ఆ యువ‌కుడు తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను గుర్తించాడు తెలుసా..?

చారిత్రాత్మ‌క ప్ర‌దేశాలు, పురాత‌న క‌ట్ట‌డాలు అంటే వాటిని చూసేందుకు సహ‌జంగానే ఎవ‌రైనా ఇష్ట ప‌డ‌తారు. ఎందుకంటే ఆయా ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అదో చెప్ప‌లేని ఫీలింగ్ క‌లుగుతుంది. ఎన్నో చారిత్ర‌క సంఘ‌ట‌న‌ల‌కు, అంశాల‌కు నెల‌వై ఉంటాయి కాబ‌ట్టి అలాంటి ప్ర‌దేశాల్లో గ‌డ‌పాలంటే ఎవ‌రికైనా ఆస‌క్తిగానే ఉంటుంది. కానీ… అలాంటి ప్ర‌దేశాల‌ను క‌నిపెట్టాలంటేనే చాలా క‌ష్టం. ముందుగా వాటి గురించి తెలియాలి. అనంత‌రం అవి ఎక్క‌డ ఉంటాయో దారి వెతుక్కుంటూ వెళ్లాలి. రోడ్డు మార్గం స‌రిగ్గా ఉంటే ఓకే. లేదంటే కాలి న‌డ‌కనే ఆ ప్ర‌దేశాల‌కు వెళ్లి వాటిని గుర్తించాల్సి ఉంటుంది. అనంత‌రం అక్క‌డి శాస‌నాల‌పై ఉండే రాత‌ల‌ను అర్థం చేసుకుని అస‌లు ఆ ప్రాంతం లేదా క‌ట్ట‌డం ఏ కాలానికి చెందినదో, దాన్ని ఎవ‌రు నిర్మించారో, ఎన్ని సంవ‌త్స‌రాల కింద క‌ట్టారో తెలుసుకోవాల్సి ఉంటుంది. నిజానికి చెప్ప‌డానికి ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ ప‌ని చేయ‌డ‌మే చాలా క‌ష్ట‌సాధ్య‌మైంది. అయినా… ఆ యువ‌కుడు ఎలాంటి విసుగు లేకుండా, అసాధ్యం అనుకోకుండా అలాంటి చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను, పురాత‌న క‌ట్ట‌డాల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డాడు. ఇంత‌కీ ఆ యువ‌కుడెవ‌రంటే…


అత‌ని పేరు అర‌వింద్ ప‌కిడె. వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. వ‌రంగ‌ల్ జిల్లాలోని కాంచ‌న‌ప‌ల్లి వాసి. అర‌వింద్ కు చిన్న‌ప్ప‌టి నుంచి పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాలు అంటే ఎంత‌గానో ఇష్టం. ఈ క్ర‌మంలోనే అర‌వింద్ ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న‌ప్ప‌టి నుంచి ఆయా ప్రాంతాల‌కు వెళ్తూ ఉండేవాడు. దీంతో వాటిపై అత‌నికి ఇంకా ఆస‌క్తి క‌లిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల గురించి తెలుసుకోవ‌డం మొద‌లు పెట్టాడు. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే అది అంత సాధ్య‌మైన ప‌ని కాదు. పైనే చెప్పాం క‌దా, అందుకు చాలా వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చాల్సి ఉంటుంది. అయినా ముందుకే వెళ్లేందుకు అర‌వింద్ సిద్ధ‌ప‌డ్డాడు. అలా అత‌ను ఎంతో క‌ష్ట ప‌డుతూ ఇప్ప‌టికి అనేక చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను, క‌ట్ట‌డాల‌ను గుర్తించాడు. ఒక్కోసారైతే ముళ్ల బాటలో న‌డుస్తూ, నీరు, ఆహారం లేకుండా రోజు మొత్తం గ‌డిపిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయినా రోజు చివ‌రికి వ‌చ్చే సరికి తాను అనుకున్న‌ది సాధించేవాడు. అప్పుడు అత‌నికి క‌లిగే ఆనందం వ‌ర్ణ‌నాతీతం.


అయితే అర‌వింద్ అలా చారిత్ర‌క క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాల‌ను గుర్తించేందుకు ఎంతో మంది ఆర్కియాల‌జిస్టుల సహాయం తీసుకునేవాడు. ఈ క్రమంలోనే అర‌వింద్ ఎవ‌రికీ తెలియ‌ని దాదాపుగా 100కు పైగా చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను, క‌ట్ట‌డాల‌ను గుర్తించాడు. వ‌రంగల్‌లో ఉన్న అత్యంత పురాత‌న కోట‌ల గురించి తెలిసిన అతి త‌క్కువ మందిలో అర‌వింద్ ఒక‌డంటే న‌మ్మ‌గ‌ల‌రా..? అయితే అర‌వింద్ అంత‌టితో ఆగ‌లేదు. తాను క‌నిపెట్టిన ప్ర‌దేశాలు, క‌ట్ట‌డాల వివ‌రాల‌ను తెలిపేందుకు ఏకంగా ఓ బ్లాగ్ పెట్టాడు. www.warangalmucchata.com వెబ్‌సైట్‌ను సంద‌ర్శిస్తే అర‌వింద్ గురించిన మ‌రింత స‌మాచారంతో పాటు అత‌ని వ‌ర్క్ గురించి తెలుసుకోవ‌చ్చు. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జిల్లా మంగ‌పేట మండ‌లం మ‌ల్లూరు కొండ‌ప్రాంతంతో అర‌వింద్ ఓ పురాత‌న గోడ‌ను కూడా క‌నుగొన్నాడు. దాని పొడ‌వు 8 కిలోమీట‌ర్లు. ఇలాంటి క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాలు ఇంకా ఎన్నింటినో అర‌వింద్ గుర్తించాడు. ఇక‌పై కూడా ఇదే కోవ‌లో ముందుకు సాగుతానంటున్నాడు అర‌వింద్‌. అయితే తాను గుర్తించిన ఆయా ప్ర‌దేశాలు, క‌ట్ట‌డాలకు చెందిన మొత్తం స‌మాచారాన్ని పుస్త‌కం రూపంలో తేనున్నాన‌ని అంటున్నాడు. అత‌ని ల‌క్ష్యం నెర‌వేరాల‌ని ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top