సొంత త‌ల్లిదండ్రులే వ‌ద్ద‌ని వ‌దిలించుకున్న ఓ బాలున్ని ఆమె క‌న్న త‌ల్లి క‌న్నా ఎక్కువ‌గా చూసుకుంది తెలుసా..?

”కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా..” అని ఓ క‌వి అమ్మ కాని ఓ అమ్మ‌లో ఉండే అమ్మ‌త‌నం గురించి చ‌క్క‌గా వివరించాడు. అవును, నిజంగా త‌ల్లి కాక‌పోయినా త‌ల్లిలా ఆద‌రించే మ‌హిళ‌లు కూడా చాలా మందే ఉంటారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే మ‌హిళ కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఆమె సొంత కుటుంబం నుంచి వెలివేయ‌బ‌డ్డ ఓ బాలున్ని అత్యంత దీన స్థితిలో ఉండ‌గా చేర‌దీసింది. 20 నెల‌ల పాటు క‌న్న త‌ల్లి క‌న్నా ఎక్కువ‌గా చూసుకుంది. ఆద‌రించి పెంచింది. దీంతో ఒక‌ప్పుటి ఆ బాలుడి రూపురేఖ‌లు అన్నీ మారిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ చేసిన ప‌నికి గాను 2016వ సంవ‌త్స‌రానికి గాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత స్ఫూర్తినిచ్చే వ్య‌క్తుల్లో మొద‌టి స్థానంలో నిలిచింది.

ఆమె పేరు అంజా రింగ్రెన్ ల‌వెన్‌. జ‌ర్మ‌నీ వాసి. కేర్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేస్తోంది. ఈమె త‌న భ‌ర్త‌తో క‌లిసి 2015 మార్చిలో నైజీరియాలో ప‌ర్య‌టించింది. అయితే అక్క‌డే ఓ ప్రాంతంలో 2 ఏళ్ల బాలున్ని చూసింది. ఆ బాలుడికి అప్పుడు ఒంటిమీద బ‌ట్ట‌లు లేవు. చాలా రోజులుగా తిండి లేక‌పోవ‌డంతో చిక్కి శ‌ల్య‌మైపోయాడు. స్నానం లేదు, ఎలాంటి ఆద‌ర‌ణ లేదు. దీంతో ఆ బాలుడు చూసేందుకే అత్యంత దీన స్థితిలో ఉన్నాడు. అయితే నిజానికి ఆ బాలుడికి కుటుంబం ఉంది. త‌ల్లిదండ్రి ఉన్నారు. మ‌రి ఎందుకు అత‌న్ని వీధిలో వదిలేశారంటే… ఆ బాలుడు దెయ్యం అట‌. అత‌నిలో దుష్ట శ‌క్తులు ఉన్నాయ‌ట‌. అందుక‌ని వారు అత‌న్ని అలా వ‌దిలేశారు. ఈ క్రమంలోనే అంత‌టి దీన స్థితిలో ఉన్న ఆ బాలున్ని అంజా చేర‌దీసింది. చూడ‌గానే చ‌టుక్కున వెళ్లి అత‌నికి నీరు, మంచి ఆహారం అందించింది. త‌రువాత త‌న‌తో తీసుకెళ్లింది.

ఈ క్ర‌మంలో ఆ బాలుడికి అంజా పేరు పెట్టింది. హోప్ అని అత‌న్ని పిలుచుకునేది. అలా హోప్ ఆమె వ‌ద్ద 20 నెల‌ల పాటు ఉన్నాడు. దీంతో ఇప్పుడు చ‌క్క‌గా త‌యార‌య్యాడు. ఒక‌ప్ప‌టి అత‌ని రూపురేఖ‌ల‌కు, ఇప్ప‌టి అత‌ని రూపురేఖ‌ల‌కు తేడాయే లేదు. అంత‌గా మారాడంటే అది అంజా చ‌ల‌వే. అయితే అలా అంజా ఆ బాలుడికి నైజీరియాలో నీరు, ఆహారం ఇస్తున్న‌ప్పుడు ఎవ‌రో ఫొటో తీశారు. దీంతో అది కాస్తా వైర‌ల్ అయింది అప్ప‌ట్లో. ఆ త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ 20 నెల‌ల‌కు ఆ బాలుడి ఫొటోను తీశారు. ఇక రెండు ఫొటోల్లోనూ బాలుడు అలా మారే స‌రికి అంజాను చాలా మంది ప్ర‌శంసిస్తున్నారు. ఒక బాలున్ని అంత‌టి దీనావ‌స్థ నుంచి చేర‌దీసినందుకు అంద‌రూ ఆమెకు అభినంద‌న‌లు తెల‌ప‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో జ‌ర్మ‌నీలో ప్రింట్ అయ్యే ఊమ్ అనే మ్యాగ‌జైన్ త‌న టాప్ 100 వ‌ర‌ల్డ్ వైడ్ ఇన్‌స్పిరేష‌న్ ప‌ర్స‌న్స్ లిస్ట్‌లో అంజాకు మొద‌టి స్థానం క‌ట్ట‌బెట్టింది. ఆమె బాలుడికి నీరు ఇచ్చి ఆహారం పెడుతున్న‌ప్పుడు తీసిన‌ ఫొటోనే బాగా ప్రేర‌ణ ఇచ్చే ఫొటోగా కితాబునిచ్చింది. ఇక ఆ టాప్ 100 జాబితాలో అంజా త‌రువాత ఎవ‌రున్నారో తెలుసా..? అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా. అవును, ఆయ‌న్ను నెట్టేసి అంజా మొద‌టి స్థానంలో నిలిచిందంటేనే మ‌న‌కు తెలుస్తుంది, ఆమెలో సేవాభావం, మాన‌వ‌త ఎలాంటివో. నిజంగా.. ఉండాలి త‌ల్లీ… మీ లాంటి అమ్మ‌లు..!

Comments

comments

Share this post

scroll to top