ఇంజినీరింగ్ చ‌దివిన ఈ కుర్రాడు ..రైల్లే స్టేషన్లో కూలీగా లగేజ్ మోస్తూ…తన భార్యని M.Tech చదివిస్తున్నాడు.

రోజు రోజుకీ పెరిగిపోతున్న జ‌నాభా… దీని కార‌ణంగా అనేక రంగాల్లో వ్య‌క్తుల మ‌ధ్య పెరిగిన పోటీ త‌త్వం. ఇక విద్యారంగం గురించైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ రంగంలో అభ్య‌ర్థుల మ‌ధ్య ఉండే పోటీ అంతా ఇంతా కాదు. మంచి యూనివ‌ర్సిటీలో చ‌దివేందుకు సీటు విష‌యంలో పోటీ… సీటు వ‌చ్చాక మంచి ర్యాంకు కోసం పోటీ… ర్యాంకు వ‌చ్చాక ఉద్యోగం కోసం పోటీ… దీంతో ఏటా మ‌న దేశంలో కొన్ని ల‌క్షల మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది త‌మ నైపుణ్యానికి త‌గిన ప‌నికోసం అలాగే వేచి చూస్తున్నారు త‌ప్పితే ఏదో ఒక పని చేసి కాలం గ‌డుపుదాం అని మాత్రం ఆలోచించ‌డం లేదు. కానీ ఆ యువ‌కుడు మాత్రం సరిగ్గా ఇదే ఆలోచించాడు. బీటెక్ చ‌దివినా త‌న చ‌దువుకు తగ్గ జాబ్ దొర‌క‌డం లేట్ అవుతుంద‌ని భావించాడు. మరి అప్ప‌టి వ‌ర‌కు పోష‌ణ భారం ఉంటుంది క‌దా. అందుకే ఎవ‌రూ చేయ‌డానికి సాహ‌సించ‌ని ప‌ని చేయ‌డం మొద‌లు పెట్టాడు. చివ‌ర‌కు ఎలాగైతేనేం కొంత వ‌ర‌కు తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించుకోగ‌లిగాడు.

mohit

అత‌ని పేరు మోహిత్‌. వ‌య‌స్సు 25 ఏళ్లు. 2015లో పంజాబ్ ఫ‌రీద్‌కోట్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. అయితే అన్ని మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లోనూ ఎదురైన‌ట్టే మోహిత్ కుటుంబంలోనూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌య్యాయి. దీనికి తోడు మోహిత్ త‌రువాత మ‌రో న‌లుగురు చెల్లెల్లు, ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా ఉండ‌డంతో వారంద‌రి పోష‌ణ మోహిత్ తండ్రికి త‌ల‌కు మించిన భారంగా అయింది. ఈ క్రమంలో మోహిత్ కుటుంబ బాధ్య‌త‌ల‌ను నెత్తికి ఎత్తుకోక త‌ప్ప‌లేదు. అయితే నేటి త‌రుణంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వారికి జాబ్‌లు దొర‌క‌డం క‌ష్టంగా ఉండడంతో మోహిత్‌కు కూడా ఎక్క‌డా జాబ్ దొర‌క‌లేదు. ఫ్రెష‌ర్ కావ‌డంతో ఇక అత‌నికి ఉద్యోగం అనేది దొర‌క‌డం గ‌గ‌న‌మే అయిపోయింది. అయినా మోహిత్ నిరాశ చెందలేదు. త‌మకు స‌మీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో కూలీగా జీవితం ప్రారంభించాడు.

అప్ప‌ట్లో అత‌ను రోజుకు నిత్యం రూ.400 నుంచి రూ.500 దాకా స్టేష‌న్‌లో లగేజీ మోస్తూ సంపాదించేవాడు. కానీ రాను రాను పోటీ పెర‌గ‌డంతో సంపాద‌న త‌గ్గింది. ఈ క్ర‌మంలో అత‌ను ప‌నిచేస్తున్న స్టేష‌న్‌కు ఒక‌టి రెండు సార్లు ఇద్ద‌రు మంత్రులు కూడా వ‌చ్చారు. వారిని క‌ల‌సి త‌న గోడు వెళ్ల‌బోసుకున్నాడు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. అలా అత‌ని జీవితం సాగుతుండ‌గా అక్క‌డే నివేత అనే యువ‌తితో ప‌రిచ‌యం అవ‌డం, అది ప్రేమ‌గా మారి పెళ్లికి దారి తీయ‌డం, ఆమెను మోహిత్ పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగిపోయాయి. అప్ప‌టికింకా అత‌ను కూలీగానే ఉన్నాడు. కాగా నివేత ఓ కాలేజీలో ఎంటెక్ చ‌దువుతోంది. అయితే వీరిద్ద‌రి గురించి తెలుసుకున్న మ‌హ‌రాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ వారిని త‌మ కాలేజీకి పిలిపించి ఇద్ద‌రికీ వారి చ‌దువుకు తగిన‌ట్టుగా బాబా ఫ‌రీద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ అనే కాలేజీలో ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పాడు. అయితే మోహిత్‌కు ఉద్యోగం ఇచ్చారు, కానీ నివేత ఎంటెక్ చ‌దువుతుండ‌డంతో ఆమె చ‌దువు పూర్తి అవ‌గానే ఉద్యోగం ఇస్తామ‌ని మాటిచ్చారు. దీంతో ఇప్పుడు మోహిత్ నిత్యం కాలేజీకి వెళ్లి త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. క‌నీసం ఇలాగైనా త‌న ల‌క్ష్యం నెర‌వేరినందుకు ఎంత‌గానో సంతోషిస్తున్నాడు.

ఇది పంజాబ్‌కు చెందిన మోహిత్ స్టోరీ. ఇత‌నే కాదు, దేశంలో ఇంకా ఎన్నో ల‌క్ష‌ల మంది ఇలాంటి నిరుద్యోగులు స‌రైన ఉద్యోగావ‌కాశాల కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. తాము చ‌దివిన చ‌దువుకు త‌గిన జాబ్ కాదు క‌దా, అస‌లు ఉద్యోగాలే దొర‌క్క నిత్యం నిరాశ‌లో మ‌గ్గుతున్నారు. వారంద‌రికీ స‌రైన ఉపాధి క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంది. అది ప్ర‌భుత్వ రంగ‌మైనా, ప్రైవేటుదైనా స‌రే..!

Comments

comments

Share this post

scroll to top