ఈ మ‌హిళ రోజూ 90 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి రైల్వే స్టేష‌న్‌లో కూలీగా ప‌ని చేస్తోంది. ఎందుకో తెలిస్తే క‌న్నీళ్లు వ‌స్తాయి..!

జీవిత‌మంటే అంతే. ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దు. ఒక్కోసారి అనుకోని అదృష్టాన్ని ఇచ్చి అంద‌లం ఎక్కిస్తే… ఒక్కోసారి అథః పాతాళానికి తొక్కేస్తుంది. దీంతో అలాంటి స్థితిలో ఉన్న‌వారికి కోలుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంది. ఎంతో క‌ఠోర శ్ర‌మ చేయాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి రెక్కాడితే గానీ డొక్కాడదు. అలాంటి దీన స్థితికి కొంద‌రు చేరుకుంటారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా సరిగ్గా ఇలాంటి కోవ‌కు చెందిన ఓ మ‌హిళ గురించే. భ‌ర్త ఉన్న‌ప్పుడు ఆమె కుటుంబం అంద‌రు మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లాగే బాగానే బ‌తికారు. కానీ… అనుకోకుండా పాడు అనారోగ్యం భ‌ర్త‌ను మింగేసింది. దీంతో గ‌త్యంత‌రం లేక కుటుంబ పోష‌ణ‌ను ఆమె నెత్తిన వేసుకుంది. ముగ్గురు పిల్ల‌ల‌ను, అత్త‌ను పోషిస్తూ అత్యంత దుర్భ‌ర స్థితిలో జీవితం కొన‌సాగిస్తోంది.

ఆమె పేరు సంధ్య మ‌ర‌వి. వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు. ఉంటున్న‌ది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జబ‌ల్‌పూర్ స‌మీపంలో ఉన్న కుందుమ్ అనే గ్రామం. అక్క‌డికి సుమారుగా 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌ట్ని రైల్వే స్టేష‌న్‌లో ఆమె కూలీగా ప‌నిచేస్తోంది. గ‌తేడాది అక్టోబ‌ర్ 22న సంధ్య భ‌ర్త అనారోగ్యం కార‌ణంగా మృతి చెందాడు. దీంతో ముగ్గురు పిల్ల‌లు, అత్త భారం ఆమెపై ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఇరుగు పొరుగు వారి స‌ల‌హాతో ఆమె రైల్వే స్టేష‌న్‌లో కూలీగా ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకుంది. వెంట‌నే అందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, ఆమెకు 36వ నంబ‌ర్ బ్యాడ్జి ల‌భించింది. దీంతో ఆ స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న 45 మంది మ‌గ కూలీల్లో ఈమె ఒక్క‌తే ఆడ కూలీగా చేరింది.

అప్ప‌టి నుంచి అలా ఆమె ఇంటి నుంచి రోజూ 45+45= 90 కిలో మీట‌ర్ల దూరం వెళ్లి ఆ స్టేష‌న్ లో కూలీగా ప‌నిచేసి తిరిగి ఇంటికి వ‌చ్చి పిల్ల‌ల పోష‌ణ చూస్తోంది. మ‌రోవైపు మంచాన ప‌డిన అత్త‌ను కూడా పోషిస్తోంది. అయితే ఆమె దీన గాథ గురించి తెలిసిన వారు స‌హాయం చేస్తామ‌న్నా ఆమె స్వీక‌రించ‌దు. తాను క‌ష్ట‌ప‌డి సంపాదించి ఆ డ‌బ్బుతోనే పిల్ల‌ల‌ను చ‌దివిస్తాన‌ని, వారిని గొప్ప ఆఫీస‌ర్ల‌ను చేస్తాన‌ని ఆమె చెబుతోంది. ఆమె ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

Comments

comments

Share this post

scroll to top