ఆదర్శం అనే పేరుకు ….అద్వితీయమైన నిర్వచనం..ఈ ఆదిత్య.!

ఎవ‌రైనా వ్య‌క్తులు ఏదైనా మంచి ప‌ని చేయాల‌ని భావించి దాన్ని మొద‌లు పెడితే చుట్టూ ఉన్న‌వారు ఏమంటారో అంద‌రికీ తెలిసిందే. సుబ్బ‌రంగా ఉన్న చోట ఉండ‌క ఎందుకొచ్చిన తిప్ప‌లు, అలా ఎందుకు చేయ‌డం, అస‌లది అవ‌స‌రమా?  దాంతో ఏం వ‌స్తుంది..?  లాంటి మాట‌లు మాట్లాడుతూ మంచి పనులు చేసే వారిని చేయ‌నివ్వ‌రు. అయితే ఆ యువకుడు మాత్రం అలా కాదు. చుట్టు ప‌క్క‌ల ఉన్న వారు, తెలిసిన వారు ఎన్ని మాట‌లు మాట్లాడినా, ఎంత వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసినా తాను అనుకున్న మంచి పనిని చేసి చూపించాడు. అత‌నిలాంటి ఆద‌ర్శ‌భావాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ క‌లిగి ఉండాల‌ని చాటి చెబుతున్నాడు. అత‌డే ఆదిత్య తివారీ.

aditya-tiwari
మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప‌ట్ట‌ణానికి చెందిన ఆదిత్య తివారీకి అప్పుడు 28 ఏళ్లు. అప్ప‌టికి ఇంకా పెళ్లి కాలేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా 2014లో ఒకానొక క్ర‌మంలో అత‌ను ఇండోర్‌లోనే ఉన్న మిష‌న‌రీస్ ఆఫ్ చారిటీ అనే అనాథాశ్ర‌మానికి వెళ్లాడు. అక్క‌డ బిన్నీ అనే బాలుడ్ని చూశాడు. కొంత సేపు ఆ బాలుడితో గ‌డిపాడు. దీంతో అత‌నికి ఎంతో ఆనందం ల‌భించింది. అయితే ఎలాగైనా ఆ బాలుడ్ని ద‌త్త‌త చేసుకోవాల‌ని భావించి అందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. కానీ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవాలంటే ఏ వ్య‌క్తి వ‌య‌స్సు అయినా క‌నీసం 30 సంవ‌త్స‌రాలు ఉండాల్సిందే. కానీ ఆదిత్య తివారీ ఈ విష‌యంపై సంబంధిత శాఖ మంత్రికి స్వ‌యంగా అర్జీ పెట్టుకోవ‌డంతో అప్ప‌టి నుంచి నిబంధ‌న‌లు స‌డ‌లించారు. ఇప్పుడు ఎవ‌రైనా 25 సంవ‌త్స‌రాలు నిండితే అనాథాశ్ర‌మంలోని పిల‌ల్ని ద‌త్త‌త తీసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆదిత్య బిన్నీని ద‌త్త‌త తీసుకుని అత‌ని పేరును అవ్‌నీష్‌గా మార్చేశాడు. అయితే అవ్‌నీష్ డౌన్స్ సిండ్రోమ్ అనే విచిత్ర‌మైన జెనిటిక్ డిజార్డ‌ర్‌తో బాధ ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో ఆ బాలుడ్ని ద‌త్త‌త చేసుకుంటే అత‌ని వైద్యానిక‌య్యే ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతుంద‌ని, అంత వృథా ఖ‌ర్చు ఎందుకు, ద‌త్త‌త వేస్ట్ అని చాలా మంది ఆదిత్యకు అడ్డు చెప్పారు. అయినా వారి మాటల‌ను ఆదిత్య లెక్క పెట్ట‌లేదు. తాను ఆ బాలుడి సంర‌క్ష‌ణ  మొత్తం చూసుకుంటాన‌ని, అత‌ని వైద్యానిక‌య్యే ఖ‌ర్చు ఎంతైనా భ‌రిస్తాన‌ని తేల్చి చెప్పి అలాగే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆదిత్య పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది.

aditya-tiwari
అయితే త‌న వ‌ద్ద ఉన్న బాలుడ్ని కూడా మంచిగా చూసుకునే యువ‌తి త‌నకు భార్యగా కావాల‌నే ఉద్దేశంతో అలాంటి యువ‌తిని వెతికి మ‌రీ ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు. దీనికి అత‌ని కుటుంబ స‌భ్యుల నుంచి కూడా మొద‌ట్నుంచీ మ‌ద్ద‌తు ల‌భిస్తూ వ‌చ్చింది. కాగా ఆదిత్య త‌న వివాహ వేడుక‌ల‌కు ఎవ‌ర్ని పిలిచాడో తెలుసా..? అనాథాశ్ర‌మాల‌కు చెందిన 10వేల మందితోపాటు చుట్టు ప‌క్క‌ల జూల‌లో ఉన్న ప‌లు జంతువులు, స్థానికంగా తిరిగే కుక్క‌లు వేడుక‌కు వ‌చ్చాయి. వాటితోపాటు త‌న బంధువులు, కుటుంబ స‌భ్యుల న‌డుమ అవ్‌నీష్‌ను కూర్చోబెట్టుకుని ఆదిత్య వివాహం చేసుకున్నాడు.  విందు కూడా సాదా సీదా ప‌ద్ధతిలో రుచిక‌ర‌మైన సింపుల్ మీల్స్‌ను అందరూ తృప్తి చెందేలా పెట్టించాడు. చివ‌రిగా ఇంకో విశేష‌మేమిటంటే అవ్‌నీష్‌ను ద‌త్త‌త తీసుకోవ‌డంతో ఆదిత్య దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్కుడైన బ్ర‌హ్మ‌చారి తండ్రిగా పేరు గాంచాడు. అవును మ‌రి. ఇదంతా మ‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించినా, ఆదిత్య చేసిన ప‌నిని చూసి మెచ్చుకోని వారు లేరంటే న‌మ్మండి. నిజంగా అత‌ని జాలి హృద‌యానికి, సేవా త‌త్ప‌ర‌త‌కు మ‌నం అత‌న్ని ఎంత‌గానో అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top