ఆ మ‌హిళ త‌న బిడ్డ‌ను రూ.2,500ల‌కు విక్ర‌యించి, దాంతో 2 మేక‌ల‌ను కొనుగోలు చేసింది… ఎందుకంటే..?

ప‌సికందు జ‌న్మిస్తే ఏ త‌ల్లైనా ఏం చేస్తుంది? మాతృమూర్తి అయినందుకు గ‌ర్వ ప‌డుతుంది. అది మొద‌టి సారి అయితే. అలా కాకున్నా రెండో సారో, మూడో సారో చిన్నారికి జ‌న్మ‌నిచ్చినా త‌ల్లి హృద‌యం ప‌డే ఆనందం వ‌ర్ణ‌నాతీతం. ఆ స‌మయంలో ఆమెకు క‌లిగే అనుభూతి ఆమెకే సొంతం. ఇత‌రులెవ‌రూ దాన్ని అనుభ‌వించ‌లేరు. న‌వ‌మాసాలు మోసిన ఆ త‌ల్లి చిన్నారి జ‌న్మించిన త‌రువాత త‌న బిడ్డ‌ను చూసుకుని ఆ బాధ‌నంతా మ‌రిచిపోతుంది. అయితే ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మాత్రం అలా కాదు. అప్పుడే పుట్టిన త‌న కొడుకును డ‌బ్బు కోసం మ‌రో మ‌నిషికి అమ్మేసింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే ఆమె అలా ఎందుకు చేసిందో తెలుసా..?

birhor

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆనో బిర్హోర్ అనే మ‌హిళ‌కు ఆరుగురు సంతానం. అందులో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా అలా ఉండ‌గానే మ‌ళ్లీ ఆమె గ‌ర్భం దాల్చింది. ఈ క్ర‌మంలో ఆమె భ‌ర్త కూడా అనుకోకుండా ప్ర‌మాద‌వ‌శాత్తూ మృతి చెందాడు. దీంతో ఓవైపు గ‌ర్భంతో ఉన్న బిర్హోర్‌కు ఆరుగురు పిల్ల‌ల‌ను పోషించ‌డం, త‌న క‌డుపులో ఉన్న బిడ్డ సంర‌క్షణ చూసుకోవ‌డం క‌ష్టంగా మారింది. పూట గ‌డ‌వ‌డం కోసం తాళ్లను త‌యారు చేసి అమ్మ‌డం ప్రారంభించింది. కాగా ఇటీవ‌లే ఆమెకు మ‌రో మ‌గబిడ్డ జ‌న్మించాడు. అయితే ఈ సారి ఆమె త‌న బిడ్డ‌ను చూసి మురిసిపోలేదు. ఇప్ప‌టికే పూట గ‌డ‌వ‌డం క‌ష్టంగా ఉంటే ఇక ఈ బిడ్డ‌ను ఎలా పెంచాల‌నో, ఏమోగానీ ఆమె ఓ నిర్ణ‌యం తీసుకుంది. ఆ బిడ్డ‌ను అమ్మేయాల‌ని!

బిర్హోర్ నివ‌సించే ప్రాంతానికే చెందిన కేదార్ సావు అనే వ్య‌క్తికి న‌లుగురు కూతుళ్లు ఉన్నారు. కాగా అత‌ను ప్ర‌స్తుతం పుత్ర సంతానం కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్ర‌మంలో బిర్హోర్ త‌న మ‌గ శిశువును అత‌నికి రూ.2,500కు అమ్మేసింది. దాంతో జీవ‌నాధారం కోసం ఓ రెండు మేక‌ల‌ను కొనుగోలు చేసింది. కాగా ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టారు. చ‌ట్ట‌రీత్యా శిశువుల‌ను అలా విక్ర‌యించ‌డం నేరం కాబ‌ట్టి అమ్మినందుకు బిర్హోర్‌పై, కొనుగోలు చేసినందుకు కేదార్‌పై కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. అయినా అలా అరెస్టు చేసినా ఎవ‌రికి న‌ష్టం? వారిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ స‌భ్యుల‌కే న‌ష్టం! అప్పుడు వారు కూడా ఏ జీవ‌నోపాధి దొర‌క్క ఇలాగే చేయ‌డం మొద‌లు పెడ‌తారు. అది అంత‌టితో ఆగ‌దు. అలా కొన‌సాగుతూనే ఉంటుంది. ఇలా జ‌ర‌గ‌డం కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వ‌మే ఏదో ఒక‌టి చేయాల్సి ఉంది. అంతేక‌దా..!

Comments

comments

Share this post

scroll to top