆశ్చర్యం, ఓ వైపు బాధ, ఆందోళన కలగలిపిన చూపుతో ఆమె అతన్ని ఆలింగనం చేసుకుంటుంది. అప్పుడు ఆ యువకుడు అంటాడు, ‘నువ్వప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, నీకు తెలియకుండా మీ అమ్మ నీ ఫొటోలను ఎప్పటికప్పుడు పంపుతూనే ఉంది. మొదట నీకు జరిగిన యాక్సిడెంట్‌ను గురించి విని ఒకింత ఆందోళనకు లోనయ్యా. అయినా నువ్వు నాకోసమే బతికున్నావని నిశ్చయించుకుని నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నా. నన్ను కూడా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇకపై కూడా ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వెలా ఉన్నా నీపై ఉన్న నా ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను కాబట్టి, ఐ లవ్ యూ!
- కథను పంపిన వారు: SHYAM CENA. ( shyamcena95@gmail.com)
- మీరు మీ కథలను రాసి పంపండి.
- మా Email : ap2tgtelugu@gmail.com
adi magadi prema boss anduke bagundi…adadaniki adi ela unna vadileyalanukovadame thelusu