మనం తలచుకోవాలనే గానీ.. నిజంగా ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కరెక్ట్‌గా దృష్టి పెట్టి మనస్సు లక్ష్యంపై నిలపాలే గానీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అదిగో ఆ మహిళ చేసింది కూడా అదే. ఒకప్పుడు ఆమె వీధుల్లో తిరుగుతూ భర్తతో కలిసి పచ్చళ్లు అమ్ముకునేది. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పచ్చళ్ల కంపెనీకి ఏకంగా ఓనర్ అయింది. ఎన్నో వందల వెరైటీ పచ్చళ్లను, ఆహార పదార్థాలను అమ్ముతూ శభాష్ అనిపించుకుంటోంది. ఈ క్రమంలోనే పలు అవార్డులు, రివార్డులు కూడా ఆమెను వరించాయి. ఇంతకీ ఆమె ఎవరంటే…
ఆమె పేరు కృష్ణా యాదవ్. ఉంటున్నది ఢిల్లీలో. అయితే ఒకప్పుడు ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ జిల్లాలో ఉండేది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుండేది. అయితే కృష్ణ పెద్దగా చదువుకోలేదు. భర్త చదువు కూడా అంతంత మాత్రమే. అయితే ఇద్దరూ కలసి బతుకు దెరువు కోసం పచ్చళ్ల తయారీని ప్రారంభించారు. పలు రకాల పచ్చళ్లను తయారు చేసి అమ్మేవారు. అయితే అక్కడ వారి వ్యాపారం అంతంత మాత్రంగానే సాగేది. దీంతో వారు ఢిల్లీ వెళ్లి అదే వ్యాపారం చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే వారు ఢిల్లీకి మకాం మార్చారు. 1996లో వారు ఢిల్లీకి చేరారు. అప్పుడే కృష్ణ న్యూ ఢిల్లీలోని కేవీకే ఉజ్వా అనే సంస్థలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. దీంతో శిక్షణలో అందిన మెళకువలతో ఆమె మళ్లీ పచ్చళ్ల వ్యాపారమే ప్రారంభించింది. అప్పుడు ఆమె మొదట రూ.500 ఖర్చు పెట్టింది. పచ్చడి తయారీ కోసం కావల్సిన సరుకులను కొన్నది.
ఆ తరువాత మరో రూ.3వేలను పెట్టి కలివి (హిందీలో కరోండా) అనే కాయతో 100 కిలోల పచ్చడి పెట్టింది. దీంతోపాటు 5 కిలోల మిరపకాయ పచ్చడి కూడా పెట్టింది. వాటిని అమ్మగా ఆమెకు రూ.5,250 లాభం వచ్చింది. దీంతో మళ్లీ ఆమె అలాగే పచ్చళ్లను తయారు చేయడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. అలా వెరైటీ వెరైటీ పచ్చళ్లను, ఇతర ఆహార పదార్థాలను ఆమె స్వగృహ ఫుడ్స్‌లా అమ్మడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో వారి వ్యాపారం కాస్తా దిన దినాభివృద్ధి చెందింది. దీంతో ఇప్పుడు వారు శ్రీకృష్ణ పికిల్ అనే కంపెనీ పేరిట ఏటా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇప్పటికీ ఏదో ఒక వెరైటీ ఫుడ్‌తో ఆమె పచ్చడి తయారు చేస్తూనే ఉంటుంది. వాటికి ఎప్పటికప్పుడు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది.
అలా కృష్ణ ఆమె భర్తలు కలిసి ఇప్పుడు ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణకు పలు అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. 2015లో రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కార్ 2015 అవార్డును కృష్ణ అందుకుంది. అలాగే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆమె ఉత్తమ మహిళా వ్యాపారవేత్త అవార్డు కింద రూ.51వేల నగదు పురస్కారాన్ని కూడా అందుకుంది. పెద్దగా చదువుకోకపోయినా, పేద కుటుంబం నుంచి వచ్చినా ఇప్పుడు కృష్ణ అలా కోట్లాది రూపాయలు సంపాదిస్తుండడం నిజంగా అలాంటి మహిళలందరికీ ఆదర్శనీయం కదా..!