వీధిబాలుడికి 5 స్టార్ రెస్టారెంట్‌లో స్వ‌యంగా స్నాక్స్ తినిపించిన‌ యువ‌కుడిత‌ను..!

ఫ్యాన్సీ కార్లు, మొబైల్స్, ఎంతైనా షాపింగ్ చేసేందుకు కావ‌ల్సిన ధ‌నం, బంగ‌ళాలు, విలాస‌వంతమైన జీవితం… ఇవ‌న్నీ దేవుడు మ‌న‌కు అందించిన వ‌రాలు. అవి అంద‌రికీ ఉండ‌వు. కొంద‌రు అదృష్ట‌వంతుల‌కు మాత్ర‌మే ఉంటాయి. అలా అని చెప్పి అవి ఉన్న‌వారంద‌రూ అదృష్ట‌వంతులు అన‌లేం. వాటిని ఇత‌రులతో షేర్ చేసుకున్న‌ప్పుడే, వారు అస‌లైన అదృష్ట‌వంతులుగా పిల‌వ‌బ‌డుతారు. అది ఏదైనా స‌రే..! త‌మ వ‌ద్ద ఉన్న వ‌స్తువులు, ఆహారం… ఏవైనా స‌రే, స‌హాయం అవ‌స‌రం ఉన్న‌వారితో షేర్ చేసుకోవాలి. అప్పుడు ల‌భించే ఆనందమే సంతృప్తినిస్తుంది. ఇవి మేమ‌నే మాట‌లు కాదు, ఆ యువ‌కుడు అంటున్న‌వి..!

amod-sarang
అది ముంబైలోని కొలాబా ప్రాంతం. అక్క‌డికి కొంత దూరంలోనే అమోద్ సారంగ్ అనే యువ‌కుడు మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రెయిన‌ర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే నిత్యం అత‌ను కారులో వ‌చ్చీ పోయే కొలాబా మార్గంలో దీప‌క్ అనే ఓ వీధి బాలున్ని అత‌ను చూసేవాడు. కాగా ఒకానొక రోజు ప్ర‌త్యేకంగా ఆ బాలుడ్ని చూడ‌డం కోసమే అమోద్ కొలాబాకు వ‌చ్చాడు. అయితే అమోద్‌ను చూసి ముందుగా ఆ బాలుడు కొంత భ‌యప‌డ్డాడు. అయినా అమోద్ చేర‌దీయ‌డంతో వెంట‌నే అత‌ని కారులో ఎక్కాడు. అయితే అమోద్ ఆ బాలుడ్ని తీసుకెళ్లింది ఎక్క‌డికో తెలుసా..? ద‌గ్గ‌ర్లోనే ఉన్న స్టార్ బ‌క్స్ రెస్టారెంట్‌కు..!

స్టార్ బ‌క్స్ అంటే అదొక పోష్ కెఫెటేరియా. కేవ‌లం ధ‌నిక వ‌ర్గానికి చెందిన వారు మాత్ర‌మే వెళ్లే రెస్టారెంట్‌. ప్రీమియం కాఫీలు, స్నాక్స్ ఎన్నో ర‌కాలు అందులో దొరుకుతాయి. ధ‌ర కూడా మ‌నం ఊహించిన దానిక‌న్నా కొంచెం ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే అలాంటి రెస్టారెంట్‌కు దీప‌క్‌ను అమోద్ తీసుకెళ్లాడు. ఏం కావాలో చెప్ప‌మ‌ని అడిగాడు. అందుకు ఆ బాలుడు దీప‌క్ త‌న‌కు చీజ్ కేక్స్ కావాల‌ని చెప్పి వెంట‌నే వాటిని ఆర్డ‌ర్ ఇచ్చాడు. అయితే అవి వ‌చ్చే లోగా ఆ బాలున్ని వాష్ రూమ్‌కు తీసుకెళ్లి స్వ‌యంగా హ్యాండ్ వాష్ చేయించాడు. మళ్లీ డైనింగ్ టేబుల్ వ‌ద్ద‌కు వ‌చ్చి అత‌నికి కావ‌ల్సిన చీజ్ కేక్‌ల‌ను తినిపించాడు. ఆ బాలుడు తినిపిస్తే అమోద్ తానూ ఆ చీజ్‌కేక్‌ల‌ను తిన్నాడు. అప్పుడు ఆ బాలుడి క‌ళ్ల‌లో క‌నిపించిన ఆనందం వ‌ర్ణించ‌రానిది అంటాడు అమోద్‌. అలా ఆ బాలునికి కావ‌ల్సిన‌వి తినిపించాక మ‌ళ్లీ అత‌ను ఉండే ప్ర‌దేశం వ‌ద్ద దిగ‌బెట్టాడు అమోద్‌. దీన్నంత‌టినీ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో మిత్రుల‌తో షేర్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో అమోద్ పైన చెప్పిందే కాకుండా ఇంకా ఏమంటాడంటే… త‌న‌కు ఇది కొత్త కాద‌ని, అలాంటి ఎంతో మంది పిల్ల‌ల‌ను స్టార్ హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌కు తీసుకువెళ్లి వారికి ఓ పూట తృప్తిగా భోజ‌నం పెట్టించేవాడిన‌ని తెలియ‌జేశాడు. మ‌నం అలాంటి స్టార్ హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌కు వెళ్ల‌డం కొత్తేమీ కాదు, ఎన్నో సార్లు వెళ్లాం, అయినా అలాంటి పిల్ల‌ల‌కు భోజ‌నం పెట్టిస్తే క‌లిగే తృప్తే వేరు, అంటున్నాడు అమోద్‌. అత‌ని స‌హృద‌యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top