హైదరాబాద్‌లో బిర్యానీ కాకుండా మరికొన్ని వంటకాలు కూడా ఫేమస్సేనట..! వాటి గురించి తెలుసుకోండి..!

నోరూరించే బిర్యానీ అంటే మనకు ముందుకు గుర్తుకు వచ్చే ప్రదేశం ఏది? అదే మన భాగ్యనగరం హైదరాబాద్. అవును, మన హైదరాబాదీ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో మన నగరానికి వచ్చే వారు కూడా ఒక్కసారి ఇక్కడి బిర్యానీ రుచి చూసి మాత్రం పోరు. అంతగా అది పాపులర్ అయ్యింది. అయితే మన దగ్గర కేవలం బిర్యానీ మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఫేమస్సేనట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాదీ చికెన్ 65
చికెన్ 65కి పేరు ఎలా వచ్చినా 1965 నుంచి హైదరాబాద్‌లో చికెన్ 65ను తయారు చేస్తున్నారట. ఇక్కడ లభించే వివిధ రకాల మసాలా రుచులను జోడించి ఘాటుగా, వేడిగా తయారు చేసే చికెన్ 65 అంటే అధిక శాతం మంది ఇష్టమట. చికెన్ 65ను ఇతర ఏ ప్రాంతంలో తిన్నా హైదరాబాద్‌లో లభించినంత రుచిగా మాత్రం ఉండదట.

biryani

ఖుబానీ కా మీఠా
డ్రై యాప్రికాట్స్‌ను ఉపయోగిస్తూ తయారు చేసే ఈ స్వీట్ డిష్ హైదరాబాద్‌లో ఫేమస్. దీన్ని వివాహ వేడుకలు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో ఎక్కువగా వడ్డిస్తారు. హైదరాబాదీ డిజర్ట్ డిష్‌గా ఈ వంటకం పేరుగాంచింది.

డబుల్ కా మీఠా
తాజా బ్రెడ్ ముక్కలు, పాలు, యాలకులు, కుంకుమ పువ్వు, కోవా వంటివి ఉపయోగిస్తూ తయారు చేసే డబుల్ కా మీఠా కూడా మన దగ్గర ఫేమస్సే. మొఘ్‌లాయ్ వంటకంగా ఇది గుర్తింపు పొందినా మన హైదరాబాద్‌లో మాత్రం అధిక శాతం మంది దీన్ని ఇష్టంగా తింటారు.

paaya

మిర్చి బజ్జీ
చల్ల చల్లని వాతావరణం, వర్షం పడుతూ ఉన్న సమయాల్లో రోడ్డు పక్కన కనిపించే బండి వద్ద మిర్చీ బజ్జీ తింటుంటే ఎలా ఉంటుంది? ఆ మజాయే వేరు కదూ! అవును. మిర్చి బజ్జీ కూడా మన దగ్గర అందుకే పాపులర్ అయింది.

హలీం
పవిత్రమైన రంజాన్ మాసంలో ఎక్కువగా లభించే హలీం అంటే అందరికీ ఇష్టమే. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు దీన్ని అమితంగా ఇష్టపడతారు. హైదరాబాద్ హలీం అయితే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా పొందింది. ఈ క్రమంలో హలీం హైదరాబాదీ ఫుడ్‌గా పేరుగాంచింది.

haleem

భగారా బైంగన్
మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి ఈ కూర హైదరాబాద్ నగరంలో ప్రాచుర్యంలో ఉంది. వంకాయలు, మసాలాలు దట్టించి తయారుచేసే ఈ కూరను దాదాపు అధిక శాతం మంది ఇష్టపడతారు. ఇది మన దగ్గర ఎప్పటి నుంచో పాపులర్ ఫుడ్‌గా ఉంది.

హైదరాబాదీ ఖట్టీ దాల్
కందిపప్పు, చింతపండు, టమాటోలు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు తదితర పదార్థాలను మెండుగా వేసి తయారు చేసే ఈ కూర అన్నా హైదరాబాద్‌లో పాపులరే. రైస్‌తో దీన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.

హైదరాబాదీ మరాగ్
మటన్, జీడిపప్పు, క్రీం వంటి పదార్థాలను వేసి ఈ సూప్‌ను తయారు చేస్తారు. హైదరాబాద్‌లో ఉండే దాదాపు ప్రతి రెస్టారెంట్‌లోనూ ఈ వంటకం లభిస్తుంది. దీన్ని ఎక్కువగా వివాహాది శుభ కార్యాల్లో అతిథులకు వడ్డిస్తారు. ఇది కూడా మన దగ్గర ఫేమస్ వంటకంగా గుర్తింపు పొందింది.

పాయా
మటన్ బోన్స్‌తో ఈ సూప్‌ను తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా రోటీ, చపాతీలతో తింటారు. హైదరాబాదీ పాయా అంటే ఇష్ట పడని వారుండరు. అంతగా ఈ వంటకం మన దగ్గర పాపులర్ అయ్యింది.

పైన పేర్కొన్నవే కాకుండా ఇంకొన్ని డిష్‌లు కూడా హైదరాబాద్ నగరంలో ఫేమస్ అయ్యాయి. కూరగాయలు, మటన్‌తో తయారు చేసే గోష్త్ పసిందే కూర, బిర్యానీ, పులావ్‌లను తినడానికి ఉపయోగించే బురానీ రైతా, సమోసా లాంటి ఫ్లేవర్‌ను కలిగిన లుఖ్మీ, మటన్ దాల్చా, జీడిపప్పు, గరమ్ మసాలా, మాంసం, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే తూతక్ వంటకం, మటన్‌తో తయారు చేసే సూప్‌లాంటి చక్నా వంటకం తదితరాలన్నీ మన నగరంలో ఫేమస్ అట. ఇంకేముంది, ఇక ముందు మీరెప్పుడైలా రెస్టారెంట్‌కు వెళితే పైన చెప్పిన ఫేమస్ వంటకాల రుచులను ఓసారి ఆస్వాదించడం మరిచిపోకండే!

Comments

comments

Share this post

scroll to top