ఏదో ఒక యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, వీలుంటే ఇతర కోర్సులు నేర్చుకోవడం, లేదంటే పీజీ చేయడం… అది కుదరకపోతే జాబ్ వెతుక్కోవడం… ఇదంతా పాత పద్ధతి… ఓ వైపు డిగ్రీ చదువుతూనే, మరో వైపు పలు వినూత్న కార్యక్రమాల్లో సత్తా చాటుతూ లక్షల రూపాయల అవార్డులు, రివార్డులు గెలుచుకోవడం ఇప్పుడు యూత్‌లో కొనసాగుతున్న నయా ట్రెండ్. ఏ యూనివర్సిటీలో చదువుతున్నామనేది ముఖ్యం కాదు, ఎంత ప్రతిభ చాటుతున్నామనేదే ముఖ్యమంటూ పలువురు యువత ముందుకు దూసుకువెళ్తున్నారు. అలా ప్రతిభ చాటుతూనే ఆ కారణంగా వచ్చే అవార్డు మనీతో ఎంచక్కా ఫారిన్ లో విద్యను కూడా పూర్తి చేసుకుంటున్నారు. తమ కలలను తామే సాకారం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకడే కేరళకు చెందిన అరుణ్ ఎస్ కుమార్.
కేరళలోని ఛాతన్నూర్కు చెందిన అరుణ్ ఎస్ కుమార్ వయస్సు 20 ఏళ్లు. కేరళలోనే ఉన్న ఎంఈఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాగా అరుణ్ ఎస్ కుమార్ ఇటీవలే ఫేస్బుక్ లో ఓ క్రిటికల్ బగ్‌ను కనుగొన్నాడు. దాని వల్ల ఏమవుతుందంటే హ్యాకర్లు ఏ ఫేస్బుక్ పేజీనైనా కేవలం పదంటే పది సెకండ్లలోనే సులభంగా హ్యాక్ చేయవచ్చు. కాగా ఆ బగ్‌ను కనుగొన్న వెంటనే అరుణ్ దాని గురించిన సమాచారాన్ని ఫేస్బుక్ అధికారులకు మెయిల్ ద్వారా తెలియజేశాడు. దీంతో ఫేస్బుక్ వారు స్పందించి వెంటనే ఆ బగ్‌ను ఫిక్స్ చేశారు.
ఇలా బగ్స్ కనుగొనేందుకే ఫేస్బుక్ 2011లోనే బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా తమ సైట్లో బగ్స్‌ను కనుగొన్న ఔత్సాహిక సాఫ్ట్వేర్ నిపుణులకు, యువ ఇంజినీర్లకు పెద్ద మొత్తంలో నగదును అందజేస్తూ వస్తోంది. కాగా అరుణ్ కూడా ఇదే తరహాలో అందులో పాల్గొన్నాడు. ఫేస్బుక్లో క్రిటికల్ బగ్‌ను గుర్తించినందుకు గాను అతను ఏకంగా 16 వేల డాలర్ల (రూ.10.70 లక్షలు)ను ఫేస్బుక్ ద్వారా రివార్డు రూపంలో అందుకున్నాడు. అయితే అరుణ్ గతంలోనూ ఇలాగే గూగుల్, ఫేస్‌బుక్‌లలో బగ్స్ గుర్తించినందుకు గాను ఇప్పటి వరకు రూ.30.85 లక్షలను బహుమతి రూపంలో అందుకోవడం విశేషం. అయితే అరుణ్ ప్రతిభను గుర్తించిన ఫేస్బుక్ అమెరికాలోని తన హెడ్‌క్వార్టర్స్‌కు అతన్ని రప్పించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 హ్యాకర్లలో ఒకడిగా చోటు కల్పించింది. భవిష్యత్తులో అతనికి ఫేస్బుక్ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు తెలిసింది. చూశారా… ప్రతిభ ఉండాలే గానీ దానికి ఇంటర్వ్యూలు, చదువుతో పనిలేదు. ఎవరైనా అలాంటి వ్యక్తులను కళ్లకు అద్దుకుని తీసుకుంటారు. వారిని ఆదరిస్తారు. ఏది ఏమైనా అరుణ్ లాంటి డైనమిక్ కుర్రాడు మన ఇండియన్ కావడం దేశానికే గర్వకారణం. ఇంతకీ అన్ని లక్షల రూపాయల ప్రైజ్ మనీని అరుణ్ ఏం చేద్దామనుకుంటున్నాడో తెలుసా..? విదేశాల్లో పీహెచ్డీ పూర్తి చేసి దేశానికి సేవ చేస్తానని అంటున్నాడు. ఇలాంటి యువకులే కదా, మన దేశానికి కావల్సింది. హ్యాట్సాఫ్ టు అరుణ్..!