నేటి తరుణంలో చాలా మంది చిన్న విషయాలకే తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజానికి పరిశీలిస్తే అవి చాలా చిన్న కారణాలనే చెప్పవచ్చు. అలాంటి వాటిని భూతద్దంలో చూసి వాటికి ఓవర్‌గా రియాక్టయి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే ఏం చేసినా, ఎలా చేసినా నిజానికి ఆత్మహత్య అనేది పిరికి చర్యే. తాజాగా ఓ యువకుడు కూడా ఇదే కోవలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సూసైడ్ లెటర్ రాసి దాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల కార్యలయాలకు, పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలకు పంపాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే మరి నిజంగానే పోలీసులు వేధింపులకు గురి చేశారా, లేదా, అన్న విషయం మాత్రం సందేహంగానే ఉంది.
అతని పేరు శివ్ సరోజ్ కుమార్. వయస్సు 27 సంవత్సరాలు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని చుటియా అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. అయితే జూలై 29, 2017వ తేదీన అతను పాస్ పోర్టు పని మీద రాంచీ వెళ్లాడు. అక్కడ కొందరు అతన్ని కిడ్నాప్ చేసి డ్రగ్స్ బలవంతంగా ఎక్కించి అతని వద్ద ఉన్న సొమ్ము, ఇతర వస్తువుల (సెల్‌ఫోన్‌తో సహా)ను దోచుకెళ్లారట. దీంతో సరోజ్ తన దగ్గరి బంధువొకరికి ఎలాగో సమాచారం ఇవ్వగా అతను పోలీసులను తీసుకొచ్చి మడుగులో పడి ఉన్న సరోజ్‌ను హాస్పిటల్లో చేర్పించారు. అయితే అప్పటి నుంచి పోలీసులు తనను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని సరోజ్ కుమార్ ఆరోపిస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతను ఈ నెల 3వ తేదీన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందే తనకు చావుకు కారణం ఎవరో తెలియజేస్తూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల కార్యాలయాలకు, పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలు తన సూసైడ్ లెటర్లను పంపాడు. అయితే అవి అధికారులకు చేరే సరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లెటర్లో తన చావుకు కారణం చుటియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అజయ్ కుమార్ వర్మ, డీఎస్పీ శంభు కుమార్ సింగ్‌లేనని సరోజ్ పేర్కొన్నాడు. తాను, తండ్రి ఇంత వరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదని, అలాంటిది పోలీసులు విచారణ పేరిట తనకే కాకుండా, తన తండ్రి ప్రతిష్టకు భంగం కలిగించారని లెటర్లో రాశాడు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్టు తెలిపాడు.
కానీ దీనిపై పోలీసులు మరోలా చెబుతున్నారు. సరోజ్ కుమార్ ను విచారించేటప్పుడు అతను తనను తాను ఇంటెల్లిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా చెప్పుకున్నాడని, ఒకానొక సమయంలో మళ్లీ మాట మార్చి ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్ని అని చెప్పాడని, వివరాలు ఆరా తీస్తే అతను చెప్పినవి నకిలీవని తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. అతను ఏదో చట్ట వ్యతిరేక పని మీదే రాంచీ వచ్చాడని, అందులో భాగంగానే నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ కార్డులు క్రియేట్ చేసుకున్నాడని, ఆ విషయం తెలుస్తుందేమోననే భయంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఇక ఇందులో నిజానిజాలు ఏమిటో వారికే తెలియాలి. ఏది ఏమైనా సరోజ్ నిజంగా తనకు అన్యాయం జరిగి ఉంటే పోరాడి ఉండాలి కానీ చనిపోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూశారుగా, పోలీసులు ఏదైనా చెబుతారు, ఒక వేళ తప్పు చేసి ఉంటే దాన్ని కప్పి పుచ్చుకునేందుకు వారు ఏమైనా చేస్తారు..!