ఆమె ప‌గ‌లు పీహెచ్‌డీ చ‌దువుతుంది. రాత్రి ప‌రాఠాలు అమ్ముతుంది. ఎందుకో తెలుసా..?

ప్రియురాలి కోసం మంచి ఉద్యోగాన్ని వదిలేశాడు ప్రియుడు. పెద్దలని కాదని పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ. కన్న వారికి దూరంగా వేరే రాష్ర్టానికి వచ్చారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అయినా ఒకరంటే ఒకరికి ప్రాణం. అంతులేని ప్రేమ ఉంది. ఆ ప్రేమే ఆ ఇద్దరినీ నడిపించింది. స్వయం ఉపాధి పొందేలా చేసింది. ఈ క్రమంలో ప్రియురాలి చదువు కోసం ప్రియుడు ఇంకా కష్టపడడం మొదలు పెట్టాడు. అతని కష్టం చూసి ఆమె కూడా అతనికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఇప్పుడు ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసుకోనుంది. అతను త్వరలో రెస్టారెంట్ పెట్టనున్నాడు. అందుకోసం వారు గత 3 ఏళ్ల నుంచి కష్టపడుతుండడం విశేషం. ఈ మధురమైన ప్రేమ కథకు కేరళలోని తిరువనంతపురం టెక్నోపార్క్ వేదికైంది.

వారి పేర్లు ప్రేమ్ శంకర్ మందల్, స్నేహా లింబ్గావోంకర్. ప్రేమ్ శంకర్‌ది జార్ఖండ్. ఢిల్లీలోని సీఏజీ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం. స్నేహ మహారాష్ట్ర వాసి. వీరిద్దరూ ముంబైలో ఒక సందర్భంలో కలిశారు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. యథావిధిగానే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. చెప్పా పెట్టకుండా ఇద్దరూ పెళ్లి చేసుకుని కేరళకు బ్రతుకు దెరువు నిమిత్తం వచ్చారు. స్నేహ కోసం ప్రేమ్ శంకర్ ఉద్యోగాన్ని కూడా మానేశాడు. పీహెచ్‌డీ చేసి జర్మనీ వెళ్లాలనేది ఆమె కల. ఈ క్రమంలోనే కేరళ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ ఫెలోషిప్ ఆమెకు లభించింది. దీంతో ఆమె కల నెరవేర్చడం కోసం ప్రేమ్ శంకర్ తిరువనంతపురంలో తాము ఉంటున్న ఐటీ హబ్‌కు సమీపంలోని టెక్నోపార్క్‌లో మొబైల్ క్యాంటీన్‌ను ఓపెన్ చేశాడు. నిత్యం అందులోనే అతను కష్టపడేవాడు.

స్నేహ రోజంతా కాలేజీలో చదువుకుని వచ్చి భర్త పడే కష్టాన్ని చూడలేక తానూ అతనికి సహాయం చేస్తున్నది. సాయంత్రం కాలేజీ నుంచి బయటకు రాగానే ఇంటికెళ్లకుండా నేరుగా మొబైల్ క్యాంటీన్ వద్దకే వెళ్లి రాత్రి వరకు అతనికి సహాయం చేయడం మొదలు పెట్టింది. వారు తమ మొబైల్ క్యాంటీన్‌లో ఆలూ పరాఠా, దోశ, ఇతర టిఫిన్స్ అమ్మేవారు. అయితే వారు చేసే ఆలూ పరాఠాకే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. చుట్టూ ఐటీ కంపెనీలు కావడంతో వాటిల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా వీరి వద్దే ఆలూ పరాఠాలను తినేవారు. అలా వారి వ్యాపారం బాగానే సాగింది. ఈ క్రమంలో 2 ఏళ్లు గడిచాయి.

2016లో వారి పెద్దలు ఎలాగో కొంత శాంతించారు. దీంతో వారి సమక్షంలో స్నేహ, ప్రేమ్‌లు ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ తమ పెద్దల నుంచి ఒక్క నయా పైసా సహాయం కూడా వారు పొందలేదు. తమ కాళ్లపై తాము నిలబడ్డారు. డబ్బును చాలా పొదుపుగా వాడుకునేవారు. ఎలాంటి విలాసాలకు పోయే వారు కాదు. కెరీర్ ముఖ్యమని భావించి పిల్లలు కూడా ఇప్పుడే వద్దని వారు అనుకున్నారు. దీంతో ఎట్టకేలకు త్వరలో స్నేహ పీహెచ్‌డీ పూర్తి చేయనుంది. ఇక ఇప్పుడు ప్రేమ్ సొంతంగా ఓ రెస్టారెంట్‌ను ఓపెన్ చేస్తానని అంటున్నాడు. వారి ల‌క్ష్యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top